Pune accident case : డబ్బుకు వ్యవస్థ దాసోహం
ABN, Publish Date - Jun 01 , 2024 | 05:35 AM
దేశంలో వ్యవస్థలు ఎంత ఘోరంగా పనిచేస్తున్నాయి.. ఎంత అవినీతిమయమైపోయాయి అనేదానికి పెద్ద ఉదాహరణగా నిలిచిన కేసు.. పుణె యాక్సిడెంట్ కేసు! మైనారిటీ తీరని ఓ కుర్రాడు.. పూటుగా మద్యం తాగేసి, 200
వ్యవస్థాగత భ్రష్టత్వానికి నిలువుటద్దం పుణె యాక్సిడెంట్ కేసు
రెండు ప్రాణాలను బలిగొన్న నిందితుడికి గులాములుగా
మారిన రాజకీయ నాయకులు, పోలీసులు, వైద్య నిపుణులు
అడుగడుగునా కేసును నీరుగార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు
పుణె పోలీస్ కమిషనర్‌కు డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ ఫోన్
ఈ కేసులో చూసీచూడనట్టు పోవాలంటూ సలహా?
ఏసీపీ కుర్చీలో కూర్చోబెట్టి, నిందితుడికి పోలీసుల మర్యాదలు
రక్తనమూనాను మార్చేసి, తప్పుడు నివేదిక ఇచ్చిన వైద్యులు
‘‘కులము గలుగువారు.. గోత్రంబు గలవారు.. విద్యచేత విర్రవీగువారు.. పసిడిగల్గువాని బానిస కొడుకులు’’.. అన్నాడు ఆనాడు కవి వేమన! శతాబ్దాలు గడిచినా ఆ నిత్యసత్యంలో ఏ మార్పూ రాలేదు! పుణె యాక్సిడెంట్ కేసులో.. రెండు నిండు ప్రాణాలను బలిగొన్న ఓ కారున్న మైనర్‌ను కాపాడ్డానికి రాజకీయ నాయకులు, వైద్యులు, పోలీసులు అందరూ ఒక్కటయ్యారు. డబ్బుకు, పరపతికి గులాములై వేమన మాట నిజం చేశారు!!
దేశంలో వ్యవస్థలు ఎంత ఘోరంగా పనిచేస్తున్నాయి.. ఎంత అవినీతిమయమైపోయాయి అనేదానికి పెద్ద ఉదాహరణగా నిలిచిన కేసు.. పుణె యాక్సిడెంట్ కేసు! మైనారిటీ తీరని ఓ కుర్రాడు.. పూటుగా మద్యం తాగేసి, 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి.. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువతీయువకుల ప్రాణాలను బలిగొంటే.. ఆ కుర్రాణ్ని కాపాడ్డానికి అతడి తండ్రి ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కే ఫోన్ చేశాడు! ఆయన.. పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే.. పోలీసులపై ఒత్తిడి తేవడానికి తెల్లవారుజామున పోలీస్ స్టేషన్‌కే వచ్చి కూర్చున్నాడు!! పోలీసులు, వైద్యులు నిందితుడి తండ్రి వెదజల్లిన డబ్బుకు దాసోహమయ్యారు. అయితే.. ఇద్దరి ప్రాణాలు తీసిన నిందితుడు కేవలం మైనర్ అనే కారణంతో బెయిల్ ఇచ్చిన జువెనైల్ జస్టిస్ బోర్డు జడ్జి ఎల్‌ఎన్ ధన్వాడే.. బెయిల్ షరతుగా యాక్సిడెంట్లపై 300 పదాల వ్యాసం రాయాలని, 15 రోజులపాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించడమే ఈ కేసు గతి మారడానికి కారణమైంది. ప్రజాగ్రహం వెల్లువెత్తి అన్ని వ్యవస్థలూ అటెన్షన్‌లోకి రావడానికి కారణమైంది!! లేదంటే.. ఈ కేసు కేవలం ఒక ‘హిట్ అండ్ రన్’ కేసుగా చీకటిలో నిశ్శబ్దంగా కలిసిపోయి ఉండేదేమో! ప్రజాగ్రహం వల్లనే జువెనైల్ జస్టిస్ బోర్డు మే 22న ఈ కేసును తిరగదోడి, మళ్లీ విచారణ జరిపి.. నిందితుడికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసి జూన్ 5 వరకూ అతణ్ని అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏసీపీ కుర్చీలో కూర్చోబెట్టి రాచమర్యాదలు..
పుణె యాక్సిడెంట్ వార్త తెలియగానే అప్రమత్తమై ఎరవాడ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లిన పాత్రికేయులకు అక్కడ నివ్వెరపోయే దృశ్యాలు కనిపించాయి! నిందితుడిని పోలీసులు ఏసీపీ కుర్చీలో కూర్చోబెట్టారు! అతడికి కుటుంబసభ్యులు పిజ్జా తెచ్చిపెడితే చూస్తూ కూర్చున్నారు. మృతుల బంధువులు పోలీ్‌సస్టేషన్‌కు వస్తే వారితో అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. ఈ యాక్సిడెంట్‌లో చనిపోయిన యువతి సొంతూరు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్. ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులంతా అక్కడే ఉన్నారు. పుణెలో ఆమెకు సంబంధించిన వ్యక్తి ఆమె మామయ్య ఒక్కరే ఉన్నారు. ఆమె తరఫున ఆయన పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తుకు వస్తే.. ‘నువ్వెవరివి? తల్లిదండ్రులు రావాలి కదా?’ అని ప్రశ్నించారు. ఆయన్ను అసలు మాట్లాడనీయకుండా చేసి.. తమ పని తాము చేసుకుపోయారు. మూడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లతో కేసు పెట్టారు. దీనిపై విమర్శలు రావడంతో మళ్లీ 304 సెక్షన్‌తో రివైజ్ చేశారు.
వైద్యవృత్తికే అవమానం..
మే 19న.. తెల్లవారాక ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ నుంచి ఆస్పత్రికి మారింది! అప్పటిదాకా నాయకులను, పోలీసులను ‘మేనేజ్’ చేసిన నిందితుడి తండ్రి.. ఆస్పత్రిలోనూ దాదాపు రూ.50 లక్షలు నీళ్లలా వెదజల్లాడు! దీంతో వైద్యులు నిందితుడి రక్తనమూనా తీసుకోవడానికి తాత్సారం చేశారు. పొద్దున తొమ్మిది గంటలకు అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్తే.. 11 గంటలకు రక్తనమూనాలను తీసుకున్నారు. ఇలా ఆలస్యం చేయడం వల్ల.. పరీక్షల్లో ఆల్కహాల్ శాతం తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పోనీ అలా తీసుకున్న నమూనానైనా పరీక్షించి నివేదిక ఇచ్చారా అంటే.. అదీ లేదు. అతడి రక్త నమూనాను చెత్తబుట్టలో పడేసి అతడి తల్లి రక్తనమూనా పరీక్షించి తప్పుడు నివేదిక ఇచ్చారు. ఈ విషయం బయటపడడంతో బాలుడి రక్తనమూనాను మళ్లీ సేకరించి పరీక్ష చేశారు. అప్పుడు.. ఈ తప్పుడు పనికి పాల్పడిన అజయ్‌తవాడే, శ్రీహరి హల్నోర్ అనే ఇద్దరు డాక్టర్లను డిస్మిస్ చేశారు.
రాజకీయ జోక్యం..
నిందితుడైన మైనర్ తండ్రి.. పుణెలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో ఆయన విస్తృతంగా రాజకీయ పరిచయాలున్నాయి. ఆ పరిచయాలతోనే.. తన కొడుకును కాపాడుకునేందుకు ఆయన నేరుగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌కు ఫోన్ చేసినట్టు సమాచారం. ఆయన పుణె సీపీకి ఫోన్ చేసి ఈ కేసులో చూసీ చూడనట్టు పోవాలని సూచించినట్టు ఆరోపణలున్నాయి. ఇక.. స్థానిక ఎన్సీపీ ఎమ్మెల్యే సునీల్ టింగరేకైతే తెల్లవారుజామున 2.30 నుంచి 3.45 నడుమ.. నిందితుడి తండ్రి 45సార్లు ఫోన్ చేశారు! గాఢనిద్రలో ఉండి ఆ ఎమ్మెల్యే ఫోన్ ఎత్తకపోతే.. నేరుగా ఆయన ఇంటికి వెళ్లి, నిద్రలేపి తీసుకెళ్లి ఎరవాడ పోలీ్‌సస్టేషన్‌లో కూర్చోబెట్టారు. దీనిపై అజిత్‌పవార్, సునీల్ టింగరేను ప్రశ్నిస్తే వారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గవద్దని పోలీసులకు చెప్పడానికే తాను ఫోన్ చేశానని అజిత్ పవార్.. ఒక ‘బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి’గా మాత్రమే అంత తెల్లవారుజామున హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని సునిల్ టింగరే చెప్పారు!!
మేజర్‌గా పరిగణించవచ్చా?
జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015లోని సెక్షన్ 15 ప్రకారం.. కనీసం ఏడేళ్లు అంతకుమించి శిక్ష పడే హత్య, అత్యాచారం వంటి హేయమైన, అమానవీయ నేరాలకు పాల్పడినవారు మైనర్‌లైనా (16-18 ఏళ్లవారు) మేజర్లుగా పరిగణించి శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే.. ఈ కేసులో నిందితుడు హత్య, అత్యాచారం వంటి హేయమైన నేరాలకు పాల్పడలేదు కాబట్టి అతణ్ని మేజర్‌గా పరిగణించి శిక్ష విధించకపోవచ్చని కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సౌమ్యుడు.. పదవి ఇవ్వండి!
ఈ కేసులో తప్పుడు రిపోర్టు ఇచ్చిన వైద్యుడు డాక్టర్ అజయ్ తవాడే.. పుణెలోని సాసూన్ జనరల్ ఆస్పత్రిలో మెడికల్ సూపరింటెండెంట్‌గా 2023 డిసెంబరులో నియమితులయ్యారు. ఆయనకు ఆ పదవి రావడానికి కారణం ఎవరో తెలుసా? ఇదే యాక్సిడెంట్ కేసులో నిందితుడి కోసం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కూర్చున్న ఎమ్మెల్యే సునీల్ టింగరే. కొవిడ్ సమయంలో డాక్టర్ అజయ్‌తవాడే అద్భుతంగా పనిచేశారని.. ఆయన తనకు బాగా తెలుసని.. కాబట్టి, ఆయన్ను సాసూన్ జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌గా నియమించాలని విజ్ఞప్తిచేస్తూ మహారాష్ట్ర వైద్య విద్య మంత్రి హసన్ ముష్రి్‌ఫకు సునీల్ టింగరే అప్పట్లో రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.
మీడియాను తప్పించుకు తిరుగుతున్న జడ్జి
ఈ కేసు దేశవ్యాప్తంగా ఇంత సంచలనం కావడానికి.. వ్యవస్థల డొల్లతనం బయటపడడానికి కారణమైన జువెనైల్ జస్టిస్ బోర్డు జడ్జి ఎల్‌ఎన్ దన్వాడే ప్రస్తుతం మీడియాను తప్పించుకు తిరుగుతున్నారు. పాత్రికేయులు ఎన్ని ప్రశ్నలు అడిగినా.. నోరు విప్పి సమాధానం చెప్పకుండా అక్కణ్నుంచీ వెళ్లిపోతున్నారు. నిజానికి ఈ కేసులో ఆరోజు తీర్పు చెప్పాల్సింది ఈయన కాదు. బోర్డులో జ్యుడీషియల్ మెంబర్, ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్, ఇద్దరు నాన్-జ్యుడీషియల్ అపాయింటెడ్ మెంబర్లు ఉంటారు. ఇద్దరు నాన్‌జ్యుడీషియల్ మెంబర్లలో ఒకరు.. ఎల్‌ఎన్ ధన్వాడే. ఆరోజు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్, ఒక నాన్‌జ్యుడీషియల్ మెంబర్ సెలవులో ఉండడంతో కేసు ఈయన ముందుకు వచ్చింది.
Updated Date - Jun 01 , 2024 | 05:35 AM