ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Environment : మానవ చర్యల వల్లే..

ABN, Publish Date - Aug 01 , 2024 | 06:13 AM

మనిషి అత్యాశకు పోయి ప్రకృతితో ఆటలాడితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది! అలనాటి కేదారనాథ్‌ వరదల నుంచి.. కేరళను ఏటా కుదిపేస్తున్న వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ఉత్పాతాలన్నీ ఇందుకు ఉదాహరణలే. పశ్చిమ కనుమల స్థితిగతులపై అంచనా వేయడానికి 2010 మార్చిలో అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు

  • వయనాడ్‌ విలయానికి కారణం అదే

  • కేరళలో తరచూ ప్రమాదాలు అందుకే

  • పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ ధ్వజం

  • పశ్చిమ కనుమలు పర్యావరణపరంగా సున్నితమైనవంటూ 2011లో నివేదిక

  • అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, మైనింగ్‌పై ఆంక్షలు విధించాలని సూచన

  • తిరస్కరించిన కేరళ రాజకీయ పార్టీలు

  • ఇప్పటికీ అమలు చేయని ప్రభుత్వాలు

- సెంట్రల్‌ డెస్క్‌ : మనిషి అత్యాశకు పోయి ప్రకృతితో ఆటలాడితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది! అలనాటి కేదారనాథ్‌ వరదల నుంచి.. కేరళను ఏటా కుదిపేస్తున్న వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ఉత్పాతాలన్నీ ఇందుకు ఉదాహరణలే. పశ్చిమ కనుమల స్థితిగతులపై అంచనా వేయడానికి 2010 మార్చిలో అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన 14 సభ్యుల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన మాధవ్‌ గాడ్గిల్‌ అదే మాట చెబుతున్నారు. మంగళవారంనాడు వయనాడ్‌ను వణికించిన విలయం మానవుల పాపాల ఫలితమేనని ఆయన తేల్చిచెప్పారు. అద్భుతమైన జీవావరణానికి, అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న జీవజాతులకు ఆలవాలమైన పశ్చిమ కనుమలను.. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన (ఎకలాజికల్లీ సెన్సిటివ్‌) మూడు జోన్లు(ఈఎ్‌సజెడ్‌ 1, 2)గా విభజించాలంటూ ఆయన నేతృత్వంలోని కమిషన్‌ 2011 ఆగస్టు 31న కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దేశ పడమటి తీరాన గుజరాత్‌ నుంచి తమిళనాడు దాకా ఆరు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో దాదాపు 70 శాతం ప్రాంతంలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకూ, మైనింగ్‌కు, అభివృద్ధి పనులకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని గాడ్గిల్‌ కమిషన్‌ తన నివేదికలో సూచించింది. ఈఎ్‌సజెడ్‌-1లో మైనింగ్‌ అనుమతులను తగ్గించుకుంటూ వెళ్లి.. 2016 నాటికి అక్కడ మైనింగ్‌ను పూర్తిగా నిషేధించాలని.. రెండుజోన్లలోనూ 2015 నాటికి ప్లాస్టిక్‌ సంచుల వాడకాన్ని, 2020 నాటికి అన్ని రకాల క్రిమిసంహారక పురుగుమందుల వినియోగాన్ని నిషేధించాలని సూచన చేసింది. తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతం గాడ్గిల్‌కమిషన్‌ గుర్తించిన జోన్‌-1 లోనిదే కావడం గమనార్హం. ఇక, ఈఎ్‌సజెడ్‌-2లో మాత్రం మైనింగ్‌ కార్యకలాపాలను అత్యంత కఠినమైన ఆంక్షలతో కొనసాగించవచ్చని, ఎప్పటికప్పుడు మైనింగ్‌పై సోషల్‌ ఆడిట్‌ నిర్వహించాలని కమిషన్‌ సూచించింది. రెండు జోన్లలోనూ.. కొత్తగా ఎలాంటి డ్యాములు, రైల్వే లైన్లు, పెద్ద పెద్ద రహదారులు నిర్మించకూడదని.. అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు మళ్లించడంపైన నిషేధం విధించాలని.. పశ్చిమ కనుమల్లో 75ు ప్రాంతాన్ని పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం గా ప్రకటించాలని, అక్కడ ఏ ప్రాజెక్టుకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ అనుమతులు ఇవ్వరాదని ఇలా సూచనలు చేసింది.

పార్టీలకతీతంగా ఆగ్రహం

కేరళలో అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ సర్కారు, ప్రతిపక్ష పార్టీలు, సైరో-క్యాథలిక్‌ మలబార్‌ చర్చ్‌.. ఆ నివేదిక అమలును ఆపేయాలంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్లాయి. కానీ, సర్వోన్నత న్యాయస్థానం వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ అత్యవసరంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. గాడ్గిల్‌ కమిషన్‌ నివేదికను తిరస్కరించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, వామపక్షాలు.. ఇలా పార్టీలకు అతీతంగా కేరళలో రాజకీయ నాయకులందరూ కమిషన్‌ నివేదికను చెత్తగా అభివర్ణించారు. ఆ ప్రాంతవాసుల జీవనోపాధి గురించి పట్టించుకోకుండా కమిషన్‌ ఆ నివేదిక ఇచ్చిందని.. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆ నివేదిక పశ్చిమ కనుమల ప్రాంతంలో అభివృద్ధిని పూర్తిగా నిలిపివేస్తుందని మండిపడ్డారు. దీంతో, కేంద్రం గాడ్గిల్‌ కమిషన్‌ నివేదికను పరిశీలించడానికి ప్రముఖ స్పేస్‌ సైంటిస్ట్‌ జి.కస్తూరి రంగన్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి వర్కింగ్‌ గ్రూపును నియమించింది. కానీ.. కస్తూరి రంగన్‌ కమిటీ కూడా జోనల్‌ వర్గీకరణలో చిన్నచిన్న మార్పులు సూచించింది. పశ్చిమకనుమల్లో 37ు ప్రాంతాన్ని (గాడ్గిల్‌ కమిషన్‌ సూచించిన 75 శాతంలో సగం ప్రాంతం) పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటించాలనే సవరణతో ఆ నివేదికను ఆమోదించింది. కానీ, ఇప్పటికీ ఆ ఈఎ్‌సజెడ్‌లను నోటిఫై చేయకపోవడం గమనార్హం. కాగా, కస్తూరి రంగన్‌ కమిటీ సూచించిన చిన్నచిన్న మార్పులను సైతం మాధవ్‌ గాడ్గిల్‌ వ్యతిరేకించారు. ఆ చిన్నచిన్న వెసులుబాట్లు కూడా పశ్చిమ కనుమలకు తీరని నష్టం చేస్తాయని హెచ్చరించారు. తన హెచ్చరికలను కేరళ సర్కారు పట్టించుకోలేదని.. అందుకే ఆ రాష్ట్రంలో తరచుగా ప్రకృతి ఉత్పాతాలు సంభవిస్తున్నాయని గాడ్గిల్‌ బుధవారం పేర్కొన్నారు.

జీవవైవిధ్యానికి పట్టుగొమ్మ

పశ్చిమ కనుమలు.. మన భారతదేశ మ్యాప్‌లో పడమటివైపున గుజరాత్‌ నుంచి మొదలై మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ మీదుగా తమిళనాడులోని కన్యాకుమారి దాకా.. 1600 కిలోమీటర్ల పొడవున ఒక పచ్చటి గీతలాగా విస్తరించిన పర్వత శ్రేణులు! దేశ జనాభాలో 40ు భూభాగానికి... దాదాపు 24.5 కోట్ల జనాభాకు నీటివనరులను అందించే జలప్రదాతలు ఈ పశ్చిమ కనుమలు. కృష్ణా, గోదావరి, కావేరి వంటి ప్రధానమైన నదులకు.. తుంగ, భద్ర, భీమా, మలప్రభ, ఘటప్రభ, హేమావతి, కాబిని వంటి ఉపనదులకు పుట్టినిల్లు. అంతరించే ముప్పును ఎదుర్కొంటున్న జీవుల జాబితాలో ఉన్న 325 జీవజాతులు ఈ పశ్చిమకనుమల్లో ఉన్నాయి. ఇంతటి జీవవైవిధ్యానికి, పర్యావరణ అద్భుతాలకు ఆటపట్టయిన పశ్చిమ కనుమలపై మనిషి అత్యాశ అనే పడగ నీడ ఉన్నంతకాలం అవి ప్రమాదంలో ఉన్నట్టే! వాటితోపాటే మనుషులు కూడా ప్రమాదంలో ఉన్నట్టే!!

Updated Date - Aug 01 , 2024 | 06:22 AM

Advertising
Advertising
<