ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jyothsna Akhtar: మార్పునకు నాందిగా... బాలికలకు అండగా

ABN, Publish Date - Dec 16 , 2024 | 03:38 AM

కుటుంబ సభ్యుల బెదిరింపులు, ఊళ్లోవారి ఈసడింపులు... వేటికీ భయపడలేదు. బాగా చదువుకోవాలన్న తన కల...

కుటుంబ సభ్యుల బెదిరింపులు, ఊళ్లోవారి ఈసడింపులు... వేటికీ భయపడలేదు. బాగా చదువుకోవాలన్న తన కల... బాల్య వివాహం వల్ల నాశనమైపోతూ ఉంటే తలవంచుకొని కూర్చోలేదు.పరిస్థితుల మీద తిరగబడింది. తన ఆశయాన్ని నెరవేర్చుకోవడమే కాదు, ఎందరికో మార్గదర్శిగా నిలుస్తోంది.‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌’ అందుకున్న పదిహేడేళ్ల జ్యోత్స్నా అఖ్తర్‌ స్ఫూర్తిదాయకమైన కథ ఇది...

‘‘కిందటి ఏడాది మే నెల. ఆ రోజు నేను బడి నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఇల్లంతా సందడిగా ఉంది. ఎవరో కొత్త మనుషులు మా ఇంట్లో ఉన్నారు. నన్ను పెళ్ళి చూపులు చూడడానికి వాళ్ళు వచ్చారని అర్థమయింది. నన్ను అలంకరించడానికి మా అమ్మ, బంధువులు గదిలోకి తీసుకువెళ్ళినప్పుడు నేను అభ్యంతరం చెప్పాను. కానీ ఎవరూ వినిపించుకోలేదు. పెళ్ళి సంబంధం కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత... ఏడ్చాను, మొత్తుకున్నాను. నాకు బాగా చదువుకోవాలని ఉందనీ, పదహారేళ్ళ వయసుకే పెళ్ళి చేసుకోలేననీ చెప్పాను. మా కుటుంబ సభ్యులు నన్ను బెదిరించారు. ఇంట్లోంచీ గెంటేస్తామన్నారు. ఈ సంగతి తెలిసిన ఇరుగుపొరుగువారు కూడా నన్ను సూటిపోటి మాటలన్నారు. సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే నాశనమైపోతావని శాపనార్ధాలు పెట్టారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుడే పెళ్ళి చేసుకోకూడదని నేను గట్టిగా నిశ్చయించుకున్నాను.

మేజిస్ట్రేట్‌ జోక్యంతో...

మాది దక్షిణ త్రిపురలోని బెలోనియా గ్రామం. మైనారిటీ జనాభా ఎక్కువ. పాత సంప్రదాయాలను పాటించడం, కట్టుబాట్లను కఠినంగా అమలు చేయడం కూడా ఎక్కువే. హైస్కూలు చదువు పూర్తవకుండానే ఆడపిల్లలకు పెళ్ళి చేయడం సర్వసాధారణం. ఇరవయ్యేళ్ళకే ముగ్గురు నలుగురు పిల్లలతో... వారి జీవితం ఇంటి పనులకే పరిమితమైపోతుంది. వారు పడుతున్న ఇబ్బందులు కళ్ళారా చూశాను. నేను కూడా అలా కాకుండా ఉండాలంటే బాగా చదువుకోవాలి. నా కాళ్ళమీద నేను నిలబడి స్వతంత్రంగా బతకాలి అనేది నా కల. కానీ సామాజికమైన ఒత్తిడికి లొంగిపోయి... నాకు పెళ్ళి చెయ్యడానికి మావాళ్ళు నిర్ణయించడంతో... నా కలలన్నీ కూలిపోతున్నాయనిపించింది. బాల్య వివాహం అంటే... జీవితం అక్కడితో ముగిసిపోతుంది. నా విషయంలో అలా జరగకూడదనుకున్నాను. నేను ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళు వినకపోవడంతో... ‘బాలికా మంచ్‌’ను ఆశ్రయించాను. పాఠశాలల్లో బాలికలకు సురక్షితమైన పరిస్థితులను ఏర్పాటు చేయడం కోసం, బాల్య వివాహాల నుంచి వారిని రక్షించుకోవడం కోసం ఏర్పాటైన విభాగం అది. దానిలో నాస్నేహితులు కొందరు సభ్యులుగా ఉన్నారు. నా సమస్యను విభాగం ఇన్‌ఛార్జిగా ఉన్న టీచర్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ సంగతి తెలిసిన నా తల్లితండ్రులు రెండు రోజుల్లో నా పెళ్ళి జరపడానికి ఏర్పాట్లు చేశారు. పరిస్థితి తీవ్రతని గుర్తించిన మా టీచర్‌ నేరుగా జిల్లా మేజిస్ట్రేట్‌ను కలిసి విషయం చెప్పారు. మేజిస్ట్రేట్‌ జోక్యంతో అధికారులు రంగంలోకి దిగారు. నా పెళ్ళి ఆగిపోయింది. బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం కాబట్టి మళ్ళీ అలాంటి ప్రయత్నం చేస్తే అరెస్ట్‌ చెయ్యాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించడంతో... మా వాళ్ళు మళ్ళీ ఆ ప్రస్తావన తేలేదు.


ఎన్నడూ అనుకోలేదు...

ఈ సంఘటనతో నా పేరు మా ప్రాంతమంతా మారుమోగిపోయింది. అప్పటివరకూ తమకు ఇష్టం లేకపోయినా... బాల్య వివాహాలకు అమ్మాయిలు తలవంచేవారు. మొదటిసారి ఎదిరించింది నేనే కావడంతో... నా తోటి బాలికల్లో నేను ప్రేరణ కలిగించగలనని అనిపించింది. మా పాఠశాల యాజమాన్యం, అధికారులు కూడా ఇదే ఆలోచనతో ‘బాలికా మంచ్‌’కు కన్వీనర్‌గా నన్ను నియమించారు. అప్పటి నుంచి తరగతుల్లో, ఇతర వేదికల మీద బాలికల హక్కుల గురించి మాట్లాడడం ప్రారంభించాను. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే బాగా చదువుకోవాలనీ, సాధికారత సాధించాలనీ, తమ ఆకాంక్షలకు ముప్పుగా నిలిచే ఒత్తిడులను ప్రతిఘటించాలని ప్రధానంగా చెబుతూ వచ్చాను. ఒక రోజు నాకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని హెడ్మాస్టర్‌ నుంచి కబురు వచ్చింది. ‘నాకోసం ఎవరు చేస్తారు?’ అనుకుంటూ వెళ్ళాను. ‘‘హలో!’ అనగానే నాతో మాట్లాడినాయన నా వివరాలు కనుక్కొని... వేరొకరికి ఫోన్‌ అందించారు. ‘‘నేను మాణిక్‌ సహాను మాట్లాడుతున్నాను’’ అంటూ అవతలి వ్యక్తి అనగానే... నాకు ఒక్క క్షణం ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సాక్షాత్తూ త్రిపుర ముఖ్యమంత్రి నాతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడతారని ఎన్నడూ అనుకోలేదు. ఆయన నా ధైర్యాన్ని అభినందించారు.

అనంతరం ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి సత్కరించారు. అలాగే ఈ ఏడాది ‘ప్రధానమంత్రి బాల పురస్కార్‌’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాను. నాయకత్వ లక్షణాలున్న బాలలకు మన దేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అది. నాలాంటి ఒక సామాన్యమైన అమ్మాయికి ఇంతటి గౌరవం దక్కుతుందని నేను ఊహించలేదు. ఇది నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి మా ప్రాంతంలో ‘బాలికా మంచ్‌’ ద్వారా నా వంతు కృషి చేస్తున్నాను. బాల్య వివాహాలు బాలికలను శారీరకంగా, మానసికంగా కుంగదీస్తాయి. వారి ఎదుగుదలకు అవరోధంగా మారుతాయి. వారికి భవిష్యత్తు లేకుండా చేస్తాయి. వాటి నివారణకు ప్రభుత్వం తీసుకొనే చర్యలు కీలకం అయినప్పటికీ, ఈ దురాచారాన్ని రూపుమాపాలంటే సమాజంలో మార్పు కూడా ఎంతో ముఖ్యం. స్వయంగా ఈ సమస్యను ఎదుర్కొన్న వ్యక్తిగా... అలాంటి మార్పునకు దోహదం చెయ్యాలనేదే నా ఆశయం.’’ బాల్య వివాహం అంటే... జీవితం అక్కడితో ముగిసిపోతుంది. నా విషయంలో అలా జరగకూడదనుకున్నాను. నేను ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళు వినకపోవడంతో... ‘బాలికా మంచ్‌’ను ఆశ్రయించాను.

Updated Date - Dec 16 , 2024 | 03:38 AM