సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్‌నే అంటారు
ABN, Publish Date - Apr 14 , 2024 | 03:40 AM
‘క్రాక్’ సినిమాతో తాను వైవిధ్యమైన నటినని నిరూపించుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్... ప్రస్తుతం అనేక చిత్రాలలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన ‘శబరి’ విడుదలకు సిద్ధంగా ఉంది...

‘క్రాక్’ సినిమాతో తాను వైవిధ్యమైన నటినని నిరూపించుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్... ప్రస్తుతం అనేక చిత్రాలలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన ‘శబరి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘‘ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు. ‘శబరి’లో పాత్ర మరో ఎత్తు’’ అంటున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో ‘నవ్య’ ఇంటర్వ్యూ.
మీరు సినిమా కుటుంబం నుంచి వచ్చారు? ఒక నటిగా మీ జర్నీ ఎలా సాగుతోంది?
చాలా బాగా ఉంది. అనేక పాత్రలు నాకు వచ్చాయి. ఈమధ్య కాలంలో రైటర్లు నా కోసం పాత్రలు రాస్తున్నారు. దీని వల్ల వైవిధ్యభరితమైన పాత్రలలో నటించగలుగుతున్నా. చెప్పాలంటే ఒక విధంగా చాలా సంతృప్తిగా ఉంది.
మీ విషయంలో రకరకాల పాత్రలు వస్తున్నాయి కదా! మీరు వాటిని ఎలా ఎంచుకొంటారు?
నా ఉద్దేశంలో ఒక సినిమాకు హీరో... స్ర్కిప్ట్. ఈ స్ర్కిప్ట్‌లో నా పాత్ర ఎంత ఉందనే విషయంపైనే నా దృష్టి ఉంటుంది. ఆ క్యారెక్టర్ నేను అంతకు ముందుగా చేశానా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తా. ఒకవేళ నేను అప్పటికే ఆ తరహా పాత్ర చేసి ఉంటే దానిలో ఏదైనా వైవిధ్యం చూపించగలమా... అనే విషయాన్ని ఆలోచిస్తా. అప్పుడు ఆ పాత్రను ఒప్పుకుంటా.
మీరు మెయిన్ రోల్స్‌నే ఎంచుకొంటారా?
లేదండి. ఒక నటిగా నన్ను నేను ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. అందువల్ల ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలను ఎంచుకొంటూ ఉంటాను. ఉదాహరణకు ఇప్పటిదాకా నేను కామెడీ పాత్రలు చేయలేదు. అలాంటి పాత్ర వస్తే చేయాలని ఉంది. అదే విధంగా ఒక పిరియడ్ ఫిల్మ్ చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే... నన్ను నేను నటిగా నిరూపించుకొనే పాత్ర ఇప్పటి దాకా రాలేదు. అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నా.
చేద్దామని మిస్ అయిన పాత్రలు ఏమైనా ఉన్నాయా?
లేవు. నాకు ఈ మధ్యకాలంలో కొన్ని రకాల బోల్డ్ పాత్రలు వస్తున్నాయి. బహుశా ఆ కేటగిరిలో నాలా చేసేవాళ్లు ఎవరు లేరనుకుంటా! నెమ్మదిగా నాకు వైవిధ్యభరితమైన పాత్రలు వస్తున్నాయి.
సాధారణంగా అక్కలు... వదినల పాత్రలు ఎక్కువుంటాయి. మీకు అలాంటి పాత్రలు రాలేదా?
అలాంటి పాత్రలైనా నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ నాకు ఇప్పటి దాకా అలాంటివి ఎక్కువ రాలేదు. అలాంటి పాత్రలు చేయటానికి కూడా నాకు అభ్యంతరం లేదు. నా దృష్టిలో ఏదైనా పనే! అది చిన్నది కావచ్చు.. పెద్దది కావచ్చు.. ఎప్పుడూ నటిగా నా పరిధిని పెంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటా!
మీరు తమిళం నుంచి వచ్చారు. అక్కడ సంస్కృతి.. వేషభాషల ప్రభావం మీపై ఉందా?
అదృష్టవశాత్తు నన్ను ఒక తమిళ నటిగా ఎవరూ గుర్తించలేదు. మొదటి నుంచి నేను అన్ని భాషల్లోనూ యాక్ట్ చేశాను. అన్ని భాషలవారూ నన్ను గుర్తించారు. ఇప్పటికీ చాలా మంది నన్ను తెలుగు అమ్మాయి అనుకుంటారు. కన్నడలో యాక్ట్ చేస్తే... వాళ్లు తమ అమ్మాయి అనుకుంటారు.
చిన్నప్పుడు ఎప్పుడైనా సినిమాల్లోకి రావాలనుకున్నారా?
చిన్నప్పటి నుంచి నేను థియేటర్‌లో యాక్టివ్‌గా ఉండేదాన్ని. అనేక నాటకాలు కూడా వేశాను. కానీ ఎప్పుడూ సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. నా దృష్టిలో నటనకు సినిమాలు ఒక్కటే వేదిక కాదు. నేను యాక్టింగ్ స్కూలుకు వెళ్లినప్పుడు నాలో ఈ సినిమాల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉందనే విషయం అర్థమయింది. చిన్నప్పుడు నాకు డాక్టర్ కావాలని ఉండేది. కానీ చివరకు యాక్టర్ అయ్యాను.
మీరు ఒక స్టార్ కిడ్ కదా. మీకు సినిమా రంగంలో ప్రవేశం సులభమయిందా?
ఈ ప్రశ్న నన్ను చాలా కాలంగా వెంటాడుతోంది. స్టార్‌కిడ్‌లకు ప్రవేశం సులభం అవుతుంది అంతే! మిగిలిన కష్టాలన్నీ వాళ్లు కూడా పడాలి. చాలా మంది స్టార్‌కిడ్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంటుందనుకుంటారు. కానీ అలా ఉండదు. ప్రేక్షకులకు నచ్చకపోతే కెరీర్ పోతుంది. సినిమాలో నటించేవారు... స్టార్ కిడ్సా లేదా సాధారణ నేపథ్యం నుంచి వచ్చినవారా అనే విషయాన్ని ప్రేక్షకులు చూడరు. వారికి సినిమా బావుండాలంతే! నా ఉద్దేశంలో టాలెంట్, అదృష్టం ఉండాలి. కొన్నిసార్లు ఎంత కష్టపడినా విజయం రాదు. నన్నే తీసుకోండి... నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమయింది. కానీ ‘క్రాక్’ సినిమా తర్వాతే నాకు సక్సెస్ వచ్చింది. అంత కాలం నేను సరైన పాత్ర కోసం వేచి చూశానంతే! కష్టపడి పనిచేయాలి. మంచి ఫలితం కోసం వేచి చూడాలి. అంతకన్నా వేరే మార్గం లేదు.
కానీ అలా వేచి చూడటం వెనక చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది కదా..!
ఉంటుంది. యాక్టర్స్‌కు చాలా ఒత్తిడి ఉంటుంది. దానిని బయటకు చెప్పలేం. ఎవరైనా నా దగ్గరకు వచ్చి సినిమాల్లోకి వస్తానంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొమ్మని చెబుతా! ఎందుకంటే ఇండస్ట్రీలో మనుగడ సాగించటం అంత సులభం కాదు. మనపై ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూ ఉంటారు. పాత్రల కోసం వేచి చూస్తూ ఉండాలి. సినిమాల పట్ల అమితమైన ప్రేమ, ఆత్మనిబ్బరం ఎక్కువగా ఉన్న వ్యక్తులు మాత్రమే సినిమా రంగానికి రావాలి. ఒక్క ఛాన్స్ దొరకాలి. సినిమా విడుదల కావాలి. అది హిట్ కావాలి. హీరోయిన్లకు ఇంకా కష్టం. సినిమా హిట్ కాకపోతే... హీరోయిన్‌ది ఐరెన్ లెగ్ అంటారు. ఛాన్స్ ఇవ్వద్దంటారు. కథ బావుండక సినిమా ఫ్లాప్ అయితే.. దానికి హీరోయిన్‌కు సంబంధమేమిటి?
మీరు ఎమోషనల్‌గా ఉంటారా?
లేదు. నేను వీలైనంత బ్యాలెన్స్డ్‌గా ఉంటా! ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తా. అనవసరపు విషయాలను ఎక్కువగా పట్టించుకోను. చిన్నప్పటి నుంచి నేను ఇంతే! నాకు జీవితంలో అనేక కష్టనష్టాలొచ్చాయి. నాకు ఎన్ని కష్టనష్టాలొచ్చినా పాజిటివ్‌గానే ఉండేదాన్ని.
ఈ తరం వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?
లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. అనేక అడ్డంకులు ఎదురవుతాయి. కొత్త కొత్త సవాళ్లు వస్తాయి. వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్లాలి. నన్నే ఒక ఉదాహరణగా తీసుకోండి... నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు గొప్ప పాత్రలు రాలేదు. ఆ సమయంలో నిరాశ పడివుంటే నేను ఈ రోజు ఇలా ఉండేదాన్ని కాదు. నేను ఈ రంగంలోనే ఉండాలనుకున్నా.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
‘పీఎస్’లో ఉంటాననుకున్నారు
‘పీఎస్’ చిత్రంలో నేను ఉంటానని అందరూ అనుకున్నారు. చాలా మంది చెప్పారు కూడా. నా చేతిలోకి పాత్ర వచ్చి.. ఆ తర్వాత నన్ను వద్దనుకుంటే ఫీలవ్వాలి. కానీ అసలు సినిమాలో పాత్రకే నన్ను ఎంపిక చేయనప్పుడు నేను ఫీలవ్వాల్సిన అవసరం ఏముంది? డైరక్టర్‌కు ఒక విజన్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా పాత్రలను ఎంపిక చేస్తారు.
బెస్ట్ కాంప్లిమెంట్
ఒకప్పుడు నా వాయిస్ బావుండదనేవారు. డబ్బింగ్ పెట్టుకుంటే మంచిదనేవారు. ఇప్పుడు వాళ్లే నా వాయిస్ చాలా బావుందంటున్నారు. నేనే డబ్బింగ్ చెప్పాలను కుంటున్నారు. అదే నాకు వారు ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్.
డైరక్షన్ చేస్తా
ఏదో ఒక రోజు నేను డైరక్షన్ చేస్తా. అది కూడా నా జర్నీలో ఒక భాగమే!
Updated Date - Apr 14 , 2024 | 08:30 AM