Vantillu : చపాతీలతో తింటే భలే రుచి
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:22 AM
శీతాకాలంలో వేడి వేడి చపాతీలతో రుచికరమైన కూరలు తింటుంటే ఆ తృప్తే వేరు. అందుకే ఈ సారి కొన్ని కూరలు మీకోసం అందిస్తున్నాం..
శీతాకాలంలో వేడి వేడి చపాతీలతో రుచికరమైన కూరలు తింటుంటే ఆ తృప్తే వేరు. అందుకే ఈ సారి కొన్ని కూరలు మీకోసం అందిస్తున్నాం..
పనీర్ మిరియాల కూర
కావాల్సిన పదార్థాలు:
పనీర్- అరకిలో, మిరియాలు- నాలుగు స్పూనులు, తరిగిన ఉల్లిపాయలు- ఒక కప్పు, జీడిపప్పు- అరకప్పు, నూనె- అరకప్పు, నెయ్యి- నాలుగు స్పూనులు, పెరుగు- ఒక కప్పు, జీలకర్ర- ఒక చెంచా, లవంగాలు- నాలుగు, పచ్చి మిర్చి- ఒకటి, ఏలకులు- నాలుగు, పసుపు- ఒక స్పూను, కారం-ఒక స్పూను, తరిగిన కొత్తిమీర- నాలుగు స్పూనులు, అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక స్పూను, క్రీమ్- నాలుగు స్పూనులు, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని
తయారీ విధానం
పనీర్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. మిరియాలను పొడి చేయాలి. ఈ రెండింటిని కలపాలి.
ఒక గిన్నెలో పెరుగు, కారం, పసుపు, ఉప్పు వేసి ఎక్కడ ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమంలో పనీర్ ముక్కలను వేసి 15 నిమిషాలు వదిలేయాలి.
ఒక మూకుడులో పావు కప్పు నూనె వేసి పనీర్ ముక్కలను వేయించాలి. వాటిని కిందకు దించి చల్లార్చాలి.
ఈ మూకుడులోనే మిగిలిన పావు కప్పు నూనెను వేడిచేసి- ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, కారం, జీడిపప్పు వేసి వేయించాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సిలో వేసి ముద్దగా చేయాలి.
మూకుడులో నెయ్యిని వేసి వేడి చేయాలి. దీనిలో ఈ ముద్దను వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడకబెట్టాలి. ఉప్పు వేయాలి. దానిలో వేయించిన పనీర్ ముక్కలను వేయాలి. పైన తరిగిన కొత్తిమీర చల్లాలి. క్రీమ్‌ను కలపాలి.
జాగ్రత్తలు
పనీర్ ముక్కలను ఎక్కువ సేపు వేయించకూడదు. దోరగా వేగిన వెంటనే తీసేయాలి.
తాజా క్రీమ్ దొరకకపోతే వెన్న కూడా వేసుకోవచ్చు.
చికెన్ జల్‌ఫ్రిజి
కావాల్సిన పదార్థాలు:
చికెన్- పావుకిలో, తరిగిన ఉల్లిపాయముక్కలు- ఒక కప్పు, తరిగిన టమాటాలు- ఒక కప్పు, ధనియాలు- ఒక చెంచా, జీలకర్ర- ఒక చెంచా, మిరియాలు- ఒక చెంచా, పసుపు- ఒక చెంచా, ఎండు మిర్చి- నాలుగు, వెల్లుల్లి- నాలుగు రెబ్బలు, నూనె- కప్పు, గరం మసాలా- రెండు చెంచాలు, నిమ్మరసం- ఒక స్పూను, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని
తయారీ విధానం
ఒక మూకుడులో అరకప్పు నూనె వేసి ఉల్లిపాయముక్కలు, టమోటా ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, వేసి వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సిలో వేసి ముద్దగా చేయాలి.
మిక్సిలో ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, మిరియాలు వేసి పొడి చేయాలి.
చికెన్ ముక్కలను తీసుకొని- వాటిలో అరకప్పు నూనె, ఽమిక్సిలో ఆడిన పొడిని వేసి బాగా కలపాలి. ఈ ముక్కలు ఒక గిన్నెలో లేదా ప్లాస్టిక్ బౌల్‌లో వేసి మూత బెట్టి ఒక గంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి.
మూకుడులో మిగిలిన నూనె వేసి చికెన్ ముక్కలను వేయించాలి. దానిలో ముందుగా మిక్సి చేసుకున్న ముద్దను కలపాలి. కొద్దిగా నీళ్లు, ఉప్పు కలిపి ఒక పదినిమిషాల పాటు ఉడకనివ్వాలి.
జాగ్రత్తలు
చికెన్ ముక్కలను ఎంతసేపు ఫ్రిజ్‌లో ఉంచితే కూరకు అంత రుచి వస్తుంది. చికెన్ ముక్కలను ఎక్కువ వేయించకూడదు.
దమ్ ఆలూ
కావాల్సిన పదార్థాలు
చిన్న బంగాళదుంపలు- 250 గ్రాములు, నూనె- అర కప్పు, తరిగిన ఉల్లిపాయలు- ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 చెంచాలు, జీలకర్ర- రెండు చెంచాలు, నల్ల మిరియాలు- ఒక చెంచా, కారం- రెండు చెంచాలు, పసుపు- ఒక చెంచా, ధనియాల పొడి- ఒక చెంచా, ఎలకులు- నాలుగు, లవంగాలు- నాలుగు దాల్చిన చెక్క- రుచికి తగినంత, జీడిపప్పు- నాలుగు స్పూన్లు, పెరుగు- ఒక కప్పు, తరిగిన కొత్తిమీర- రెండు చెంచాలు, నీళ్లు- తగినన్ని, ఉప్పు- తగినంత
తయారీ విధానం
ఒక మూకుడులో ఒక అరకప్పు నూనె వేసి వేడి చేయాలి. చిన్న బంగాళ దుంపల తొక్క తీసి వాటిని వేయించాలి. వాటిని చల్లార్చటానికి ఒక ప్లేటులో పెట్టుకోవాలి.
మిగిలిన నూనెలో ఏలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సిలో ముద్దగా చేయాలి.
ఆ ముద్దను మిక్సిలో వేసి తగినన్ని నీళ్లు కలపాలి. దానిలో పసుపు, కారం, ధనియాల పొడి, పెరుగు వేసి మరింత సేపు ఉడికించాలి.
ఈ మిశ్రమంలో వేయించి పెట్టుకున్న బంగాళ దుంపలను వేసి ఉడికించాలి. ముక్కలు మగ్గిన తర్వాత పైన కొత్తిమీర చల్లాలి.
జాగ్రత్తలు
చిన్న బంగాళదుంపలు దొరకకపోతే మామూలు బంగాళదుంపలతో ఈ కూర చేసుకోవచ్చు. కానీ పెద్ద బంగాళ దుంపలను ముక్కలుగా చేసిన తర్వాతే నూనెలో వేయించాలి.
పెరుగు వేసిన తర్వాత కూరను తిప్పుతూ ఉండాలి. దీనివల్ల పెరుగు విరిగిపోదు.
Updated Date - Nov 30 , 2024 | 12:22 AM