Chicken: శీతాకాలం చికెన్!
ABN, Publish Date - Dec 14 , 2024 | 03:37 AM
శీతాకాలంలో సాధారణం కన్నా ఎక్కువ రోగ నిరోధకశక్తి అవసరమవుతుంది. దీన్ని పెంపొందించుకోవటంలో ప్రొటీన్ కీలకమైన పాత్ర పోషిస్తుంది.
శీతాకాలంలో సాధారణం కన్నా ఎక్కువ రోగ నిరోధకశక్తి అవసరమవుతుంది. దీన్ని పెంపొందించుకోవటంలో ప్రొటీన్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రొటీన్‌ను మనకు అధికంగా అందించేది చికెన్. అందుకే చికెన్‌తో ఎలాంటి వంటలు చేసుకోవచ్చో చూద్దాం.
మెంతి చికెన్
కావాల్సిన పదార్థాలు
ఎముకలు లేని చికెన్ ముక్కలు- అరకేజీ, తరిగిన ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, టమోటా ముక్కలు- ఒక కప్పు, తరిగిన మెంతికూర- ఒక కప్పు, పచ్చిమిర్చి ముక్కలు- రెండు స్పూనులు, నిమ్మరసం- ఒక చెంచా, ఎర్ర కారం- ఒక చెంచా, అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక చెంచా, పెరుగు- ఒక చెంచా, ధనియాల పొడి- ఒక చెంచా, నూనె- పావు కప్పు, ఏలకులు- నాలుగు, దాల్చిన చెక్క- అర ఇంచు, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని
తయారీ విధానం
ఒక గిన్నెలో చికెన్ ముక్కలను తీసుకొని నిమ్మరసం, ఎర్రకారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 20 నిమిషాలు ఉంచాలి.
మరొక గిన్నెలో పెరుగు, ఎర్రకారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.
ఒక మూకుడులో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. ఈ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సి గిన్నెలో వేసి ముద్దగా చేయాలి.
ఉల్లిపాయ ముక్కలు వేయించిన మూకుడులోనే నానబెట్టిన చికెన్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి. వాటిని బయటకు తీసి చల్లార్చాలి.
ఈ మూకుడులోనే ఏలకులు, దాల్చిన చెక్క, టమోటా ముక్కలు, మెంతికూర, పచ్చి మిర్చి ముక్కలు వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముద్దను కూడా వేయాలి. ఈ మిశ్రమంలో వేయించిన చికెన్ ముక్కలు వేసి తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
జాగ్రత్తలు
మెంతికూర అందుబాటులో లేకపోతే ఎండబెట్టిన మెంతికూర (కసూరి మేతి) షాపుల్లో దొరుకుతుంది. దానిని వాడవచ్చు.
తాజా చికెన్‌తో చేస్తే మంచి రుచి వస్తుంది.
చికెన్ నీంబూ ధనియా షోర్బా
కావాల్సిన పదార్థాలు:
చికెన్ ముక్కలు- 50 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్- పావు చెంచా, ధనియాలు- ఒక చెంచా, నిమ్మరసం- ఒక చిన్న కప్పు, క్రీమ్- రెండు చెంచాలు, వెన్న- అర చెంచా, పసుపు- పావు చెంచా, పచ్చి మిర్చి పేస్ట్- అర చెంచా, కార్న్‌ఫ్లోర్- ఒక చెంచా, ఉప్పు- తగినంత
తయారీ విధానం
ఒక గిన్నెలో మూడు పెద్ద కప్పుల నీళ్లు తీసుకొని సన్నని సెగపై మరిగించాలి. నీళ్లు పొంగిన తర్వాత వాటిలో చికెన్ ముక్కలు వేయాలి.
చికెన్ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాలు, పచ్చిమిర్చి పేస్ట్, క్రీమ్, వెన్న, నిమ్మరసం వేసి ఉడకనివ్వాలి.
ఆ తర్వాత ఉప్పు, కార్న్‌ఫ్లోర్ వేయాలి. దగ్గర పడిన తర్వాత దింపేయాలి.
జాగ్రత్తలు
సూప్ కన్నా షోర్బా చిక్కగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ నీళ్లు పోయకూడదు.
అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుబాటులో లేక వేయకపోయినా మంచి రుచి వస్తుంది.
ఆలూ చికెన్ పులుసు
కావాల్సిన పదార్థాలు
చికెన్ ముక్కలు: ఒక కేజీ, తెల్ల వెనిగర్ - నాలుగు చెంచాలు, బంగాళదుంప ముక్కలు- ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, వెల్లుల్లి ముక్కలు- ఒక చెంచా, అల్లం ముక్కలు- ఒక చెంచా, పచ్చిమిరిపకాయ ముక్కలు- రెండు చెంచాలు, ఏలకులు- నాలుగు, లవంగాలు- నాలుగు, దాల్చిన చెక్క- ఒక ఇంచు, కొబ్బరి పాలు- రెండు కప్పులు, కరివేపాకు- ఒక రెబ్బ, నూనె- పావు కప్పు, ఉప్పు- తగినంత
తయారీ విధానం
కుక్కర్‌లో చికెన్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, తెల్ల వెనిగర్, ఉప్పు వేసి ఒక కూత వచ్చే దాకా ఉడికించాలి.
ఒక మూకుడులో నాలుగు స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు, పచ్చి మిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి.
ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు, బంగాళ దుంప ముక్కలు, కొబ్బరి పాలు పోసి ఉడకబెట్టాలి.
ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత ఉప్పు వేయాలి. వేరే చిన్న మూకుడులో కొద్దిగా నూనెను వేడి చేసి కరివేపాకు వేయించి.. మిశ్రమంలో పోపు పెట్టాలి.
జాగ్రత్తలు
ఈ పులుసు దోసెలలో తింటే బాగుంటుంది.
పోపు పెట్టే సమయంలో కేవలం కరివేపాకు మాత్రమే వేయాలి. ఆవాలు, మెంతులు వంటివి వేయకూడదు.
Updated Date - Dec 14 , 2024 | 03:38 AM