రెండు నెలలు సందడే.. సందడి
ABN, Publish Date - Dec 01 , 2024 | 01:16 AM
తెలుగు చిత్ర పరిశ్రమలో రాబోయే రెండు నెలలు సందడి నెలకొననుంది. ‘
తెలుగు చిత్ర పరిశ్రమలో రాబోయే రెండు నెలలు సందడి నెలకొననుంది. ‘పుష్ప-2, డాకు మహారాజ్, కుబేర, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, సారంగపాణి జాతకం’ తదితర సినిమాలు విడుదల కానున్నాయి. వీటితోపాటు మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా సినిమాలు ఉంటే సరి. లేదంటే ప్రేక్షకుల్లో సినిమాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. థియేటర్లకు ప్రత్యామ్నాయంగా వారు ఓటీటీలను ఎంపిక చేసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నూట పాతికకు పైగా చిత్రాలు విడుదల కాగా, వాటిలో కేవలం ఐదు శాతం మాత్రమే బాక్సాఫీసు వద్ద విజయాలను నమోదు చేశాయి.
‘పుష్ప-2’తో మొదలు
ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2 ది రూల్’. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. విదేశాల్లో ఒక రోజు ముందుగా డిసెంబరు 4నే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఓవర్సీ్‌సలో ప్రీసేల్ బుకింగ్‌లో మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. అమెరికన్ బాక్సాఫీసులో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘పుష్ప-2’ నిలిచింది. ఇంత భారీ అంచనాలు, ప్రీ బుకింగ్‌ల మధ్య రిలీజ్ అవుతోంది. ఈ సినిమా విజ యం, దాని తర్వాత విడుదలవుతున్న చిత్రాలను ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రం నచ్చితే దాని ఫీల్‌గుడ్‌తో ప్రేక్షకులు తదుపరి సినిమా చూడటానికి ఇష్టపడతారు. లేదంటే ఓటీటీలో వస్తుంది కదా, అప్పుడు చూడొచ్చులే అనే భావనలోకి వెళతారు.
వీటిపై భారీ అంచనాలు
నాగార్జున, ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రధారులుగా నటించిన ‘కుబేర’ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా గ్లింప్స్‌లో ధనుష్ బిచ్చగాడిలా, నాగార్జున ప్రభుత్వ అధికారిగా కీలక పాత్రల్లో నటించారు. చాలా గ్యాప్ తరవాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
సంక్రాంతి పండగ వచ్చిందంటే నందమూరి అభిమానులు బాలయ్య సినిమా చూడాల్సిందే! వారి అశలకు అనుగుణంగానే ‘డాకు మహారాజ్’ చిత్రం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు ఫైనల్ షూటింగ్, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. అందుకు కారణం.. బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపించబోతున్నారు. జనవరి 12న విడుదలవుతోంది.
‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లే. దాంతో ఆల్ ఇండియా రేంజ్‌లో, ఓవర్సీస్ రేంజ్‌లో ప్రమోషనల్ ఈవెంట్స్‌కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే లక్నోలో జరిగిన మెగా ఈవెంట్‌లో టీజర్‌ని రిలీజ్ చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్ పక్కా అనే కాన్ఫిడెన్స్‌లో ఉంది చిత్ర బృందం. జనవరి 10న విడుదలవుతోంది.
వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంపైనా ప్రేక్షకులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో ట్రయాంగిల్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. జనవరి 14న విడుదలవుతోంది.
అన్ని ఆటంకాలనూ అధిగమించి
స్వీయ దర్శకత్వంలో కంగన రనౌత్ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఎన్నోసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం అన్ని ఆటంకాలను అధిగమించి వచ్చే ఏడాది జనవరి 17న విడుదలకు సిద్ధమవుతోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కంగన ఈ విషయంపై హత్యా బెదిరింపులను కూడా ఎదుర్కొన్నారు. భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఈ చిత్రంలో చూపించారు. ఇందులో కంగన ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. పూర్తిగా రాజకీయ కోణంలో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.
జాతకాల నేపథ్యంలో...
‘జెంటిల్‌మెన్, సమ్మోహనం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. కామెడీ జానర్‌లో రాబోతున్న ఈ సినిమాలో ప్రియదర్శితోపాటు శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, హర్ష కీలకపాత్రల్లో నటించారు. సారంగపాణి జాతకం, జీవితం చుట్టూ తిరిగే ఫన్నీ ఎలిమెంట్స్‌తో చిత్రం తెరకెక్కినట్లు దీని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. హీరో జాతకాలను బాగా నమ్ముతాడు.‘మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది’ అని చెబుతాడు. దాంతో ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. డిసెంబరు 20న ఈ సినిమా విడుదలవుతోంది.
సంక్రాంతి సెంటిమెంట్
టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగ సెంటిమ్‌ంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సినిమా వాళ్లకు సంక్రాంతి కీలకమైన సీజన్. కలెక్షన్లు కూడా అధికంగానే వసూళ్లు అవుతాయి. అందుకే నిర్మాతలందరూ ఈ సీజన్‌పై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ఉంటారు. 2024 సంక్రాంతికి గుంటూరు కారం (మహేష్ బాబు), సైంధవ్ (వెంకటేశ్), నా సామిరంగ (నాగార్జున), హనుమాన్ (తేజ) సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్’ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మిగతా సినిమాలు అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయితే ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి పెద్ద చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటిలో ‘డాకు మహారాజ్’ మినహా మిగిలిన రెండూ దిల్ రాజుకు చెందినవే.
Updated Date - Dec 01 , 2024 | 01:17 AM