ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Apurna Das: బతుకు... బతికించు

ABN, Publish Date - Dec 09 , 2024 | 03:21 AM

జీవితమంతా కుటుంబ బాధ్యతలతోనే గడిచిపోయింది. తిరిగి చూసుకొంటే తనది అని చెప్పుకోవడానికి ఏమీ కనిపించలేదు.

జీవితమంతా కుటుంబ బాధ్యతలతోనే గడిచిపోయింది. తిరిగి చూసుకొంటే తనది అని చెప్పుకోవడానికి ఏమీ కనిపించలేదు. కానీ కూతురు ప్రోత్సాహం... ఆమెలో స్ఫూర్తి రగిలించింది. వయసు మీదపడుతున్నా లెక్క చేయక... మనసుకు దగ్గరైన పనికి పూనుకున్నారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి... కష్టాల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. అరవై ఏళ్ల అపర్ణా దాస్‌ అంతరంగం ఇది.

‘‘పక్కవారికి కష్టం వస్తే స్పందించడం మన కనీస కర్తవ్యం. నేను చేస్తున్నది అదే. అభాగ్యులకు అండగా, ఒక మనిషిగా తోచిన సాయం అందిస్తున్నాను. అనాథలను సాధికారత వైపు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నం ప్రారంభించడానికి నేను ఎన్నో ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌ పట్టణంలోని ఓ మధ్యతరగతి కుటుంబం మాది. చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు. అది మొదలు ఎన్నో బాధ్యతలు ఒక్కసారిగా నెత్తిన పడ్డాయి. మావారిది ఉమ్మడి కుటుంబం. వాళ్లు పదిమంది అన్నదమ్ములు. అత్తగారు, మామగారు... ఇల్లు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. ఎవరికి ఏం కావాలన్నా నేనే చూసుకోవాలి. తెల్లవారుజాము నిద్ర లేచింది మొదలు... రాత్రి పడుకొనే వరకు ఓ పది నిమిషాలు కూర్చోడానికి కూడా సమయం దొరికేది కాదు. 1994లో మా అమ్మాయి పుట్టింది. పని భారం మరింత పెరిగింది. తనను పెంచి, పెద్ద చేయడం మీద శ్రద్ధ పెట్టాను. ఈ క్రమంలో నన్ను నేను కోల్పోయాను. నేను కన్న కలలు, అభిరుచులు, నాకంటూ ఒక జీవితం లేకుండా పోయాయి.

మా అమ్మాయి ప్రోత్సాహంతో...

లేచింది మొదలు ఇంట్లో అటూ ఇటూ పరుగెత్తడంతోనే దశాబ్దాలు గడిచిపోయాయి. నా బాధంతా పని గురించి కాదు... నాకు నచ్చినవేవీ చేయలేకపోతున్నాననే ఆవేదన. సామాజిక సేవ చేయాలనేది నా చిన్ననాటి కోరిక. పెళ్లితో ఆ కల నెరవేరే మార్గమే కనిపించలేదు. మా అమ్మాయి పెరిగి పెద్దదయింది. ఉన్నత చదువుల కోసం కోల్‌కతాకు వెళ్లింది. అప్పుడు నాకు కాస్త ఖాళీ సమయం దొరికింది. నన్ను చూసి నా కూతురు సుపర్ణ ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ‘నా కోసం, మన కుటుంబం కోసం నువ్వు నీ జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించావు. ఎన్నో త్యాగాలు చేశావు. వాటన్నిటినీ తిరిగి తీసుకురాలేము. కానీ నువ్వు కోరుకున్నట్టు సామాజిక సేవ వైపు అడుగులు వెయ్యి. అందుకు నేను సహకరిస్తాను’ అని మా అమ్మాయి చెప్పింది. తన మాటలు నాకు ప్రేరణనిచ్చాయి.


స్వచ్ఛంద సంస్థలతో కలిసి...

నాకు యాభై ఏళ్ల వయసులో నేను కోరుకున్నట్టు సామాజిక సేవ వైపు అడుగులు వేశాను. ఆ క్షణం నన్ను నేను నమ్మలేకపోయాను. అసలు ఇలాంటి రోజు ఒకటి నా జీవితంలో వస్తుందని అనుకోలేదు. మా ప్రాంతంలోని ‘కిషాలయా చిల్డ్రన్స్‌ హోమ్‌’కు వెళ్లాను. అక్కడ వాలంటీర్‌గా పని ప్రారంభించాను. తొలుత ఖాళీ సమయాల్లో పని చేద్దామని భావించాను. కానీ ఒక్కసారి అందులోకి దిగాక... ఇక అదే నా జీవిత లక్ష్యం అయిపోయింది. ‘కిషాలయా’ అనేది అనాథ ఆశ్రమం. అక్కడి పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు జీవిత విలువలు బోధించాను. వారందరినీ నా సొంత బిడ్డల్లా చూసుకున్నాను. అలాగే ‘ఆరాధన సోషల్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌’తో కలిసి నడిచాను. అందులోని చిన్నారులకు స్వశక్తితో ఎదిగేందుకు అవసరమైన నైపుణ్యశిక్షణ ఇచ్చాను. చిన్నప్పటి నుంచే వృత్తి విద్యల వైపు ప్రోత్సహించాను. ఎందుకంటే వారికి నా అనేవారెవరూ ఉండరు. అలాంటివారి భవిష్యత్తు నిర్మాణ బాధ్యత మనదే కదా.

డబ్బే ప్రధానం కాదు...

సామాజిక సేవ చేయాలంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలని చాలామంది భావిస్తుంటారు. నా దృష్టిలో నిజమైన సేవకు డబ్బే ప్రధానం కాదు. దానికి కావల్సింది మానవత్వంతో స్పందించే హృదయం. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే నిధులు వాటంతట అవే సమకూరుతాయనేది నా నమ్మకం. డబ్బు ఇవ్వమని నేను ఎవరి వద్దకూ వెళ్లలేదు. ఇస్తే వద్దనలేదు. ఈ వయసులో కూడా నేను కష్టపడి సంపాదిస్తున్నాను. వచ్చినదంతా అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాల్లోని వారి కోసం ఖర్చు చేస్తున్నాను. వృద్ధాశ్రమాల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. పిల్లల కోసం అహర్నిశలూ చెమటోడ్చి, ఉన్నదంతా ధారపోసి, వయసు మీద పడ్డాక చివరకు ఇలా వృద్ధాశ్రమాల్లో ఒంటరిగా గడుపుతున్నారు. ఇది దారుణమైన పరిస్థితిలో మార్పు రావాలంటే... పిల్లలకు కుటుంబ, సామాజిక విలువలు బోధించాలి.


మనసు ఉప్పొంగుతుంది...

ఎప్పుడైతే ఇటువైపు వచ్చానో అప్పటి నుంచి నా కాళ్లపై నేను నిలబడడం అలవాటు చేసుకున్నాను. ఒకసారి మా ఇంట్లో పుట్టగొడుగులు పెంచాను. నాకు అందులో అనుభవం ఉంది. తరువాత అదే నా సంపాదన మార్గం అయింది. ఇప్పుడు పుట్టగొడుగుల సాగు చేస్తున్నాను. అలాగే మా ప్రాంతానికి ప్రత్యేకమైన ఒడియాలు పెట్టి అమ్ముతున్నాను. దీనివల్ల నాతోపాటు మరికొంతమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. మొదట్లో గడప దాటినప్పుడు మావారు ‘ఎక్కడికి? ఎందుకు’ అని అడిగేవారు. నిదానంగా ఆయనకు నా గురించి అర్థమైంది. అప్పటి నుంచి తను కూడా నాకు మద్దతుగా నిలుస్తున్నారు. నా ప్రయత్నంవల్ల అనాథ ఆశ్రమాల్లో పెరిగిన కొందరు పిల్లలు ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్లను చూసినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనవుతాను. నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఒక సాధారణ గృహిణిగా ఇంతమంది జీవితాల్లో మార్పు తేగలిగినందుకు సంతృప్తిగా ఉంది. మనం బతకాలి. పక్కవారిని బతికించాలి. ఇదే నా నినాదం.’’

Updated Date - Dec 09 , 2024 | 03:21 AM