గురువు పుష్పంలా ఉండాలి...
ABN, Publish Date - Nov 22 , 2024 | 06:29 AM
హిమాలయాల్లో ఒక సాధువు ఉండేవాడు. అతను మహాత్మునిగా పేరు పొందాడు. ఎందరో ఆయనను దర్శించుకొనేవారు. వారిలో చాలామంది ‘‘మాకు దీక్ష ఇచ్చి ఉద్ధరించండి. ఈ జన్మాంతం మీకు శిష్యులుగా ఉంటాం’’ అని అభ్యర్థించేవారు. అలాంటివారిలో కొందరు
హిమాలయాల్లో ఒక సాధువు ఉండేవాడు. అతను మహాత్మునిగా పేరు పొందాడు. ఎందరో ఆయనను దర్శించుకొనేవారు. వారిలో చాలామంది ‘‘మాకు దీక్ష ఇచ్చి ఉద్ధరించండి. ఈ జన్మాంతం మీకు శిష్యులుగా ఉంటాం’’ అని అభ్యర్థించేవారు. అలాంటివారిలో కొందరు రాజులు కూడా ఉండేవారు. కానీ ఆయన ఎవరికీ దీక్ష ఇచ్చేవాడు కాదు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. సాధారణంగా గురువుల్లో ఎక్కువమంది తమ శిష్యుల సంఖ్య పెంచుకోవడానికీ, పేరు ప్రఖ్యాతులు పొందడానికి ప్రయత్నిస్తారు. ఆయన అలాంటివేవీ పట్టించుకోడు. దీంతో అసలైన జ్ఞానులు ఇలాగే ఉంటారని జనం ఆయనను మరింత ఎక్కువగా గౌరవించారు.
ఆయన ఎవరినీ శిష్యులుగా స్వీకరించలేదు కానీ... ఒక అనాథ బాలుణ్ణి పెంచుకొనేవాడు. ఒక రోజు ఆ బాలుణ్ణి పిలిచి ‘‘నువ్వు త్వరగా ఊర్లోకి వెళ్లు. ‘‘గురువుగారు ఈ సాయంత్రమే దేహత్యాగం చేస్తారు. కాబట్టి మీరందరూ ఆలస్యం చేయకుండా రండి. ఆయన దీక్ష ఇస్తారు’’ అని పిలుచుకొని రా’’ అని చెప్పాడు.
ఇది విని ఆ బాలుడికి ఆశ్చర్యం కలిగింది. రాజులకు, పండితులకు, ధనికులకు సైతం దీక్ష ఇవ్వడానికి ఆయన నిరాకరించిన సంగతి అతనికి గుర్తుంది. కాబట్టి ‘‘అయ్యా! ఎలాంటి అర్హతలు ఉన్నవారిని పిలుచుకురమ్మంటారు?’’ అని అడిగాడు.
‘‘ఎవరైనా పరవాలేదు. రావడానికి ఎవరు సిద్ధపడితే వారిని తీసుకురా. వెళ్ళు, వెళ్ళు అని గురువు త్వరపెట్టాడు.
ఆ బాలుడు సమీప గ్రామాలకు వెళ్ళి, కనిపించిన ప్రతివారికీ ఈ విషయం చెప్పాడు. ఆ మధ్యాహ్నానికల్లా 13 మందిని వెంటబెట్టుకొని... గురువు ఆశ్రమానికి తీసుకువచ్చాడు. వారిలో ఒకడు జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు. మరొకడు దొంగ, ఇంకొకడు తాగుబోతు... అందరూ అలాంటివాళ్ళే. వారిని చూసి గురువు కోపంతో తనను కొడతాడేమోనని ఆ బాలుడు భయపడ్డాడు. కానీ ‘ఎవరైనా పరవాలేదని ఆయనే చెప్పారు కదా!’ అని ధైర్యాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. వారిని తెచ్చిన సంగతి గురువుకు చెప్పగానే ఆయన ‘‘వాళ్ళను నా దగ్గరకు పిలుచుకురా. సూర్యాస్తమయం లోపల దీక్ష ఇవ్వాలి, ఎక్కువ సమయం లేదు’’ అని తొందరపెట్టాడు. తరువాత వాళ్ళందరికీ దీక్ష ఇచ్చాడు.
దీనికి వారు ఆశ్చర్యపోయారు. ‘‘గురువర్యా! మీరు ఇన్నేళ్ళూ ఎంతమంది బతిమాలినా దీక్ష ఇవ్వలేదు. శిష్యులుగా స్వీకరించలేదు. వాళ్ళందరికీ మీ శిష్యులయ్యే అర్హత లేదా? మాలో ఏ అర్హత చూశారు?’’ అని ప్రశ్నించారు.
అప్పుడు ఆయన నవ్వి ‘‘ఇన్నేళ్ళు నాకు దీక్ష ఇచ్చే అర్హత లేదు కాబట్టి ఇవ్వలేదు. ఈ రోజు ఉదయమే నాకు జ్ఞానోదయం అయింది. గురువు పుష్పంలా ఉండాలి. పొద్దున్నే వికసించి, సాయంత్రానికి వాడిపోయే పుష్పం లాంటివాణ్ణి నేను. ఒక పువ్వు ‘నా సుగంధాన్ని పీల్చే అర్హత మీకుందా?’ అని ప్రశ్నించకుండా... దాని దగ్గరకు వెళ్ళిన ప్రతి ఒక్కరికీ సుగంధాన్ని పంచుతుంది. అలాగే మీలో ఏ అర్హతా లేకపోయినా... జ్ఞానోదయం ద్వారా నాకు లభించిన దాన్ని మీకు పంచి, నా బరువు దించుకొని, ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలని అనుకుంటున్నాను’’ అన్నాడు. ఆ తరువాత నేల మీద పడుక్కుని, ప్రశాంతంగా కన్ను మూశాడు.
రాచమడుగు శ్రీనివాసులు
Updated Date - Nov 22 , 2024 | 06:29 AM