ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Karthikamasam: అష్ట సోమేశ్వర ఆలయాలు

ABN, Publish Date - Nov 22 , 2024 | 06:25 AM

పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా తెలుగు ప్రాంతాల్లోని భక్తులు విరివిగా సందర్శించుకొనే క్షేత్రాల్లో అష్ట సోమేశ్వరాలయాలు విశిష్టమైనవి. రుద్రరూపుడైన ద్రాక్షారామంలో కొలువైన భీమేశ్వరుణ్ణి శాంతింపజేయడం

పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా తెలుగు ప్రాంతాల్లోని భక్తులు విరివిగా సందర్శించుకొనే క్షేత్రాల్లో అష్ట సోమేశ్వరాలయాలు విశిష్టమైనవి. రుద్రరూపుడైన ద్రాక్షారామంలో కొలువైన భీమేశ్వరుణ్ణి శాంతింపజేయడం కోసం... ఆ క్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లో శివలింగ ప్రతిష్ఠ జరిగిందనీ, అవే అష్ట సోమేశ్వర ఆలయాలుగా ప్రసిద్ధి చెందాయనీ స్థలపురాణాలు చెబుతున్నాయి. ఈ అష్ట లింగాలతోపాటు ద్రాక్షారామ భీమేశ్వరుణ్ణి దర్శించుకుంటే... శివానుగ్రహంతో పాటు చంద్రగ్రహ దోష నివారణ కూడా జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. అలాగే వివిధ నక్షత్ర దోషాల నివారణకు కూడా ఈ ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు.

వాయవ్యం... సోమేశ్వరం

ద్రాక్షారామానికి 14 కిలోమీటర్ల దూరంలోని సోమేశ్వరంలో శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత సోమేశ్వర లింగం ఉంది. చంద్రుడు శివునికోసం తపస్సు చేసి, లింగ ప్రతిష్ఠ చేసిన ప్రదేశం కాబట్టి దీనికి ‘సోమేశ్వరం’ అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. ఈ ఆలయంలో శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ పర్వతవర్థనీ సమేత బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలతో పాటు సూర్యనారాయణుడు, కాలభైరవస్వామిని, క్షేత్రపాలకుడైన హనుమంతుణ్ణి దర్శించుకోవచ్చు. ఒకే పీఠంపై శివలింగం, బాలాత్రిపురసుందరీదేవి కొలువై ఉండడం విశేషం.

ఉత్తరం... వెల్ల

వశిష్ట మహర్షి ప్రతిష్ఠించినదిగా పురాణాలు పేర్కొంటున్న శ్రీబాలా త్రిపుర సుందరీ సమేత సోమేశ్వర లింగం ద్రాక్షారామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని వెల్ల గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో సోమేశ్వర ఆలయం, క్షేత్రపాలకుడైన శ్రీవేణుగోపాలస్వామి ఆలయం ఒకే ప్రాంగణంలో ఉంటాయి. ఇక్కడ కొలువైన నవగ్రహాలు, సీతారామస్వామి, శ్రీవేంకటేశ్వర స్వామి తదితర దేవతా మూర్తులను కూడా దర్శించుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున సోమేశ్వరుడికి, వేణుగోపాలునికి ఒకేసారి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు.

ఈశాన్యం... పెనుమళ్ళ

ద్రాక్షారామానికి 10 కిలోమీటర్ల దూరంలోని పెనుమళ్ళలో... ఆత్రేయనదీ సాగర సంగమ తీరంలో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయంలోని లింగాన్ని జమదగ్ని మహర్షి ప్రతిష్ఠించాడని చెబుతారు. శ్రీరాముడు క్షేత్రపాలకుడిగా ఉంటాడు. ఇక్కడి రావి చెట్టుని సంతానప్రాప్తి కోసం, వివిధ దోషాల నివారణ కోసం నాగప్రతిమలను భక్తులు పూజిస్తారు.

నైరుతి... కోరుమిల్లి

ద్రాక్షారామానికి 21కిలోమీటర్ల దూరంలో... పవిత్ర గోదావరీ తీరాన కోరుమల్లిలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ లింగాన్ని భరద్వాజ మహర్షి ప్రతిష్ఠించాడు. క్షేత్రపాలకుడైన శ్రీదేవీ భూదేవీ సమేత జనార్దన స్వామితో పాటు లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయి. పశ్చిమ దిశగా ఉండే ఈ ఆలయంలోకి పశ్చిమ, తూర్పు ద్వారాల నుంచి ప్రవేశాలు ఉండడం విశేషం.

పడమర... వెంటూరు

తుల్య నదీ సాగర సంగమం దగ్గర... వెంటూరులో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. ఈ ఆలయం ద్రాక్షారామానికి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి లింగం విశ్వామిత్ర ప్రతిష్ఠితం కాగా... క్షేత్రపాలకుడైన శ్రీదేవీ భూదేవీ సమేత కేశవ స్వామి ఆలయం, శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉన్నాయి. గణపతి, నందీశ్వరుడు తదితర దేవతా మూర్తులను కూడా ఈ ప్రాంగణంలో దర్శించుకోవచ్చు.

తూర్పు... కోలంక

ద్రాక్షారామానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో... ఆత్రేయ నదికి సమీపంలోని కోలంకలో శ్రీ ఉమాసమేత సోమేశ్వరస్వామి వారి ఆలయం ఉంది. దీనితోపాటు క్షేత్రపాలకుడైన కేశవస్వామి గుడి కూడా అదే ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయంలోని లింగాన్ని సూర్యుడు ప్రతిష్ఠించాడని చెబుతారు.

దక్షిణం... కోటిపల్లి

గౌతమీ నదీ తీరాన... ద్రాక్షారామానికి 11 కిలోమీటర్ల దూరంలోని కోటిపల్లిలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. క్షేత్రపాలకుడు శ్రీ సిద్ధి జనార్దన స్వామి. ఇక్కడ తెప్పోత్సవంతో సహా శివ కేశవులకు ఇద్దరికీ ఒకేసారి ఉత్సవాలు జరపడం విశేషం. ఈ లింగాన్ని అత్రి మహాముని ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది.

ఆగ్నేయం... దంగేరు

దంగేరు శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయం ద్రాక్షారామానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని కశ్యప మహర్షి ప్రతిష్ఠించాడని ప్రతీని. శ్రీ వేణుగోపాలస్వామి క్షేత్రపాలకుడైన ఈ ఆలయ ప్రాంగణంలో పలు దేవతామూర్తులు కొలువుతీరి ఉంటారు.

Updated Date - Nov 22 , 2024 | 05:24 PM