మీ ఇళ్లు, నగలు.. అన్నీ లాక్కుంటుంది!
ABN, Publish Date - Apr 23 , 2024 | 04:08 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన.. కాంగ్రెస్ వస్తే ప్రజల సంపదను లూటీ చేసి, మైనారిటీలకు పంచుతుందని ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఆదాయం, ఆస్తులపై కాంగ్రెస్ సర్వే చేస్తుంది
ఊళ్లో ఇల్లు, నగరంలో ఫ్లాట్ ఉంటే.. ఒక దాన్ని స్వాధీనం చేసుకుంటారు
ఇది మావోయిస్టు, కమ్యూనిస్టు ధోరణి
కాంగ్రెస్, ఇండి కూటమి ఈ పద్ధతిని భారత్‌లో అమలు చేయాలని చూస్తున్నాయి
యూపీ ఎన్నికల ప్రచారంలో మోదీ విమర్శలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన.. కాంగ్రెస్ వస్తే ప్రజల సంపదను లూటీ చేసి, మైనారిటీలకు పంచుతుందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమైనప్పటికీ మోదీ తగ్గలేదు. విమర్శల దాడిని మరింత పెంచారు. సోమవారం ప్రధాని ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఇండి కూటమి నేతలు భవిష్యత్తుపై ఆశలు వదులుకున్నారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని హెచ్చరించారు. కాంగ్రెస్, ఇండి కూటమి ప్రజల ఆదాయం, సంపదపై కన్నేశాయని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ఎవరు ఎంత సంపాదిస్తున్నారు? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఎన్ని ఇళ్లు ఉన్నాయి? అనే దానిపై విచారణ జరిపిస్తామని ఆ పార్టీ యువరాజు చెప్పారు. అలాగే ప్రజలు సంపదపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని, వారి ఆస్తులను అందరికీ పంచుతామనీ మేనిఫెస్టోలో చెప్పారు’’ అంటూ రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ‘మంగళసూత్రం’ వ్యాఖ్యలను మోదీ మళ్లీ చేశారు. కాంగ్రెస్ పార్టీ చట్టాలను మార్చి మహిళల ఆభరణాలనూ తీసేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సర్వే చేసి..
ఉద్యోగస్థులు ఎంత మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారు?, వారికి ఎన్ని వాహనాలు ఉన్నాయి?, ఎంత భూమి ఉంది? అనే వివరాలను సేకరించి ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని మోదీ పేర్కొన్నారు. ఊళ్లో పురాతన ఇల్లు ఉండి, నగరంలో ఫ్లాట్ కొనుక్కుంటే.. వాటిలో ఏదో ఒక ఇంటిని కాంగ్రెస్ లాగేసుకుంటుందని చెప్పారు. ఒక ఇల్లు ఉన్నది కాబట్టి మరొకటి అవసరం లేదని చెబుతుందన్నారు. ఇది మావోయిస్టు, కమ్యూనిస్టు ఆలోచనా ధోరణి అని.. ఇలాంటి వాళ్లు చాలా దేశాలను నాశనం చేశారని చెప్పారు. కాంగ్రెస్, ఇండి కూటమి ఈ విధానాన్ని భారత్‌లో అమలు చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ‘‘కూటమి నేతలు మోదీ ఎందుకు అభివృద్ధి చెందిన భారత్ అని మాట్లాడుతున్నాడు? ఎందుకు భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని చెబుతున్నాడు? అనే ప్రశ్నిస్తున్నారు. ఈ నేతలు అధికారంలోకి రావడం కోసం, కుటుంబాల లబ్ధి కోసం తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదు’’ అని మోదీ మండిపడ్డారు.
మోదీపై చర్యలు తీసుకోండి: కాంగ్రెస్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు పంచిపెడుతుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మతం పేరుతో మోదీ ఓట్లు అడిగారని, కాంగ్రెస్ పార్టీపై అబద్ధపు ఆరోపణలు చేశారని, పార్టీ నేతలను అవమానించారని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని అందులో పేర్కొంది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అభిషేక్ సింఘ్వి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు సోమవారం ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదును సమర్పించారు. మోదీ వ్యాఖ్యలపై స్పందించడానికి ఈసీ నిరాకరించింది. ఇదిలా ఉండగా, రాజస్థాన్‌లో ముస్లింలపై నేరుగా దాడికి దిగారని, మోదీపై వెంటనే చర్యలు తీసుకోవాలని 2,209 మంది పౌరులు ఎన్నికల సంఘానికి సంయుక్తంగా లేఖ రాశారు.
దేశ సంపదపై హక్కు వారికే.. మైనారిటీలకు కాదు: అమిత్ షా
దేశంలోని వనరులపై తొలి హక్కు మైనారిటీలకే చెందుతుందని కాంగ్రెస్ నమ్ముతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. కానీ, దేశ వనరులపై పేదలు, ఆదివాసీలు, దళితులు, వెనకబడినవర్గా ల వారికే హక్కు ఉంటుందని బీజేపీ విశ్వసిస్తోందని చెప్పారు. ఛత్తీ్‌సగఢ్ ప్రచారంలో షా మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పట్ల ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అమిత్ షా స్పందిస్తూ.. ‘‘నేను కాంగ్రెస్ నేతలను అడుగున్నా.. వారి మేనిఫెస్టోలో సర్వే చేస్తామని చెప్పారా? లేదా? దీనిపై రాహుల్ బాబా స్పష్టతనివ్వాలి. 2006లో ప్రధాని మన్మోహన్ దేశ వనరులపై తొలి హక్కు ఆదివాసీలు, దళితులది కాదని.. మైనారిటీలదేనని చెప్పారు. కానీ, ఆ హక్కు పేదలు, దళితులు, ఆదివాసీలు, బీసీలదే. కాంగ్రెస్ కళ్లన్నీ మఠాలు, మందిరాలు, ప్రజల ఆస్తులపై ఉన్నాయి. ఆ సొమ్ముంతా ఎక్కడికి పంపుతారు?’’ అని ప్రశ్నించారు.
మోదీజీ.. అపాయింట్‌మెంట్ ఇవ్వండి
కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి వివరిస్తా: ఖర్గే
చెన్నపట్న(కర్ణాటక), ఏప్రిల్ 22: రాజ్యాంగాన్ని మార్చడానికి లోక్‌సభలో ఎన్డీయేకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడమే మోదీ లక్ష్యమని, అందుకే 400 సీట్లు గెలవాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లింలీగ్ ముద్రను కలిగి ఉందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి కల్పిస్తామనడం, నారీ న్యాయ్, రైతులకు ఎమ్మెస్పీని చట్టబద్ధం చేయడం... ఇవన్నీ ముస్లిం లీగ్ కిందకు వస్తాయా అని ఖర్గే ప్రశ్నించారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై బహిరంగ చర్చకు సిద్ధమని ఖర్గే ప్రకటించారు. ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. మోదీ అనవసరంగా గాంధీల కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని, 1989 నుంచి నేటివరకూ ఆ కుటుంబానికి చెందిన వారెవరూ ప్రధానమంత్రిగా లేదా మంత్రిగా, ముఖ్యమంత్రిగా లేరని చెప్పారు.
Updated Date - Apr 23 , 2024 | 04:08 AM