ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhavani Jallepally : మహిళలకు... అదే అసలైన స్వాతంత్య్రం

ABN, Publish Date - Aug 15 , 2024 | 05:04 AM

పట్టుదలతో ఏదైనా సాధించొచ్చు. మహిళలకు సహనమే అసలైన పేటెంట్‌ అంటోంది భవాని జల్లెపల్లి. గృహిణిగా.. అమ్మగా.. మల్టీనేషనల్‌ కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌గా మల్టీటాస్క్‌ వర్క్‌ చేస్తున్న భవానీ..

పట్టుదలతో ఏదైనా సాధించొచ్చు. మహిళలకు సహనమే అసలైన పేటెంట్‌ అంటోంది భవాని జల్లెపల్లి. గృహిణిగా.. అమ్మగా.. మల్టీనేషనల్‌ కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌గా మల్టీటాస్క్‌ వర్క్‌ చేస్తున్న భవానీ.. సామాజిక సేవ చేస్తారు. ఇటీవలే జరిగిన మిసెస్‌ ఇండియా 2024లో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఆమెను ‘నవ్య’ పలకరించింది.

‘‘ఢిల్లీలో ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి పదో తేదీ వరకు మిసెస్‌ ఇండియా క్వీన్‌ ఆఫ్‌ సబ్‌స్టాన్స్‌ పోటీల్లో పాల్గొన్నా. మిసెస్‌ హ్యుమానిటీగా నాలుగోస్థానం అందుకున్నా. ఈ అవార్డు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. నన్ను నేను చూసుకున్న ఆ సందర్భం ఎంతో ప్రత్యేకమైనది.

ఊహించని విజయమిది...

మా కొడుకు అభినవ్‌ గతేడాది బి.టెక్‌ చదవటానికి కర్ణాటక వెళ్లాడు. కాస్త ఖాళీగా ఉన్నా. ఏదైనా చేయాలనుకున్న సమయంలో.. మిసెస్‌ అమెరికా అయిన స్వాతిని హైదరాబాద్‌లో కలిశా. ‘మిసెస్‌ ఇండియా’లో పాల్గొనమని ఆమె సలహా ఇచ్చారు. వెంటనే దరఖాస్తు చేశా. పోటీలకు కేవలం రెండు నెలల స్వల్ప వ్యవధి మాత్రమే ఉంది. ముందడుగేశా. ఈ పోటీలో మూడు వందల యాభై మంది పాల్గొన్నారు. మూడు రౌండ్ల వడపోతలో చివరికి ముప్ఫయి మంది మిగిలారు. వారిలో నేనొక్కదాన్ని. ఫైనల్‌ కోసం శిక్షణ తీసుకున్నా. కరెంట్‌అఫైర్స్‌ కోసం పత్రికలు చదవటం ఆరంభించా. వ్యక్తిత్వ వికాస పుస్తకాలూ తిరగేశా. ఎలా మాట్లాడాలి? అనేందుకు యూట్యూబ్‌లో ఇంటర్‌వ్యూలు చూశా. ఎలా నడవాలో శిక్షణ తీసుకున్నా. వ్యక్తిగత ప్రతిభ విభాగం కోసం.. చిన్నప్పుడు నేర్చుకున్న కూచిపూడి నృత్యంలో మళ్లీ శిక్షణ తీసుకున్నా. ఈ పోటీలో నెగ్గాలని తపించా. ఫైనల్‌ వేదికపై కాన్సర్‌తో పోరాడిన అమ్మను.. కరోనాతో కన్నబిడ్డను పోగొట్టుకున్న తల్లిని చూశా. తోటి పోటీదారుల కథలు విని చలించిపోయా. ఎంతో నేర్చుకున్నా. అందం, తెలివే కాదు.. సమయస్ఫూర్తినీ పరీక్షించారు. నా సామాజిక సేవనూ గుర్తించారు. పాల్గొనగలమా? అనే స్థాయి నుంచి నాలుగో స్థానం దక్కించుకోవటం అసలైన విజయంగా భావిస్తాను. ఈ పోటీలతో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. నేనెప్పుడూ ఊహించని విజయమిది.

ఇదీ నా నేపథ్యం...

అమ్మ పేరు కోమల.. గృహిణి. నాన్న పేరు గౌరీ శంకర్‌. ఫుడ్‌ కార్పొరేషన్‌లో అధికారిగా పని చేశారు. కాకినాడ, పాలకొల్లు, విజయవాడ, శ్రీకాకుళం.. లాంటి పలు ప్రాంతాలకు బదిలీ కావటంతో ఆ ప్రాంతాల్లోనే చదువుకున్నా. ‘బాగా చదువుకోవాలి. చేతనైనంత సాయం చేయాలి’ అనేది మా నాన్నగారి నినాదం. నేను డాక్టర్‌ అవుదామనుకున్నా. ర్యాంక్‌ రాకపోవటం వల్ల కుదరలేదు. ఎమ్‌సీఏ చదివాక సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం సంపాదించా. అప్పుడే మా వారు పరిచయం అయ్యారు. పేరు అశోక్‌ కుమార్‌. మాది లవ్‌ మ్యారేజ్‌. ఇద్దరిదీ సాఫ్ట్‌వేర్‌ రంగమే. ఐదేళ్లు ముంబైలో పని చేశాం. పదిహేనేళ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నాం.

అలా సామాజిక సేవలో...

వాస్తవానికి చిన్నప్పటి నుంచే నాలో సేవాగుణం ఉంది. మా సంస్థ చేసే సీఎ్‌సఆర్‌ యాక్టివీటీస్‌లో చురుగ్గా పాల్గొనేదాన్ని. వృద్ధాశ్రమాలకు వెళ్లి వాళ్ల కనీస అవసరాలను తీర్చేవాళ్లం. గత ఐదేళ్ల నుంచీ మేం పిల్లలపై దృష్టి సారించాం. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో.. నలభైకి పైగా సైన్స్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేశాం. వారాంతాల్లో పిల్లలకు లైఫ్‌సైన్స్‌ బోధిస్తుంటా. వెళ్లిన ప్రతి పాఠశాలలో పిల్లలకు అవసరమైన కిట్లు పంపిణీ చేశాం. ఆరోతరగతి నుంచి పదో తరగతి వరకు చదివే పిల్లలతోనే మా ఇంటరాక్షన్‌ ఉంటుంది. ఎందుకంటే ఆలోచించే వయసులోనే సరైన ప్రణాళిక ఇవ్వాలనేదే మా ఆలోచన. ఒకరోజు స్కూల్‌కి వెళ్లినప్పుడు ఒకబ్బాయి మైక్రో ఆర్ట్‌ అద్భుతంగా చేశాడు. అది చూసి ‘ఆ ఆర్ట్‌ ప్రత్యేకత చెప్పాను. దీనికో వేదిక ఉంది. తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి?’ అనే విషయం చెప్పాను. పదో తరగతి పూర్తయ్యాక.. ఫోన్‌ చేయమని నంబర్‌ కూడా ఇచ్చా. అన్నట్లు ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను మాదాపూర్‌లోని మా ఆఫీసుకు ఆహ్వానిస్తాం. ఎందుకంటే వాళ్లకు కార్పొరేట్‌ ప్రపంచం తెలియాలని! మా సంస్థను చూశాక.. పిల్లలంతా ఎన్నో ప్రశ్నలడుగుతారు. ‘ఇక్కడ ఉద్యోగం చేయాలంటే ఏం చేయాలి?’ అని సూటిగా ప్రశ్నిస్తారు. మేం చక్కగా వివరిస్తాం. ప్రభుత్వ పాఠశాలనుంచి వచ్చి.. మా సంస్థలో పని చేసే ఉద్యోగులతో ఆ పిల్లలకు మోటివేషన్‌ క్లాసులు ఇప్పిస్తాం. ఆక్షణంలో ఆ పసి హృదయాల్లోని ఆశ్చర్యం, ఆనందాన్ని వర్ణించలేం!


ఇంటినుంచే నాయకత్వ లక్షణాలు...

ఎన్ని కష్టాలున్నా.. మహిళలు సవాళ్లను స్వీకరిస్తారు. ఒత్తిడిని అధిగమించే శక్తీ ఎక్కువే. ఇక్కడ మేనేజ్‌మెంట్‌ విభాగంలో లీడర్‌గా ప్రూవ్‌ చేసుకోవటం పెద్ద టాస్క్‌. వాస్తవం ఏంటంటే.. మహిళలకు నాయకత్వ లక్షణాలు ఇంటినుంచే అలవడతాయి. చిన్నప్పుడు అమ్మానాన్నలు సపోర్టుగా ఉన్నారు. పెళ్లయ్యాక.. మా ఆయన సహకారం మరువలేనిది. ఆయనే నా బలం. నా పనిని గుర్తించి.. నన్ను ముందుకు నడిపించి.. చప్పట్లు కొట్టి మెచ్చుకునే తత్వం తనది. మా సంస్థ ప్రాజెక్టు పని కోసం బెల్జియంకు ఆహ్వానిస్తే.. ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు మా వారు. ఏడాది పాటు ఆ దేశంలో పని చేయటం వల్ల నాలో కాన్ఫిడెంట్‌ పెరిగింది. ఐఐఎమ్‌లోనూ ఏంబీఏ చదివించారు. కుటుంబ సహకారం లేనిదే నేను లేను. ఇకపోతే మా మామయ్యగారి పేరు గిరిధర రావు. ‘భావన ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌’ నెలకొల్పారు. ఇంటర్‌లో అరవై శాతం సాధించిన పేద విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ కోసం లేదా పైచదువులకోసం ఆర్థిక సహకారం అందిస్తారు. నేను కూడా ఆ ట్రస్ట్‌ను చూసుకుంటా. నేను చెప్పేదొక్కటే.. ప్రతి మహిళకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాల్సిందే. అదే అసలు సిసలైన స్వాతంత్య్రం. అది తెచ్చే భద్రత, ఆత్మవిశ్వాసం.. ఏదీ ఇవ్వదు. గృహిణి అయినా సరే.. తనకున్న వనరుల్లో సంపాదించాలి. అప్పుడే ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇతరులు చూసే దృక్కోణం మారుతుంది. ఈ విషయాలను ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లినప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలకు చెబుతాను. కొత్తగా మా సంస్థలో చేరే ఫ్రెషర్స్‌కు కాస్త ఖర్చులు తగ్గించి.. కనీసం పదిశాతం మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ చేయమని చెబుతా. కొత్తతరాన్ని ఎడ్యుకేట్‌ చేయటం నాకెంతో ఇష్టం. ఇదో సామాజిక బాధ్యతగా భావిస్తాను.’’

ఇరవై ఏళ్ల నుంచి సాఫ్ట్‌వేర్‌ రంగంలో పని చేస్తున్నా. ఫుడ్‌, ట్రావెల్‌ బ్లాగ్‌ రాయటం హాబీ. పెయింటింగ్స్‌ చేస్తా. నా అఛీవ్‌మెంట్స్‌ను మా అబ్బాయి అభినవ్‌ ప్రశంసించటం గొప్పగా భావిస్తా. మా నాన్నగారు విచిత్రంగా రిటైర్‌ అయ్యాక.. ఫిట్‌నెస్‌ సంపాదించారు. డెబ్భయ్‌ రెండేళ్ల వయసులో విదేశాల్లో సైతం.. రన్నింగ్‌లో వరల్డ్‌ ఛాంపియన్‌గా బంగారు పతకాలు కొడుతున్నారు. ఇకపోతే మా మామయ్యగారు టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో దేశస్థాయిలోనూ పతకాలు గెలిచారు. ఆయన వయసు డెబ్భయ్‌ ఎనిమిదేళ్లు. ఇలా మా ఇంట్లోనే ఇద్దరు రియల్‌ హీరోలు ఉన్నారు.

రాళ్లపల్లి రాజావలి

Updated Date - Aug 15 , 2024 | 06:21 AM

Advertising
Advertising
<