Child Health : పిల్లలకు దగ్గు మందు ఇవ్వొచ్చా?
ABN, Publish Date - Dec 04 , 2024 | 11:22 PM
డాక్టర్! పిల్లలకు దగ్గు వచ్చినప్పుడల్లా మెడికల్ షాపులో దొరికే దగ్గు మందు తాగిస్తూ ఉంటాం! ఇలా తాగించటం మంచిదేనా? పదే పదే దగ్గు మందు తాగించటం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బ తింటుందా? అసలు దగ్గుకు ఎలాంటి చికిత్స ఇప్పించాలి?
డాక్టర్! పిల్లలకు దగ్గు వచ్చినప్పుడల్లా మెడికల్ షాపులో దొరికే దగ్గు మందు తాగిస్తూ ఉంటాం! ఇలా తాగించటం మంచిదేనా? పదే పదే దగ్గు మందు తాగించటం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బ తింటుందా? అసలు దగ్గుకు ఎలాంటి చికిత్స ఇప్పించాలి?
- ఓ సోదరి, హైదరాబాద్.
పిల్లల దగ్గుకు కారణాన్ని కనిపెట్టి చికిత్స చేయాలి. అలాంటి చికిత్సతో దగ్గు తగ్గుతుంది. పిల్లల్లో దగ్గుకు ఎన్నో కారణాలుంటాయి. ఉబ్బసం, అలర్జీ, సాధారణ దగ్గు... ఇలా ఏ కారణం వల్లైనా దగ్గు మొదలవ్వొచ్చు. అయితే ఎలాంటి దగ్గు కనిపించినా, వెంటనే దగ్గు మందులు కొనేసి వాడేస్తూ ఉంటారు. ఇది సరి కాదు. ‘దగ్గు ఎందుకొస్తోంది? అది ఎలాంటి దగ్గు?’ అనే విషయాలను అర్థం చేసుకుని మూల కారణానికి చికిత్స చేయాలి. దగ్గుతో పాటు, ముక్కు నుంచి నీరు కారుతూ, పిల్లి కూతలు వినిపిస్తుంటే దాన్ని అలర్జీగా భావించి అలర్జీని తగ్గించే మందులు వాడాల్సి ఉంటుంది. వాటితోపాటు అలర్జీ కారకాలను గుర్తించి వాటికి దూరంగా ఉంచాలి. దగ్గుతో పాటు ఆయాసం ఉంటే, ఉబ్బసంగా భావించి అందుకు తగిన ఇన్‌హేలర్లు వాడాల్సి ఉంటుంది. సాధారణ దగ్గు, జలుబు అయితే 3 నుంచి 5 రోజుల్లో తగ్గుతుంది. ఆ సమయంలో సరిపడా నీళ్లు తాగిస్తూ, ఆవిరి పడితే సరిపోతుంది. ఉబ్బసం దగ్గును నెబ్యులైజేషన్‌తో తగ్గించవచ్చు. ఒక్కో రకం దగ్గుకు ఒక్కో రకం చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మెడికల్ షాపుల్లో దొరికే దగ్గు మందుల్లో కాంబినేషన్ డ్రగ్స్ ఉంటాయి. కొన్నిట్లో అలర్జీ నివారిణులైన యాంటీ హిస్టమిన్లు ఉంటాయి. మరికొన్నిట్టో కోడీన్, హైడ్రాక్సీ కోడీన్ మందులుంటాయి. వీటి వాడకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ బహిష్కరించింది. సిరప్స్‌లో ఎలాంటి డ్రగ్స్ ఉంటాయో అవగాహన లేకుండా, మెడికల్ షాప్‌కి వెళ్లి ఏదో ఒక దగ్గు మందు కొని వాడేస్తూ ఉంటాం. కానీ అలా ఇష్టారాజ్యంగా వాడటం వల్ల పిల్లలకు మందులు పని చేయకుండాపోయే పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి దగ్గును అణచివేసే సిరప్స్ వాడేయకుండా, వైద్యులను సంప్రదించి, దగ్గు కారణాన్ని కనిపెట్టి, తగిన చికిత్స ఇప్పించాలి.
డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల
పిడియాట్రీషియన్ అండ్ నియో నాటాలజిస్ట్,
హైదరాబాద్.
Updated Date - Dec 04 , 2024 | 11:22 PM