ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చూపులేకపోయినా... వండి చూపిస్తున్నారు!

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:06 AM

ముప్ఫై అయిదేళ్ళ వయసులో సోకిన అరుదైన వ్యాధితో కంటిచూపు శాశ్వతంగా పోయినా... భూమిక సుదర్శన్‌ ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. సవాళ్ళన్నిటినీ

ముప్ఫై అయిదేళ్ళ వయసులో సోకిన అరుదైన వ్యాధితో కంటిచూపు శాశ్వతంగా పోయినా... భూమిక సుదర్శన్‌ ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. సవాళ్ళన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. యూట్యూబ్‌ వీడియోల్లో తన వంట నైపుణ్యాలను పరిచయం చేస్తూ, ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు.

ఎవరైనా ‘‘మీ వంట చాలా రుచిగా ఉంది’’ అని చెబితే... ‘‘కంటికి ఇంపుగా కనిపిస్తోందా?’’ అని వెంటనే అడుగుతారు భూమిక సుదర్శన్‌. ఎందుకంటే వాటిని ఆమె చూడలేరు. చిన్న తలనొప్పితో ప్రారంభమైన అరుదైన వ్యాధి 35 ఏళ్ళ వయసులో ఆమె అంధత్వానికి కారణమయింది. ‘‘మాది బెంగళూరు. భర్త, పిల్లలతో హాయిగా సాగిపోతున్న జీవితం నాది. కొన్నేళ్ళ క్రితం... తరచూ తలనొప్పి వస్తూ ఉండడంతో డాక్టర్‌ను కలిశాను. వైద్య పరీక్షలు చేయించి ‘‘మీకు ఆప్టికల్‌ న్యూరోసిస్‌ ఉంది’’ అని చెప్పారు. ఆ పేరు అంతకుముందు ఎప్పుడూ నేను వినలేదు. అది అయిదు లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి అనీ, దానివల్ల క్రమంగా చూపును కోల్పోవాల్సి వస్తుందనీ తెలిసింది. ఆ తరువాత ఎన్నో ఆసుపత్రులు తిరిగాం.. కానీ ఫలితం లేకపోయింది. చివరకు నా కళ్ళు పూర్తిగా కనిపించడం మానేశాయి’’ అని చెప్పారు భూమిక. హఠాత్తుగా చీకటి మయమైపోయిన జీవితాన్ని కొనసాగించడానికి ఆమె ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ‘‘ఆ వేదనను తట్టుకోవడం కష్టమయింది. ఎవరి సాయం లేకుండా నడవ లేను. ఏదీ చదవలేను, రాయలేను. మా ఇల్లు కూడా నాకు అపరిచితంగా అనిపించేది. అగాధంలో పడిపోయిన భావన. ఆ సమయంలో నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోకుండా నా భర్త, కుటుంబం అండగా నిలిచింది’’ అని గుర్తు చేసుకున్నారామె.


నిరర్థకంగా మిగిలిపోకూడదని...

కొత్త జీవితానికి భూమిక క్రమంగా అలవాటు పడ్డారు. అయితే ఖాళీగా కూర్చోవడం ఆమెకు నచ్చలేదు. ఆమె ఏదైనా పని చేస్తానంటే ‘‘మేం ఉన్నాం కదా! నీకెందుకు శ్రమ’’ అనేవారు ఇంట్లోవారు. ‘ఇలా నిరర్థకంగా మిగిలిపోకూడదు’ అని ఆమె అనుకున్నారు. వంటపనిలో సాయం చెయ్యాలనుకున్నారు. వంట చెయ్యడం, అందరికీ వడ్డించడం, ఆ వంటల్ని వాళ్ళు సంతృప్తిగా తింటే ఆనందించడం ఆమెకు ఇష్టం. ‘‘అయితే ఏ వస్తువు ఏదో అర్థమయ్యేది కాదు. వాటిని చేతిలోకి తీసుకొని, వాసన చూసి తెలుసుకొనేదాన్ని. కాయగూరల్లో పాడైన భాగాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడమూ కష్టమయ్యేది. అప్పుడే అంధులకు ఆడియో సలహాలతో సాయపడే ఒక వాట్సాప్‌ గ్రూప్‌ గురించి తెలిసింది. దాని ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అని చెప్పారు భూమిక. చూపు లేకపోయినా భూమిక ఏమాత్రం తడబడకుండా వంట చేయడం, రుచులు కూడా అద్భుతంగా ఉండడం గమనించిన ఆమె భర్త సుదర్శన్‌... వాటిని వీడియోలు తీశారు. ఆ వీడియోలను ఎడిట్‌ చేసి యూట్యూబ్‌లో పెట్టాలనే ఆలోచన మాత్రం భూమికదే. ‘‘మా బంధువు ఒకరికి యూట్యూబ్‌ ఛానెల్‌ ఉంది. ఎంతో పేరు వచ్చింది. డబ్బు కూడా వస్తోంది. నా వంటల వీడియోలను కూడా యూట్యూబ్‌లో పెడితే బాగుంటుందను కున్నాను. నా భర్తకు ఆ ఆలోచన బాగా నచ్చింది. మరికొన్ని వీడియోలు రికార్డ్‌ చేశారు. ‘భూమిక కిచెన్‌’ అనే పేరుతో ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ను 2018లో ప్రారంభించాం’’ అని చెప్పారు భూమిక.

గాయాలవుతూ ఉంటాయి...

భూమిక కిచెన్‌... భారతదేశంలో అంధురాలైన ఒక మహిళ ప్రారంభించిన తొలి యూట్యూబ్‌ ఛానల్‌. దానికి కొద్ది రోజుల్లోనే వీక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ‘‘కొత్తగా వంట నేర్చుకుంటున్నవారు, బ్యాచిలర్స్‌ సులువుగా చేసుకోగలిగే వంటలే ఎక్కువగా పోస్ట్‌ చేస్తాను. అన్నీ శాకాహార వంటలే. నాలాంటివారు తమ నైపుణ్యాలను ఇతరులతో పంచుకోవడానికి యూట్యూబ్‌ లాంటి వేదికలు ఎంతో ఉపకరిస్తున్నాయి’’ అని చెబుతున్న భూమిక 1,300కు పైగా వంటల్ని పోస్ట్‌ చేశారు. ఆమె ఛానల్‌కు దాదాపు 88 వేలమంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ‘‘ఇది అంత సులువుగా సాగే ప్రయాణం కాదు. వంట అంటేనే నిప్పుతో చెలగాటం. ప్రతి రోజూ ఒక యుద్ధంలాంటిది. నా భర్త, కుటుంబం అనుక్షణం సహాయంగా ఉంటారు. కానీ నాకు చూపు లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వంటకాలు ప్రతిసారీ అనుకున్నట్టు కుదరవు. కూరగాయలు కోసేటప్పుడు, వంట చేసేటప్పుడు గాయాలు అవుతూ ఉంటాయి. నా భద్రత గురించి నా చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ ఆందోళనతోనే ఉంటారు. నేను చేసే పనిలో అపాయం ఉందని నాకూ తెలుసు. అయితే చూపు పోయిందని బాధపడుతూ... నాలుగు గోడల మధ్యకే పరిమితమైపోవలసిన నాకు ఆ వీడియోలు ఎన్నడూ ఊహించని గుర్తింపు తెచ్చాయి. ఆదాయం కూడా వస్తోంది. వేలాదిమంది మెచ్చుకుంటున్నారు. ఎంతోమంది ‘’మీరే నాకు స్ఫూర్తి’’ అని చెబుతున్నారు. కాబట్టి కష్టమైనా... నాకు ఇష్టమైన ఈ పనిని కొనసాగిస్తూనే ఉంటాను’’ అంటున్నారు భూమిక.

‘‘చూపు పోయిందని బాధపడుతూ... నాలుగు గోడల మధ్యకే పరిమితమైపోవలసిన నాకు ఆ వీడియోలు ఎన్నడూ ఊహించని గుర్తింపు తెచ్చాయి. ఆదాయం కూడా వస్తోంది. ఎంతోమంది ‘’మీరే నాకు స్ఫూర్తి’’ అని చెబుతున్నారు. కాబట్టి కష్టమైనా... నాకు ఇష్టమైన ఈ పనిని కొనసాగిస్తూనే ఉంటాను’’

Updated Date - Oct 21 , 2024 | 12:06 AM