రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసులో.. ఇద్దరు నిందితులు అరెస్టు
ABN, Publish Date - Apr 13 , 2024 | 05:48 AM
కర్ణాటకలో సంచలనం కలిగించిన రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసులో సూత్రధారి సహా ఇద్దరు ప్రధాన నిందితులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు....
బెంగాల్‌లో తలదాచుకున్న నిందితులు
బెంగళూరు, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో సంచలనం కలిగించిన రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసులో సూత్రధారి సహా ఇద్దరు ప్రధాన నిందితులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ముసావిర్ హుసేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాను పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో అరెస్టు చేసినట్టు ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఇంప్రవైజ్‌డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ను షాజిబ్ కేఫ్‌లో పెట్టగా.. ఈ పేలుడు ప్రణాళిక, అమలు వెనుక ప్రధాన సూత్రధారి తాహా అని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. ‘కేఫ్‌లో బాంబు పేలుళ్ల తర్వాత పరారీలో ఉన్న నిందితులను గుర్తించడంలో ఎన్‌ఐఏ విజయవంతమైంది. కోల్‌కతా సమీపంలో తప్పుడు గుర్తింపు పత్రాలతో అజ్ఞాతంలో ఉన్న వారిని ఈ నెల 12న అదుపులోకి తీసుకున్నాం’ అని ఎన్‌ఐఏ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా.. షాజిబ్, అహ్మద్ తాహాలకు సాయం చేసిన ముజామిల్ షరీఫ్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. పేలుళ్లు జరిగిన తర్వాత పరారీలో ఉన్న షాజిబ్, తాహాలను గుర్తించేందుకు ఎన్‌ఐఏ అధికారులు దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో గాలించారు. వీరి ఆచూకీ తెలిపినవారికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి ఇస్తామని ప్రచారం చేశారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో ఇద్దరినీ అరెస్టు చేసి బెంగళూరు తరలించారు. మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో పేలుళ్లు చోటు చేసుకోగా సుమారు 8 మంది గాయపడ్డారు.
నిందితులను పట్టించిన టోపీ!
రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు జరిగిన నాటినుంచి పరారీలో ఉన్న షాజిబ్, అహ్మద్ తాహా అసోం, పశ్చిమబెంగాల్‌లో తలదాచుకున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. వారి ఆచూకీని కనుగొనే క్రమంలో షాజిబ్ ధరించిన టోపీ (క్యాప్) వారిని గుర్తించడానికి సహాయపడింది. పేలుళ్లు జరిగిన తర్వాత ఎన్‌ఐఏ ఆ క్యాప్‌ను స్వాధీనం చేసుకుంది. చెన్నైలోని ఒక మాల్‌లో షాజిబ్, తాహా ఈ క్యాప్‌ను కొనుగోలు చేసినట్టు గుర్తించింది. అప్పుడు రికార్డయిన సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి, నిఘా పెట్టారు. పేలుళ్ల అనంతరం షాజిబ్, తాహా తరచూ సిమ్ కార్డులు మార్చుతూ అండర్ గ్రౌండ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఎన్‌ఐఏ రాడార్ నుంచి తప్పించుకోలేకపోయారు.
Updated Date - Apr 13 , 2024 | 07:03 AM