Navya : ముక్కుసూటి మందుల కోసం...
ABN, Publish Date - Nov 19 , 2024 | 01:29 AM
ఔషధాలను శరీరం తనకనుగుణంగా మలుచుకునే ప్రక్రియను, జన్యు అమరిక ప్రభావితం చేస్తుంది.
ఏ ఇద్దరి వేలి ముద్రలూ ఒకేలా ఉండవు. అలాగే ఔషధాలకు స్పందించే స్వభావాలు కూడా! ఎవరికి ఏ ఔషధం, ఏ మోతాదులో కచ్చితమైన ఫలితాన్నిస్తుందో కనిపెట్టగలిగితే, చికిత్స సులభమవుతుంది, రోగికి ప్రయోజనం చేకూరుతుంది. అందుకోసం అక్కరకొస్తున్న ఔషధరంగమే ‘ఫార్మకొజీనోమిక్స్’. ఈ రంగంలో భాగంగా, సులువైన జన్యు పరీక్షతో నప్పే ఔషధాలను కనిపెట్టే వీలుంది. ఆ జన్యుపరీక్ష ప్రయోజనాల గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం!
ఔషధాలను శరీరం తనకనుగుణంగా మలుచుకునే ప్రక్రియను, జన్యు అమరిక ప్రభావితం చేస్తుంది. మన శరీరంలోని కొన్ని జన్యువులు ఔషధాలను శరీరం వినియోగించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా రక్తం పలుచబడే మందులు, అధిక రక్తపోటు, మధుమేహం, అసిడిటి, జ్వరం, నొప్పి మొదలైన సాధారణ మందుల వినియోగంలో 26 నుంచి 30 జన్యువుల పాత్ర ముఖ్యమైనది. వీటిలో స్వల్ప తేడాలున్నప్పుడు, తీసుకునే మందుల సక్రమ పనితీరుకు అవసరమైన ఎంజైమ్స్ విడుదలకు ఈ జన్యువులు తోడ్పడకపోవచ్చు. ఫలితంగా ఆ మందుల సామర్థ్యం తగ్గడం, లేదా పూర్తిగా నిర్వీర్యమైపోవడం లేదా అరుదుగా కొన్ని సందర్భాల్లో వికటించడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
ఫార్మకోజీనోమిక్స్ ఎందుకు?
‘నాకీ మందు పడలేదు. నాకు ఫలానా మందు చాలా బాగా పని చేసింది’ అనే మాటలను మనం తరచూ వింటూ ఉంటాం. ఈ పని చేయడం, పడకపోవడం, బాగా పని చేయడం లాంటి వాటన్నిటి వెనకా మన జన్యు అలంకరణ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి జన్యు అమరికనూ పరిశీలించి, ఔషధాలను తయారుచేసే వెసులుబాటు అందుబాటులో లేదు. కాబట్టి ఒకే రకమైన రుగ్మతకు వేర్వేరు మందులు రూపొందుతూ ఉంటాయి. ఒకరికి సమర్థంగా ఫలితాన్నిచ్చే మందు, ఇంకొకరికి ప్రభావం కనబరచకపోవచ్చు. అందువల్లే సాధారణ రుగ్మతలైన అధిక రక్తపోటు, మధుమేహం లాంటి వాటికి వేర్వేరు మందులు మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి కనబరిచే ప్రభావం ఆధారంగా వాటి వాడకంలో వైద్యులు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అయితే ఇలా అన్ని రకాల మందులు వాడుకుని ఫలితాన్నిచ్చే ఔషధమేదో కనిపెట్టే బదులు, మొదటి విడతలోనే కచ్చితమైన ఔషధాన్ని కనిపెట్టగలిగితే, సమయం, డబ్బు, అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యాన్నీ ఆదా చేసుకోవచ్చు. అందుకోసం అందుబాటులోకొచ్చినదే ఫార్మకోజీనోమిక్స్’.
సులువైన రక్త పరీక్షతో...
రక్త నమూనాను సేకరించి, దాన్లోని డిఎన్‌ఎను వేరు చేయడం ద్వారా జన్యువులను సేకరించవచ్చు. ఒకవేళ తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రోగులైతే, వాళ్ల లాలాజలం, కణజాలాన్ని సేకరించి జన్యు పరీక్ష చేపట్టవచ్చు. ఈ పరీక్షను రెండు విధాలుగా చేపట్టవచ్చు. వైద్యులు సూచించే మందుల ఆధారంగా ఆ మందులతో సంబంధమున్న జన్యువును నేరుగా పరీక్షించి, స్పందిస్తున్న స్వభావాన్ని పరీక్షించవచ్చు. జన్యు స్పందన అనుకూలంగా ఉన్నప్పుడు, ఆ మందులను కొనసాగించవచ్చని రోగులకు సూచించవచ్చు. ప్రతికూలంగా ఉన్నప్పుడు, ప్రత్యామ్నాయ ఔషధాన్ని సూచించవచ్చు. రెండో తరహా పరీక్షలో జన్యువులను పరీక్షించి, ఏ ఔషధాలు శరీరానికి సరిపడవో/మెరుగైన ఫలితాన్ని ఇవ్వవో ముందుగానే తెలుసుకోవచ్చు. ఇలా మందుగానే తెలుసుకోగలిగితే, భవిష్యత్తులో ఏ రుగ్మతకైనా వైద్యులను కలిసినప్పుడు, జన్యుపరీక్ష ఫలితం ఆధారంగా తదనుకూల ఔషధాలను సూచించమని వైద్యులకు చెప్పవచ్చు. ఈ పరీక్ష ఫలితానికి రెండు వారాల సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ పరీక్ష రోగులకు అందుబాటులో ఉంది.
ప్రయోజనాలు ఇవే!
జన్యు పరీక్ష ఆధారంగా కచ్చితమైన ఔషధాలను తెలుసుకోవడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. అవేంటంటే...
అనవసరమైన మందుల వాడకం ఉండదు
మందులు వికటించే ప్రమాదం ఉండదు
తగిన మందు, తగిన మోతాదులో తీసుకునే వెసులుబాటు ఉంటుంది
మందుల దుష్ప్రభావాలకు లోనయ్యే ప్రమాదం ఉండదు
పరీక్ష ఎవరికి?
మూర్ఛ వ్యాధితో బాధపడే పిల్లలు
క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయించుకోబోతున్నవాళ్లు
దీర్ఘకాల రుగ్మతలతో బాధపడుతున్న వాళ్లు
కుటుంబ చరిత్రలో తీవ్ర వ్యాధులున్నవాళ్లు
బహుళ రుగ్మతలున్నవాళ్లు
అవయవ మార్పిడి అవసరమైనవాళ్లు
ఇలా జన్యు పరీక్షతో కచ్చితమైన మందులను కనిపెట్టడం వల్ల విలువైన సమయం వృథా అవకుండా ఉండడంతో పాటు, వ్యాధులు అదుపులోకొచ్చి, రోగులు మెరుగైన జీవితం గడపగలుగుతారు.
నప్పే మందులు కనిపెట్టాలి
మార్కెట్లో దొరికే 80 నుంచి 100 శాతం మందులన్నీ కొన్ని ప్రాథమిక దినుసుల ఆధారంగానే తయారవుతూ ఉంటాయి. ఉదాహరణకు అసిడిటీని తీసుకుంటే, రాబిప్రజోల్, పాంటాప్రజోల్ మొదలైన వేర్వేరు ఔషధాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటన్నిట్లో ప్రధానంగా సోడియం ఉంటుంది. అలాగని ఇవన్నీ అందరికీ ఒకే విధమైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అధిక రక్తపోటు కలిగిన వాళ్లకు కూడా ఒకే ఔషధం సమాన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఈ సమస్యకు మార్కెట్లో దాదాపు 20 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వైద్యులను కలిసినప్పుడు, వాళ్లు వాళ్ల అనుభవం ఆధారంగా ఉత్తమమైన ఔషధాన్ని సూచిస్తూ ఉంటారు. అయితే ఆ నిర్దిష్ట ఔషధం సదరు వ్యక్తికి సరైనది కాకపోవచ్చు. అలాంటప్పుడు అదనంగా ఇంకొక ఔషధాన్ని జోడించవలసి వస్తూ ఉంటుంది. లేదా ఔషధాన్ని మార్చవలసివస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎవరికి, ఏది సమర్థమైన ఫలితాన్నిస్తుందో, ఏది శరీరానికి నప్పుతుందో కచ్చితంగా తెలుసుకోవడంలో జన్యు పరీక్ష ఉపయోగపడుతుంది. ఒక ఔషధాన్ని శరీరం సద్వినియోగం చేసుకోవాలంటే, అందుకు తగిన ఎంజైమ్స్ విడుదలయ్యేలా జన్యువులు స్పందించాలి. అలా జరగనప్పుడు, తీసుకున్న ఔషధం ఫలితాన్నివ్వకపోవచ్చు, దాని సామర్థ్యం తగ్గవచ్చు, కొన్ని సందర్భాల్లో, చర్మం మీద దద్దుర్లు, కడుపునొప్పి, విరోచనాలు లాంటి లక్షణాల రూపంలో ప్రతికూల ప్రభావాన్ని (డ్రగ్ రియాక్షన్)కూడా కనబరచవచ్చు.
నా అనుభవం
2008లో అమెరికాలో జరిగిన ఒక ప్రమాదంలో మా అబ్బాయి నోటికి పెద్ద గాయమైంది. పెదవులు చీలిపోయి, దంతాలు ఊడిపోయి, తీవ్ర రక్తస్రావమైంది. ఆ సమయంలో వైద్యులు సర్జరీ చేసి, నొప్పి నివారిణి ‘కోడిన్’ ఔషధాన్ని సూచించారు. అయితే దాంతో మా అబ్బాయి నొప్పి తగ్గకపోగా, చిత్తభ్రమకు లోనవడం మొదలుపెట్టాడు. అలాగే విపరీతమైన కడుపునొప్పి వల్ల ఏమీ తినలేకపోయేవాడు. ఇలా ఎందుకు జరుగుతోందని వైద్యులను ప్రశ్నించినప్పుడు, దెబ్బ తీవ్రత మూలంగా మెదడు కూడా దెబ్బ తిని ఉండొచ్చనీ, ఎమ్మారై పరీక్ష చేయించమనీ చెప్పారు. ‘‘కానీ సర్జరీకి ముందు ఇలాంటి లక్షణాలేవీ కనిపించనప్పుడు, సర్జరీ తర్వాత కొత్తగా చిత్రభ్రమ ఎందుకు కలుగుతోంది? బహుశా అది కోడిన్ ప్రభావమై ఉంటుందా?’’ అని వైద్యులను ప్రశ్నించాను. అందుకు వాళ్లు ‘మేం సురక్షితమైన మందులే సూచించాం’ అన్నారు. కానీ నాకు ఆ ఔషధం మీదే అనుమానం మొదలైంది. ‘అది సురక్షితమైనదే కావచ్చు. కానీ మా అబ్బాయికి సురక్షితమైనది అయి ఉండకపోవచ్చు’ అని చెప్పి, మందు వాడకం మానేసి, బాబుకు జన్యుపరీక్ష చేయించాను. ఆ పరీక్షలో ‘సివైపి2డి6’ అనే జన్యువులో సమస్య ఉన్నట్టు తేలింది. అందువల్లే నొప్పి నివారిణి, మార్ఫిన్‌గా మారి ఆ తరహా ప్రభావాన్ని కనబరచడం మొదలుపెట్టింది. ఈ విషయం గ్రహించిన తర్వాత, ఆ మందుల వాడకం మానేసిన వెంటనే అబ్బాయిలో చిత్తభ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. కోడిన్ మా సరిపడదని ముందే తెలిసి ఉంటే, మా బాబు ఇంత ఇబ్బంది పడి ఉండేవాడు కాదు. ఔషధాల మీద జన్యువుల ప్రభావం ఏ మేరకు ఉంటుందో, జన్యుపరీక్షతో సరిపడే/సరిపడని మందులను ముందుగానే కనిపెట్టడం ఎంత అవసరమో గ్రహించడానికి ఇదొక ఉత్తమమైన ఉదాహరణ.
- డాక్టర్ ఆనీ క్యు హసన్
సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెచ్‌ఒడి,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ మెడిసిన్,
కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్.
Updated Date - Nov 19 , 2024 | 01:29 AM