Tributes to Zakir Hussain : జాకీర్ హుస్సేన్ మృతికి ప్రముఖుల నివాళి
ABN, Publish Date - Dec 17 , 2024 | 04:43 AM
జాకీర్ హుస్సేన్ మృతిపై అన్ని వర్గాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను ఆకట్టుకున్న అసాధారణ ప్రతిభావంతుడు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.
శాస్త్రీయ సంగీతంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు: మోదీ
న్యూఢిల్లీ, డిసెంబరు 16: జాకీర్ హుస్సేన్ మృతిపై అన్ని వర్గాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను ఆకట్టుకున్న అసాధారణ ప్రతిభావంతుడు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. భారతీయ, పశ్చిమ దేశాల మధ్య సంగీత వారధి అని పేర్కొన్నారు. జాకీర్ హుస్సేన్‌కు పద్మ విభూషణ్ ప్రదానం చేసే అవకాశం తనకు లభించిందని తెలిపారు. ఉస్తాద్ అసమాన ప్రతిభ ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. జాకీర్ హుస్సేన్ మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, ప్రపంచ సంగీతంతో మేళవించారని కొనియాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ అధ్యక్షుడు నడ్డా తదితరులు సైతం సంతాపం తెలిపారు. భారతీయ శాస్ర్తీయ సంగీతంలో మహోన్నతుడు జాకీర్ హుస్సేన్ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జాకీర్ హుస్సేన్ వారసత్వం ప్రభావం సంగీత ప్రపంచంపై తప్పక ఉంటుందన్నారు. జాకీర్ హుస్సేన్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అని రాహుల్ గాంధీ అన్నారు. జాకీర్ హుస్సేన్ మృతిపట్ల ఖర్గే, మమతా బెనర్జీ, యోగి ఆదిత్యనాథ్ తదితరులు సంతాపం తెలిపారు. జాకీర్ హుస్సేన్ మృతి భారతీయ సంగీతానికే కాదని.. మొత్తం సంగీత ప్రపంచానికే తీరని లోటు అని ఆరెస్సెస్ పేర్కొంది.
Updated Date - Dec 17 , 2024 | 04:44 AM