IMEC: బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ప్రస్తావించిన ‘ఐమెక్’ ఏంటి.. దీని విశేషాలేమిటి?
ABN, Publish Date - Feb 01 , 2024 | 10:00 PM
గురువారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. ‘ఐమెక్’ (IMEC) ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. రాబోయే వందేళ్లలో ఈ ప్రాజెక్ట్ ప్రపంచ వాణిజ్యానికి ఆధారం కానుందని, భారత్‌తో పాటు యావత్ ప్రపంచానికే ఇది గేమ్‌చేంజర్‌గా మారుతుందని పేర్కొన్నారు.
గురువారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. ‘ఐమెక్’ (IMEC) ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. రాబోయే వందేళ్లలో ఈ ప్రాజెక్ట్ ప్రపంచ వాణిజ్యానికి ఆధారం కానుందని, భారత్‌తో పాటు యావత్ ప్రపంచానికే ఇది గేమ్‌చేంజర్‌గా మారుతుందని పేర్కొన్నారు. భారత్ గడ్డపై ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు చరిత్రలో ఓ మైలురాయిగా గుర్తుండిపోతుందని కూడా ఆమె తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. దీంతో.. ఈ ‘ఐమెక్’ ప్రాజెక్ట్ ఏంటి? దీని వల్ల భారత్‌కి ఉపయోగం ఏంటి? అసలు ప్రపంచ వాణిజ్యానికి ఇది జీవనాడి ఎందుకు అవుతుంది? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. పదండి.. ఆ వివరాలేంటో ఈ వార్తలో తెలుసుకుందాం!
ఐమెక్ ప్రాజెక్ట్
ఐమెక్ ప్రాజెక్ట్ అంటే.. మిడిల్ ఈస్ట్ ద్వారా భారతదేశాన్ని యూరప్‌తో అనుసంధానించే ఒక మెగా ప్రాజెక్ట్. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.. ఇండియా - మిడిల్ ఈస్ట్ - యూరప్ ఎకనామిక్ కారిడార్. గతేడాది సెప్టెంబర్‌లో న్యూ ఢిల్లీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సులో ఈ ప్రాజెక్ట్ ఆమోదించబడింది. ఆ సదస్సులో భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇటలీ దేశాలు ఎంఓయూపై సంతకాలు చేశాయి. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు.. మళ్లీ అక్కడి నుంచి ఇజ్రాయెల్ మీదుగా ఐరోపాలోకి సరుకులను రవాణా చేసేందుకు వీలుగా ఈ ఐమెక్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారు. సెప్టెంబరు 9న ఎంఓయూ కుదరగా.. ఆ సమయంలోనే దీన్ని ఒక చారిత్రాత్మక ఒప్పందంగా ప్రధాని మోదీ అభివర్ణించారు.
భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే మార్గాన్ని తూర్పు కారిడార్‌గానూ.. అక్కడి నుంచి ఐరోపాకు వెళ్లే మార్గాన్ని ఉత్తర కారిడార్‌గానూ విభజించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రైలు, జల మార్గాలను వినియోగిస్తారు. ఫలితంగా.. భారీ మౌలిక సదుపాయాలు సృష్టించబడతాయి. భారత్‌లో ముంద్రా, కాండ్లా, నవీముంబయి పోర్టులు ఈ మార్గంలో భాగాలు. ఆసియా-ఐరోపా మధ్య జల, రైలు మార్గాల్లో సంబంధాలను బలోపేతం చేయాలన్నదే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్ట్‌తో అనుసంధానమైన దేశాల మధ్య వాణిజ్యం, కనెక్టివిటీ సులభతరం అవుతుంది. అంతేకాదు.. లోయర్ & మిడిల్ ఇన్‌కమ్ దేశాల్లో అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కొరతను ఈ ప్రాజెక్ట్ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. ఖర్చు తగ్గడంతో పాటు తక్కువ సమయంలోనే సరుకులు గమ్యస్థానానికి చేరుకుంటాయి.
ఈ ప్రాజెక్టుతో భారత్‌కు లాభాలేంటి?
అయితే.. ఈ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చాలంటే మాత్రం ఎక్కువ సమయమే పడుతుంది. ఎంఓయూపై సంతకం చేసిన భాగస్వామ్య దేశాలు విద్యుత్తు లైన్లు, డిజిటల్ కనెక్టివిటీ, రైలు మార్గాల వెంబడి స్వచ్ఛ హైడ్రోజన్ ఎగుమతులకు వీలుగా పైపులైన్స్ వేయడం.. వంటివి చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్ల కోసం అన్ని దేశాలు సమష్టిగా, వేగంగా పని చేయాలి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ వాస్తవ రూపం దాల్చితే.. భాగస్వామ్య దేశాల రవాణా సామర్థ్యం మెరుగుపడుతుంది. ఆయా దేశాల మధ్య ఆర్థిక బంధం బలపడుతుంది. కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అన్నింటికంటే మించి.. ఈ ప్రాజెక్టులో భాగమైన అన్ని దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలు ఉంటాయి. అంటే.. ఈ విషయం భారత్‌కి ఎంతో అనుకూలమైనది.
మరీ ముఖ్యంగా.. ఈ ప్రాజెక్ట్ పుణ్యమా అని ఖర్చుతో పాటు డబ్బు కూడా చాలా ఆదాయం అవుతుంది. ప్రస్తుతం భారత్ నుంచి యూరప్‌కు సరుకులు రవాణా చేసేందుకు సూయజ్ కాలువని వినియోగిస్తున్నారు. ఒకవేళ ఈ కారిడార్ ఏర్పాటైతే.. ముంబై నుండి నేరుగా గల్ఫ్ దేశాలకు పంపుతుంది. అక్కడి నుంచి ఆ వస్తువులు రైలులో ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్టుకు వెళ్లి, అక్కడి నుండి సముద్ర మార్గం ద్వారా యూరప్‌కు చేరుకుంటాయి. దీనివల్ల సమయం, డబ్బు రెండూ ఆధా అవుతాయి. అలాగే.. భారతదేశ ఎగుమతులు అనేక రెట్లు పెరుగుతాయని నమ్ముతారు. అంతేకాదు.. ఈ ఐమెక్ ప్రాజెక్ట్ గ్రౌండ్ రియాలిటీగా మారితే.. చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌కు భారత్ గట్టి పోటీని ఇవ్వగలుగుతుంది.
Updated Date - Feb 01 , 2024 | 10:00 PM