ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాత్రికిరాత్రే బుల్డోజర్లతో రాలేరు

ABN, Publish Date - Nov 07 , 2024 | 05:34 AM

ఆక్రమణల తొలగింపు పేరుతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటూ సుప్రీంకోర్టు బుధవారం తీవ్రంగా తప్పు పట్టింది. రాత్రికిరాత్రే బుల్డోజర్లు పంపి అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్లను కూల్చివేయజాలదని స్పష్టం చేసింది. 3.7

నోటీసులు ఇవ్వకుండా చాటింపు వేస్తారా?.. ఇది అహంకారం, అరాచకం

ఆక్రమణల పేరుతో ఇళ్లను కూల్చలేరు

నిబంధనలు పాటించాల్సిందే

యూపీ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆక్రమణల తొలగింపు పేరుతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటూ సుప్రీంకోర్టు బుధవారం తీవ్రంగా తప్పు పట్టింది. రాత్రికిరాత్రే బుల్డోజర్లు పంపి అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్లను కూల్చివేయజాలదని స్పష్టం చేసింది. 3.7 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించారన్న కారణంతో ఇల్లును కూల్చి వేసినందుకు బాధితునికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు బాధ్యులైన అధికారులపై దర్యాప్తు జరపాలని సూచించింది. రోడ్డు విస్తరణ సమయంలో ఎలా వ్యవహరించాలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 2019లో రోడ్డు విస్తరణ పేరుతో.. ఆక్రమణలో ఉందంటూ తన ఇంటిని కూల్చి వేశారని ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌కు చెందిన మనోజ్‌ తిబ్రేవాల్‌ ఆకాశ్‌ 2020 నవంబర్‌ 7న పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘ఇళ్లను కూల్చివేయడానికి మీరు రాత్రికి రాత్రే రాలేరు. ఖాళీ చేసేందుకు ఆ కుటుంబానికి సమయం కూడా ఇవ్వలేదు. ఇంట్లోని సామాను మాటేమిటి?’’ అని ధర్మాసనం యూపీ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ‘‘ఇది అహంకారంతో చేసిన చర్యే తప్ప చట్టబద్ధమైనది కాద’’ని స్పష్టం చేసింది. 2019లో మహరాజ్‌గంజ్‌ జిల్లాలో ఇదే పద్ధతిలో 123 నివాసాలను కూల్చివేశారని తెలిపింది. ‘‘ఇలా ఇళ్లను ఎలా కూల్చి వేస్తారు? ఇది పూర్తి అరాచకం కాదా? నడుచుకుంటూ వస్తారు... ఎవరో ఒకరి ఇంటిని కూల్చి వేస్తారు... నోటీసు లేదు, ఏమీ లేదు’’ అని వ్యాఖ్యానించింది. హద్దులు గుర్తించకుండా, నిబంధనలు పాటించకుండా, నోటీసులు ఇవ్వకుండా ఎందుకు ఇలా చేశారని ప్రశ్నించినప్పుడు ‘‘తుడుం దెబ్బ (మునాది), లౌడ్‌ స్పీకర్‌ ద్వారా చాటింపు వేశామ’’ని ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇచ్చారు. ‘‘అంటే ఏ వ్యక్తికీ నోటీసు ఇవ్వలేదన్నమాట’’ అని ధర్మాసనం మళ్లీ ప్రశ్నించింది. దేన్ని ఆధారం చేసుకొని అక్రమ కట్టడంగా గుర్తించారని అడిగింది. రోడ్డు విస్తరణ కోసం ఆ స్థలాలను తీసుకున్నామని న్యాయవాది జవాబిచ్చారు. ‘‘అదొక సాకు మాత్రమే. మీ వద్ద నిజమైన కారణాలు ఉన్నట్టు కనిపించడం లేద’’ని వ్యాఖ్యానించింది. ‘‘తుడుం ద్వారా చాటింపు వేసి ఇళ్లను ఖాళీ చేయండి. మేం కూల్చడానికి వచ్చామని చెప్పలేరు’’ అని స్పష్టం చేసింది. ఇలాంటి ఇతర సంఘటనలపైనా దర్యాప్తు జరిపి, బాఽధ్యులైన కాంట్రాక్టరు, అధికారులను గుర్తించాలని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు, అవసరమైతే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సూచించింది.


రాష్ట్రాలకు మార్గదర్శకాలు

  • తొలుత మ్యాపులు, రికార్డుల ఆధారంగా సర్వే జరిపి రోడ్డు వెడల్పు ఎంత ఉందో తెలుసుకోండి

  • దాని ఆధారంగా ఆక్రమణలను గుర్తించండి

  • ఆక్రమణ ఉన్నట్టు గుర్తిస్తే దానిని తొలగించాలంటూ ఆక్రమణదారుకు నోటీసు ఇవ్వండి

  • ఈ నోటీసుపై అభ్యంతరాలు ఉంటే దానిని చెప్పేందుకు వీలుగా ‘స్పీకింగ్‌ ఆర్డర్‌’ ఇవ్వండి. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఇది తప్పనిసరి.

  • ఒకవేళ అధికారులు ఆ అభ్యంతరాలను తిరస్కరిస్తే తగిన వ్యవధిలో ఆక్రమణలు తొలగించాలంటూ నోటీసు ఇవ్వాలి

  • అప్పటికీ ఆ నోటీసుకు స్పందించకపోతే ఆక్రమణలు తొలగించవచ్చు.

  • రోడ్డు విస్తరణ విషయానికి వస్తే... సంబంధిత రహదారి పక్కన తగినంత స్థలం, ప్రభుత్వ స్థలం లేనప్పుడు మాత్రమే పక్కనున్న జాగాలను భూసేకరణ విధానం ద్వారా తీసుకోవాలి.

Updated Date - Nov 07 , 2024 | 05:34 AM