శివుడు ప్రసన్నం కావాలంటే..
ABN, Publish Date - Nov 08 , 2024 | 06:25 AM
ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న మాసం కార్తికం. భక్తులందరూ శివాలయాల దర్శనం, అభిషేకాలు, పూజలు, ఉపవాసాలతో ఈ మాసమంతా గడుపుతారు.
ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న మాసం కార్తికం. భక్తులందరూ శివాలయాల దర్శనం, అభిషేకాలు, పూజలు, ఉపవాసాలతో ఈ మాసమంతా గడుపుతారు. శివారాధనలో లీనమవుతారు. కానీ ఈ పూజలన్నీ శివుడికి ఆనందాన్ని ఇస్తున్నాయా? ఆ శంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే... నిత్య జీవితంలో మనం ఎలా ఉండాలి? ఈ అంశాలను సహజయోగప్రదాయిని శ్రీ మాతాజీ నిర్మలాదేవి తన ప్రవచనాలలో వివరించారు.
మన సూక్ష్మ శరీరంలో శివుని స్థానం... మన హృదయం. అక్కడ ఆత్మ రూపంలో శివుడు నివసిస్తాడు. సచ్చిదానంద స్వరూపమైన శివతత్త్వాన్ని, అంటే ఆయన సాన్నిధ్యాన్ని పొందడం సమస్త మానవాళి ఆధ్యాత్మిక ఉత్థానంలో పరమ గమ్యం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఋషులు, మునులు ఆ గమ్యాన్ని చేరడానికే కఠోరమైన తపస్సులు ఆచరించారు. ఇంతకీ శివతత్త్వం అంటే ఏమిటి? శివుని గుణగణాలు, స్వరూప స్వభావాలు ఏమిటి? వాటిని మనం ఎలా ఆకళింపు చేసుకోగలం? ఎలా ఆచరించుకోగలం? అనేవి ముందుగా తెలుసుకోవాలి.
అడిగినవన్నీ ఇచ్చే అమాయకత్వం, తనకోసం ఏమీ దాచుకోని త్యాగశీలత... ఇవి ప్రేమకు ప్రతిరూపమైన శివుడి ప్రత్యేక గుణాలు. ఆయనది అపరిమితమైన దయాగుణం. అందుకే రాక్షసులకైనా వారు కోరుకున్న వరాలు ఇచ్చేవాడు. శివుని అనుగ్రహంతో వరాలను పొంది, ఆ తరువాత లోకాన్నే కాదు, ఆయననూ ఇబ్బంది పెట్టిన రాక్షసుల కథలు కోకొల్లలు. భస్మాసురుడి కథ దీనికి ఒక ఉదాహరణ. అయినా ఆయన అడిగినవి కాదనకుండా ఇస్తూనే ఉంటాడు. అందుకే శివుణ్ణి భోళా శంకరుడు అంటారు. కానీ దుష్టులు, దుర్మార్గులు ఎప్పుడూ భౌతికమైన భోగ భాగ్యాలను, అధికారాన్ని, అపారమైన శక్తులను కోరుకుంటారు. వాటి కారణంగా అహంకారం పెంచుకుంటారు. తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు. సజ్జనులు ఆధ్యాత్మికమైన సుగుణాలను, భగవంతుడి సేవా భాగ్యాన్ని కోరుకుంటారు. వాటి ద్వారా మోక్షాన్ని పొందుతారు. ఆ భగవంతుడికి చేరువవుతారు. సర్వాంతర్యామి అయిన శివుడికి ఇది తెలుసు.
విలువనిచ్చేది భక్తిప్రపత్తులకే...
విశ్వానికి అధినాథుడైన, లోకాలను ఏలే రాజైన శివుడికి తలమీద కిరీటమైనా ఉండదు. దేవతలందరూ కిరీటాలను, ఆడంబరమైన ఆభరణాలను ధరించినా... ఆ మహాదేవుడు మాత్రం జటాజూటంతోనే ఉంటాడు. ఆయన విలువనిచ్చేది భౌతికమైన వస్తువులకు, ఆభరణాలకు కాదు... ఆధ్యాత్మికతతో నిండిన వైఖరికి, భక్తిప్రపత్తులకు మాత్రమే. శంకరుడి నిరాడంబరత గురించి శ్రీ మాతాజీ ఒక సందర్భంలో ప్రస్తావిస్తూ.... శివపార్వతుల వివాహ ఘట్టాన్ని వివరించారు. తన వాహనమైన ఎద్దును ఎక్కి, ఎలాంటి ఆభరణాలు లేకుండా, కేవలం వ్యాఘ్ర చర్మాన్ని ధరించి, విభూతిని, చందనాన్ని పులుముకొని... ఒక సన్యాసిలా శివుడు తన పెళ్ళికి తరలివచ్చాడు. పర్వతరాజ కుమార్తె అయిన పార్వతి. ఆమె సోదరుడైన విష్ణువు రాజులా సకల సిరిసంపదలతో, సమస్త అలంకారాలతో తులతూగుతూ ఉంటాడు. శివుణ్ణి, అతని పరివారాన్ని చూసిన పార్వతీదేవి సిగ్గుపడింది. ‘ఏమిటీయన? వివాహానికి ఇలా వచ్చారు? ఆయన పరివారం కూడా అలాగే ఉన్నారు. ఒకరికి ఒకే కన్ను ఉంటే, మరొకరికి ఒక కొమ్ము ఉంది. ఇలా వస్తే మా బంధువులందరూ ఏమనుకుంటారు?’ అనుకుంది. కళ్ళు మూసుకొని, విష్ణువును తలచుకుంటూ ‘మన స్థాయి ఏమిటో అందరికీ అర్థమయ్యేలా చెయ్యి’ అని ప్రార్థించింది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి... శివుడి పాదాలను విష్ణువు కడుగుతూ కనిపించాడట. ‘‘నా దగ్గర ఉన్న సంపదలన్నీ నా సోదరికి కట్నంగా ఇచ్చినా... ఈయన పాదధూళికి సరితూగవు’’ అన్నాడట. శివుని నిరాడంబరతను, ఆయన గొప్పతనాన్ని ఈ కథ వెల్లడిస్తుందని శ్రీమాతాజీ పేర్కొన్నారు. సకల చరాచర సృష్టికర్త అయిన శివుడికి తన సృష్టి పట్ల ఉన్న ప్రేమను తెలియజేసే అద్భుతమైన ఘట్టం క్షీరసాగర మథనం. దేవతలు, రాక్షసులు, అమృతం కోసం అర్రులు చాస్తే... శివుడు మాత్రమే హాలాహలాన్ని స్వీకరించి... సమస్త విశ్వాన్నీ రక్షించాడు.
ఆత్మావలోకనం చేసుకోవాలి...
శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే... మనలో ఆయన నివసించే చోటైన మన హృదయం స్వచ్ఛంగా ఉండాలి. దానిలో సాటి మానవుల పట్ల ప్రేమ ఉండాలి. కామం, లోభం, ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. మన హృదయంలో ఆ మహాదేవుడి ప్రతిబింబం కొలువై ఉన్నదనీ, అది అన్నిటికీ మించినదనీ, మన మనస్సుకు, ఆలోచనలకు అతీతమైనదనీ గ్రహించాలి. శివతత్త్వాన్ని గ్రహించాలంటే ఆత్మావలోకనం చేసుకోవాలి. మన హృదయంలోని మురికిని తొలగించుకోవాలి. మనకు అసూయ ఉంటే హృదయం అనే అద్దం శుభ్రంగా ఉండదు. దానిలో భగవంతుడి ప్రతిబింబం కూడా పరిపూర్ణంగా ఉండదు. రోజూ శివుణ్ణి పూజిస్తున్నా, అభిషేకాలు చేస్తున్నా... మనలోని అరిషడ్వర్గాలను వదిలిపెట్టకపోతే శివతత్త్వాన్ని అందుకోలేం. దాన్ని పొందాలంటే హృదయం నిర్మలంగా ఉండాలి. ఎలాంటి అలజడులు లేకుండా, స్వచ్ఛమైన నీరు ఉన్న సరస్సు మాత్రమే ఆకాశంలోని సూర్యుణ్ణి చక్కగా ప్రతిబింబిస్తుంది. అదే విధంగా మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు లేకుండా, నిర్విచారంగా, ఎవరిపట్లా ఏ విధమైన ద్వేషం, కోపం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే.... భగవంతుడి నిజమైన స్వరూపాన్ని ప్రతిబింబించగలుగుతాం.
శివకేశవుల మధ్య భేదాన్ని చూడకూడదని కూడా శ్రీమాతాజీ ఉపదేశించారు. శివకేశవులు ఇద్దరూ ఒక్కటే. మార్గం విష్ణువు అయితే గమ్యం శివుడు. విష్ణువును పూజించనిదే శివుణ్ణి చేరుకోలేం. శివుణ్ణి పూజించకపోతే విష్ణువు మార్గంలో ఉండలేం. మన సూక్ష్మ శరీరంలోని కుండలినీ శక్తి జాగృతి చెందిన తరువాత... విష్ణువు అధిష్ఠానదేవతగా ఉండే సుషమ్నా మార్గం ద్వారా... ఊర్థ్వ ముఖంగా ప్రయాణించి, బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి, సహస్రారంలో ఉండే శివుణ్ణి చేరుకుంటుంది. మన సూక్ష్మ శరీరంలో ఎడమవైపున... శివుడి స్థానమైన హృదయ చక్రం... మన తల్లితో మనకు ఉన్న అనుబంధాన్ని సూచిస్తుంది. ఎవరైతే తల్లిని దైవ సమానంగా భావిస్తారో... వారిపట్ల శంకరుడు అత్యంత ప్రసన్నుడై ఉంటాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లితండ్రుల సంరక్షణను, బాగోగులను పట్టించుకోనివాళ్ళు కాశీకి వెళ్లి గంగానదిలో ఎన్నిసార్లు మునిగినా శివుడి అనుగ్రహం పొందడం కష్టం.
సత్యం తెలిసేది అక్కడే...
ఇక... ఆదిదంపతులైన శివపార్వతులు... భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమానుబంధానికి ప్రతీకలు. ఏ ఇంట్లో భార్యాభర్తలు అటువంటి ప్రేమానుబంధాన్ని కలిగి ఉంటారో... వారి ఇంట్లో ఆ ఆది దంపతులు కొలువై ఉంటారు.
శివుణ్ణి సచ్చిదానంద స్వరూపునిగా వర్ణించారు పూర్వులు. అంటే సత్యాన్ని, చిత్తాన్ని, ఆనందాన్ని స్వరూపంగా కలిగినవాడు. ఏ విషయంలోనై సత్యం అనేది సహస్రారంలో ఉండే ఆ సదాశివుడి పాదాల చెంతనే మనకు తెలుస్తుంది. మన చిత్తం ప్రకాశవంతమైనప్పుడే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. నిర్మలమైన ఆనందంతో ఉండే వ్యక్తి భగవంతుణ్ణి సంపూర్ణంగా ప్రతిబింబించగలుగుతాడు. సచ్చిదానంద స్వరూపమైన శివతత్త్వాన్ని పొందగలిగినవారి జన్మ ధన్యం. కానీ మన లోపల ఉండే అరిషడ్వర్గాలు దానికి అడ్డుపడతాయి. సహజయోగంలో కుండలినీ జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు... మనలోని ఆత్మ ఉనికిని అనుభూతి చెందడం ప్రారంభిస్తాం. ఆత్మ పరిశీలనద్వారా అరిషడ్వర్గాలను క్రమంగా తొలగించుకున్నప్పుడు పరిపూర్ణమైన ఆత్మస్వరూపులం అవుతాం. అప్పుడు భగవంతుడి ప్రతిబింబాన్ని మన హృదయంలో స్పష్టంగా ప్రతిబింబించగలుగుతాం. అలాంటి వ్యక్తులలో దైవిక గుణాలన్నీ ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి. వారు నిత్యమైన, నిరామయమైన సదాశివుడి సాన్నిఽధ్యాన్ని పొందుతారు.
శివకేశవులు ఇద్దరూ ఒక్కటే. మార్గం విష్ణువు అయితే గమ్యం శివుడు. మన సూక్ష్మ శరీరంలోని కుండలినీ శక్తి జాగృతి చెందిన
తరువాత... విష్ణువు అధిష్ఠానదేవతగా ఉండే సుషమ్నా మార్గం ద్వారా... ఊర్థ్వ ముఖంగా ప్రయాణించి, బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి, సహస్రారంలో ఉండే శివుణ్ణి చేరుకుంటుంది.
శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే మనలో ఆయన నివసించే చోటైన మన హృదయం స్వచ్ఛంగా ఉండాలి. దానిలో సాటి మానవుల పట్ల ప్రేమ ఉండాలి. కామం, లోభం, ప్రతిఫలాపేక్ష ఉండకూడదు.
Updated Date - Nov 08 , 2024 | 06:25 AM