navya : ఉండాలా? వద్దా?
ABN, Publish Date - May 15 , 2024 | 12:09 AM
పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తర్వాత బయటకు వెళ్లి స్వతంత్రంగా జీవిస్తే మంచిదా? తల్లితండ్రుల వద్దే ఉండి వారి సాయం తీసుకుంటే మంచిదా? ఈ విషయంలో అనేక సార్లు చర్చ జరుగుతూనే ఉంటుంది.
పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తర్వాత బయటకు వెళ్లి స్వతంత్రంగా జీవిస్తే మంచిదా? తల్లితండ్రుల వద్దే ఉండి వారి సాయం తీసుకుంటే మంచిదా? ఈ విషయంలో అనేక సార్లు చర్చ జరుగుతూనే ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో టీనేజ్ వచ్చిన తర్వాత పిల్లలు బయటకు వెళ్లి సంపాదించుకొని స్వతంత్రంగా జీవిస్తూ ఉంటారు. మన దేశంలో మాత్రం పిల్లలు తల్లితండ్రుల వద్దే ఉంటారు.
తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ తన కుమార్తె రాహను 20 ఏళ్లు దాటిన తర్వాత కూడా బయటకు వెళ్లనివ్వనని పేర్కొనటంతో ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక పెద్ద చర్చ ప్రారంభమయింది. తనకు 23 ఏళ్లు ఉండగా బయటకు వచ్చేశానని.. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండేదానినని.. తాను ఎక్కడున్నానో తల్లితండ్రులకు తెలియదని.. తన కుమార్తెకు అలాంటి పరిస్థితి రాకూడదని భావిస్తున్నానని ఆలియా పేర్కొన్నారు. కొందరు మానసిక నిపుణులు ఆలియాతో ఏకీభవిస్తున్నారు. వారేమంటున్నారో చూద్దాం..
ఎమోషనల్ సపోర్ట్
సుమారు 21 ఏళ్లకు చదువు పూర్తవుతుంది. పిల్లలు తమ కెరీర్‌ను ప్రారంభిస్తారు. అదే సమయంలో వారు తమ వ్యక్తిగత జీవితంపై కూడా దృష్టి పెడతారు. ఈ సమయంలో వారికి ఎదురయ్యే వృత్తిపరమైన, వ్యక్తిగతమైన సవాళ్లను ఎదుర్కోవటానికి తల్లితండ్రుల మద్దతు ఉంటే మంచిది. తల్లితండ్రులు, కుటుంబంలోని ఇతర సభ్యులు వారిని ఎప్పటికప్పుడు వారిని మోటివేట్ చేయటానికి వీలవుతుంది.
బాధ్యతల బరువు
చిన్నప్పుడే బయటకు వచ్చేసి కుటుంబ బాధ్యతలను అందుకోగలిగితే మంచిదే! కానీ కొందరికి బాధ్యతలు చేపట్టే పరిణితి ఉండదు. వారికి బాధ్యతలు చాలా బరువుగా అనిపిస్తాయి. అలాంటి వారికి కుటుంబ మద్దతు అవసరం.
కుటుంబ విలువలు
ఒక వ్యక్తి కుటుంబంతో కలిసి జీవిస్తుంటే- కుటుంబ విలువలు, ఆచార సాంప్రదాయాలు అర్థమవుతాయి. ఉదాహరణకు ఒక పండగ వచ్చినప్పుడు ఒంటరిగా ఉండటానికి కుటుంబంతో కలిసి ఉండటానికి మధ్య చాలా తేడా ఉంటుంది. కుటుంబంతో కలిసి ఉంటే ఆచార వ్యవహారాలు తెలుసుకోవటానికి వీలుంటుంది.
జీవిత సలహాలు
20లలో చాలా మంది రకరకాల భావోద్వేగాలతో కొట్టుకుపోతూ ఉంటారు. కొందరు మంచి, చెడులను బేరీజు వేసుకోలేని స్థితిలో ఉంటారు. అలాంటి సమయాలలో కుటుంబ వ్యవస్థ మద్దతు ఇస్తుంది. వారు జీవితంలో ఎదిగేలా చేస్తుంది.
Updated Date - May 15 , 2024 | 12:09 AM