గుణాలు తెలిసి తినాలి
ABN, Publish Date - Nov 23 , 2024 | 06:16 AM
ప్రకృతిలో ఉన్న ప్రతీ ఆహార ద్రవ్యానికీ వేటి గుణాలు వాటికున్నాయి. అంతకు మించిన అంశం ఇంకొకటుంది... ఆయుర్వేద శాస్త్రం దాన్ని ‘ప్రభావం’ అన్నది. ద్రవ్యాల ప్రభావం వలన ఆహారానికి ఔషధ ప్రయోజనం కలుగుతోంది! భోజనకుతూహలం గ్రంథంలో
ప్రకృతిలో ఉన్న ప్రతీ ఆహార ద్రవ్యానికీ వేటి గుణాలు వాటికున్నాయి. అంతకు మించిన అంశం ఇంకొకటుంది... ఆయుర్వేద శాస్త్రం దాన్ని ‘ప్రభావం’ అన్నది. ద్రవ్యాల ప్రభావం వలన ఆహారానికి ఔషధ ప్రయోజనం కలుగుతోంది! భోజనకుతూహలం గ్రంథంలో రఘునాథ సూరి అనేక ఆహార పదార్థాల ప్రభావాన్ని వివరిస్తూ, సిద్ధాన్నప్రకరణం అని ఒక అధ్యాయం వ్రాశాడు. ఆహార ప్రయోజనాన్ని ఈ అధ్యాయం వివరిస్తుంది. ఆహారపదార్థాల తయారీకి వాడే ద్రవ్యాలకు ఏ గుణాలుంటాయో వాటితో వండిన పదార్థాలక్కూడా అవే గుణాలుంటాయన్నది ఇందులో మొదటి సూత్రం. ఉదాహరణకు నువ్వులు వాతాన్ని తగ్గిస్తాయి. నువ్వులు కలిపి వండిన ఏ ఆహార పదార్థమైనా వాతాన్ని తగ్గించేదిగానే ఉంటుంది. అయితే ఈ సూత్రం అన్ని సందర్భాల్లోనూ వర్తించదు. ఉదాహరణకు ఆరు నెలల పాటు పాతబడిన బియ్యం తేలికగా అరిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, ఆ బియ్యాన్ని వండిన అన్నం తేలికగా అరుగుతుంది. కడుపు నిండుతుంది. వాతాన్ని, పిత్తాన్ని, కఫాన్ని కూడా అదుపు చేస్తుంది. కానీ, ఈ బియ్యంతోనే చేసిన మరమరాలకు, అటుకులకు అవే గుణాలు ఉండటం లేదు. పాతబియ్యంతో చేసిన మరమరాలు అన్నం కన్నా తేలికగా అరుగుతాయి. కానీ కడుపు నింపవు. అటుకులు కష్టంగా అరుగుతాయి. వాతం చేస్తాయి. కడుపునొప్పి లాంటివి తెస్తాయి. ఇందుకు వాటి ప్రభావం కారణం. ఈ ప్రభావంలో మార్పు తెస్తున్నదేది?
‘‘క్వచిత్సంస్కార భేదేనగుణభేదోభవేదిహఖ సంస్కార భేదం’’ అంటే ఆహార ద్రవ్యాల తయారీ తీరులో మార్పులు చేయటంలో తేడాలవలన వాటి గుణాలలో కూడా తేడా లేర్పడుతున్నాయి. అంటూ రఘునాథపండితుడు భోజన కుతూహలంలో ప్రభావం ఎలా ఏర్పడుతుందో వివరించాడు! అంటే, ఆహార పదార్థాల తయారీ తీరు దాని గుణాలను ప్రభావితం చేస్తుందన్నమాట. ఏం వండారన్నదానికన్నా ఎలా వండారన్నదే ముఖ్యం. ఒక్కోసారి కొన్ని పదార్థాల్ని కలపటం వలన అంతకు మునుపులేని కొత్త గుణాలు ఆ ఆహార పదార్థానికి ఏర్పడతాయి. దీనికి రఘునాథ సూరి కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. అవి..
‘‘కాదలంగురుసర్పిశ్చతద్యుక్తమ్ సుపచేత్ భవేత్‌ఖ’’
కాదలం అంటే కదళీ (అరటి)ఫలం, సర్పి అంటే నెయ్యి. అరటి పండు, నెయ్యి రెండూ ఆలస్యంగా అరిగే స్వభావం కలిగినవే! కానీ అన్నంతో కలిపి వీటిని తిన్నప్పుడు ఒకే విధమైన ఫలితాలు ఉండవు. నెయ్యి వల్ల అన్నం త్వరగా అరుగుతుంది. అరటిపండుతో కలిపి తింటే అన్నం ఆలస్యంగా అరుగుతుంది. ఈ విధంగా ఏవి తింటే శరీరంమీద ఏ గుణాలు కలుగుతాయో ముందుగా మనం తెలుసుకోవాలి. ఆహార పదార్థాలను ఎలా వండుకోవాలో ఆలోచించాలి. ఆహారంలో ఏ ఏ ద్రవ్యాలను కలపవచ్చో, వేటివేటిని కలపకూడదో తెలుసుకోవాలి. అప్పుడే పరిపూర్ణమైన ఆరోగ్యవంతులమవుతాం!
- గంగరాజు అరుణాదేవి
Updated Date - Nov 23 , 2024 | 06:16 AM