రాష్ట్రం పేరు ప్రస్తావించకుంటే నిధులివ్వనట్లేనా?
ABN, Publish Date - Jul 31 , 2024 | 06:12 AM
బడ్జెట్ ప్రసంగంలో ఏదైనా రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రాన ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరపనట్లు కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల్లో రెండు రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చారని, మిగిలిన రాష్ట్రాల పేర్లు
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకే వేల కోట్లు కేటాయించాం: నిర్మల
న్యూఢిల్లీ, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : బడ్జెట్ ప్రసంగంలో ఏదైనా రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రాన ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరపనట్లు కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల్లో రెండు రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చారని, మిగిలిన రాష్ట్రాల పేర్లు బడ్జెట్ ప్రసంగంలోనే లేవని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. 2024-25 కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో ఆమె సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని విపక్ష ‘ఇండియా కూటమి’ తీరు సరికాదన్నారు. యూపీయే ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించారా అని నిలదీశారు. 2004-05 నుంచి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాల పేర్లు ప్రస్తావించలేదని గుర్తుచేశారు. ప్రస్తుత బడ్జెట్‌లో బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించారన్న విపక్ష సభ్యుల విమర్శలను తప్పుబట్టారు. తెలంగాణ సహా దేశంలోని అనేక రాష్ట్రాలకు వేలకోట్ల రూపాయలు ఇచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోటుమర్రి-విష్ణుపురం సెక్షన్‌లో రైల్వే డబ్లింగ్ పనులకు నిధులు కేటాయించామన్నారు. భద్రాచలం, డోర్నకల్ సెక్షన్‌లో రూ.770 కోట్లతో రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇచ్చాం... మొత్తంగా ఏపీ, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.1596 కోట్లు కేటాయించామన్నారు. కేరళలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రూ.9,667 కోట్లు కేటాయించాం. జాతీయ స్థాయిలో శాఖల వారీగా వేలకోట్ల నిధులు ప్రతిపాదిస్తామన్నారు. బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించామని, ఏ రాష్ట్రానికి వంచన జరగలేదని పేర్కొన్నారు. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నిర్వహించే హల్వా కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి సమర్థించారు. అది సుదీర్ఘకాలంగా వస్తోన్న సంప్రదాయమని గుర్తుచేశారు. 2013-14లో యూపీయే హయాంలోనూ ఈ కార్యక్రమం జరిగిందన్నారు. అప్పుడెందుకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేయలేదని రాహుల్‌గాంధీని ప్రశ్నించారు.
Updated Date - Jul 31 , 2024 | 06:13 AM