ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Celeb Talk : స్టార్‌డమ్‌ దిశగా..!

ABN, Publish Date - Nov 03 , 2024 | 03:46 AM

నాజూకైన రూపు... గమ్మత్తయిన చూపు... వెండితెరపై మెరుపు తీగలా మైమరిపిస్తుంది దిశా పటాని. తెలుగు చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ భామ... ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా మారింది. ప్రభాస్‌ ‘కల్కి....

సెలబ్‌ టాక్‌

నాజూకైన రూపు... గమ్మత్తయిన చూపు... వెండితెరపై మెరుపు తీగలా మైమరిపిస్తుంది దిశా పటాని. తెలుగు చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ భామ... ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా మారింది. ప్రభాస్‌ ‘కల్కి 2898ఏడీ’లో అలరించిన దిశ... తమిళ స్టార్‌ సూర్యా ‘కంగువా’తో మరో భారీ హిట్‌ కోసం ఎదురుచూస్తోంది.

దాదాపు పదేళ్ల కిందట కెరీర్‌ ప్రారంభించిన దిశా పటాని... ఇప్పటికి పధ్నాలుగు చిత్రాల్లో నటించింది. విశేషమేమంటే... వీటిల్లో అత్యధికం భారీ బడ్జెట్‌ సినిమాలే. అదీ సల్మాన్‌, టైగర్‌ షరాఫ్‌, ప్రభాస్‌, సూర్య, జాకీచాన్‌ లాంటి సూపర్‌స్టార్స్‌తో కలిసి పని చేసింది. ‘ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా... ఆమెను వెండితెరకు పరిచయం చేసింది మాత్రం తెలుగు పరిశ్రమే. పూరి జగన్నాథ్‌ ‘లోఫర్‌’లో వరుణ్‌తేజ్‌కు జోడీగా ప్రధాన పాత్ర పోషించిన దిశ... ఆ మరుసటి ఏడాది ‘ఎంసెస్‌ ధోనీ’లో అవకాశం దక్కించుకుంది. ఈ అపురూప విజయంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ పేరు దేశమంతా మారుమోగింది. భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం కావడంతో... సినీ ప్రేమికులతో పాటు కోట్లాదిమంది క్రికెట్‌ అభిమానులకు కూడా దిశ సుపరిచితురాలైంది.


  • పైలెట్‌ కావాలనుకుని...

దిశ కుటుంబంలో సినీ పరిశ్రమ నేపథ్యం ఉన్నవారు ఎవరూ లేరు. ఆమె తండ్రి జగదీశ్‌సింగ్‌ పోలీస్‌ అధికారి. తల్లి హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌. అక్క కుష్బూ భారత సైన్యంలో లెఫ్టినెంట్‌. తమ్ముడు సూర్యాంశ్‌. బడికి వెళ్లే రోజుల్లో దిశ కూడా భిన్నంగా ఆలోచించింది. ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌ అవుదామనుకుంది. ఎందుకంటే ఎప్పుడూ తనను తాను ప్రత్యేకంగా నిలుపుకోవడానికే ఆమె ప్రయత్నించింది.

‘మా ఇంట్లో ఒకరి కెరీర్‌తో వేరొకరికి పొంతన ఉండదు. పోలీస్‌, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, ఆర్మీ... ఇలా ఒక్కోరిదీ ఒక్కో రంగం. ఎవరికి నచ్చింది వారు ఎంచుకున్నారు. నేనూ అంతే. ఆ స్వేచ్ఛ మాకు ఇంట్లో ఎప్పుడూ ఉంది. చిన్నప్పటి నుంచి అమ్మానాన్న ప్రోత్సాహంతో మేం బాగా చదివేవాళ్లం. మొదట్లో ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌ కావాలనుకున్నాను. కారణం ఏదైతేనేం... అది నెరవేరలేదు. నేను, అక్క క్రీడల్లో చురుగ్గా పాల్గొనేవాళ్లం. నేను బాస్కెట్‌బాల్‌ ఆడేదాన్ని. తనైతే... అన్ని ఆటలూ ఆడేసేది. చదువుతో పాటు ఆటలు కూడా విద్యార్థుల జీవితంలో భాగం కావాలి. దానివల్ల గెలిచినప్పుడు, అలాగే ఓటమి ఎదురైనప్పుడు సమానంగా స్వీకరించగలుగుతారు. ఒడుదొడుకులకు లోనుకాకుండా ముందుకు సాగిపోవడంతో పాటు విలువైన జీవిత పాఠాలు ఎన్నో నేర్చుకొంటారు. స్వతంత్రంగా ఆలోచించగలుగుతారు. మా నాన్న మమ్మల్ని అలానే పెంచారు. ఎంతటి క్లిష్టమైన పని అయినా సరే... శ్రమించి సాధించాలే కానీ, భయపడి వెనక్కి తగ్గకూడదనేది నేర్పించారు. వేరొకరిపై ఆధారపడకుండా మా పని మేమే చేసుకొనేలా ప్రోత్సహించారు. అందుకే ఇవాళ నేను ఎన్ని ఇబ్బందులు, సమస్యలు, ఒత్తిడులు ఎదురైనా ముంబయి మహానగరంలో నిలబడగలిగాను’ అంటున్న దిశ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి.


  • ఒంటరిగా మహానగరానికి...

లఖనవూ అమిటీ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ చదువుతున్న సమయంలో ఆమెకు నటనపై మక్కువ కలిగింది. దాంతో రెండేళ్లు మిగిలి ఉండగానే ఇంజనీరింగ్‌ వదిలేసింది. పరిశ్రమలో అవకాశాలు వెతుక్కొనేందుకు ముంబయికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ‘‘ముంబయికి వచ్చినప్పుడు నా వయసు పద్ధెనిమిది. ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఆరంభంలో మోడలింగ్‌ చేశాను. ఎన్నో ఎత్తుపల్లాలు, అవమానాలు ఎదురయ్యాయి. అపజయాలు పంచుకోవడానికి కూడా ఎవరూ లేరు అప్పుడు. కానీ నేను పెరిగిన నేపథ్యం, అనుభవాలు వాటిని తట్టుకొని పోరాడగలిగే శక్తినిచ్చాయి. ఇల్లు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, వండుకోవడం... ఆడిషన్స్‌కు వెళుతూనే అన్నీ చేసుకొనేదాన్ని. ముఖ్యంగా కరోనా మహమ్మారి ఎన్నో జీవిత పాఠాలు నేర్పింది. వేరొకరి సాయం లేకుండా మన పని మనమే చేసుకోవడం అలవాటైంది. అంతేకాదు... భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని, మనం మానసికంగా బలోపేతం కావడానికి దోహదపడింది’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది దిశ.


  • చేతి నిండా పని...

సినిమా ప్రయత్నాల్లో భాగంగా దిశ మోడలింగ్‌తో పాటు అందాల పోటీల్లోనూ పాల్గొంది. పలు మ్యూజిక్‌ వీడియోల్లోనూ నటించింది. హీరో టైగర్‌ షరాఫ్‌తో కలిసి ఓ మ్యూజిక్‌ వీడియోలో కనిపించిన ఆమె... ఆ తరువాత అతనితో కలిసి ‘భాగీ2’, ‘భాగీ3’ చిత్రాలు చేసింది. జాకీచాన్‌ చైనీస్‌ సినిమా ‘కుంగ్‌ఫూ యోగా’లో మెరిసింది. ప్రస్తుతం తమిళ హీరో సూర్య ‘కంగువ’, ఫిరోజ్‌ నడియడ్‌వాలా నిర్మాణంలో, అనీస్‌ బజ్మీ దర్శకత్వంవహిస్తున్న ‘వెల్కమ్‌ టూ జంగిల్‌’ ప్రాజెక్ట్‌లు ఆమె చేతిలో ఉన్నాయి. ఇది రెండూ భారీ బడ్జెట్‌ చిత్రాలు.

  • ఆరు కోట్లమంది...

ఏడాదికి ఒక చిత్రం చేస్తూ వచ్చిన దిశ.. ఈ ఏడాది మూడింటిలో నటించింది. ఎంత బిజీగా ఉన్నా... సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పుడూ అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు, ఫిట్‌నెస్‌, ఆరోగ్య రహస్యాలను ఎప్పటికప్పుడు వారితో పంచుకొంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకున్న ఫాలోయింగ్‌ చూస్తే మతిపోతుంది. అక్షరాలా ఆరు కోట్ల పదిహేను లక్షలమంది ఆమెను ఫాలో అవుతున్నారు. ప్రతి పోస్ట్‌కూ వ్యూస్‌, లైక్స్‌ కూడా అదే స్థాయిలో ఉంటాయి.

Updated Date - Nov 03 , 2024 | 03:46 AM