CPM Mohammad Saleem : పశ్చిమబెంగాల్‌లో ఆటవిక శిక్షలు!
ABN, Publish Date - Jul 01 , 2024 | 03:41 AM
పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ మద్దతుదారు ఒకరు ‘ఇన్సాఫ్ సభ’ పేరుతో ఆటవిక శిక్షలు విధిస్తున్న ఉదంతమిది. తాజాగా ఓ మహిళ, మరో యువకుడిని నడిరోడ్డుపై కింద పారేసి.. విచక్షణారహితంగా కర్రతో దాడి చేసి,
లక్ష్మీపూర్‌లో టీఎంసీ మద్దతుదారు ఘాతుకం
కోల్‌కతా, జూన్ 30: పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ మద్దతుదారు ఒకరు ‘ఇన్సాఫ్ సభ’ పేరుతో ఆటవిక శిక్షలు విధిస్తున్న ఉదంతమిది. తాజాగా ఓ మహిళ, మరో యువకుడిని నడిరోడ్డుపై కింద పారేసి.. విచక్షణారహితంగా కర్రతో దాడి చేసి, కాళ్లతో తన్నిన ఘటన వెలుగులోకి వచ్చింది. సీపీఎం నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు మహమ్మద్ సలీమ్ స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ వీడియో వైరల్ అవుతున్నా.. అటు ప్రభుత్వం గానీ, ఇటు పోలీసులు గానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం..! వివరాల్లోకి వెళ్తే.. చోప్రా నియోజకవర్గ పరిధిలోని దిఘల్‌గావ్ ప్రాంతం, లక్ష్మీపూర్ గ్రామంలో టీఎంసీ ఎమ్మెల్యే హమీద్-ఉర్-రెహ్మాన్ అనుచరుడు జేసీబీ అలియాస్ తేజేముల్ అనే వ్యక్తి తక్షణ న్యాయం పేరుతో స్థానికంగా ‘ఇన్సాఫ్ సభ’లను ఏర్పాటు చేస్తూ.. ఆటవిక శిక్షలను విధిస్తుంటాడు.
ఈ క్రమంలో వివాహేతర సంబంధం పేరుతో ఓ మహిళను, మరో యువకుడిని చితకబాదుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. బాధిత మహిళ దెబ్బలకు తాళలేక.. రోడ్డుపై పొర్లుతూ రోదిస్తున్నా.. కనికరం లేకుండా కర్రతో ఎడాపెడా దాడి చేశాడు. మరో యువకుడిని కూడా ఇదేవిధంగా హింసించాడు. చుట్టూ జనం గుమిగూడినా.. ఓ వృద్ధుడు మినహా.. ఎవరూ తేజేముల్‌ను ఆపేందుకు యత్నించలేదు. కొంతదూరంలోనే పోలీసు పెట్రోలింగ్ జీపు ఉన్నా.. ఒక్క పోలీసు కూడా కిందకు దిగి, అతణ్ని వారించే ప్రయత్నం చేయలేదు. దీనిపై సీపీఎం నేత సలీం సీరియస్ అయ్యారు. బెంగాల్‌లో మమత హయాంలో ఆటవిక శిక్షలను విధిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ సోషల్ మీడియా చీఫ్ మాలవీయ కూడా.. ‘‘తాలిబాన్ల తరహాలో శిక్షలు విధిస్తుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోంది’’ అని ప్రశ్నించారు.
Updated Date - Jul 01 , 2024 | 03:41 AM