ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lavina Jain: క్యాన్సర్‌ను జయించి... వ్యాపారంలో రాణించి

ABN, Publish Date - Dec 14 , 2024 | 03:30 AM

ఆమె ప్రాణాంతకమైన క్యాన్సర్‌ బారిన పడింది. అంతలోనే భర్తకూ అదే వ్యాధని తెలిసింది.

ఆమె ప్రాణాంతకమైన క్యాన్సర్‌ బారిన పడింది. అంతలోనే భర్తకూ అదే వ్యాధని తెలిసింది. అయినా కుంగిపోలేదు. వ్యాపకంగా ఉన్న పచ్చళ్ల తయారీని విస్తరించింది. పిల్లల భవిష్యత్తు కోసం మనోధైర్యంతో ముందుకు సాగుతూ ఒక సంస్థను నెలకొల్పింది. తద్వారా మహిళలకు జీవనోపాధి కల్పించి... వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్న లవీనా జైన్‌ అంతరంగం ఇది.

‘‘మాది మీరట్‌. మా ఆయన సందీప్‌ జైన్‌. మాకు ఇద్దరు పిల్లలు. బాబు కిన్షుక్‌, పాప కృతిక. నలుగురం సొంత ఇంట్లో సంతోషంగా ఉండేవాళ్లం. పచ్చళ్లు పెట్టడం, స్క్వాష్‌లు తయారు చేయడమంటే నాకు చాలా ఇష్టం. వీటిని నిల్వ చేసే విధానాలకు సంబంధించి చిన్న కోర్సు కూడా పూర్తిచేశా. పచ్చళ్లు, ఊరగాయలు, జామ్‌లను విభిన్న రుచుల్లో రకరకాలుగా తయారుచేసి బంధువులకు, స్నేహితులకు పంచుతుండేదాన్ని. రుచి అమోఘమని, చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి పేరు, డబ్బు వస్తాయని చెబుతుండేవారు. వాళ్ల పొగడ్తలకు చాలా ఆనందం వేసేది.

బాధను భరిస్తూ...

‘‘అంతా సంతోషంగా సాగుతుందని అనుకుంటుండగానే జీవితం అనుకోని మలుపు తిరిగింది. అనారోగ్యంగా అనిపిస్తే నేను, ఆయన ఆసుపత్రికి వెళ్లాం. ఇద్దరికీ క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారించారు వైద్యులు. కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు అనిపించింది. పిల్లలు గుర్తుకువచ్చి కన్నీళ్లు ఆగలేదు. ఎలాగైనా ఈ కష్టం నుంచి గట్టెక్కాలని బలంగా నిర్ణయించుకున్నాం. బంధువులంతా ఇంటిని అమ్మేయమన్నారు. దానికి నా మనసు అంగీకరించలేదు. మావద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతోనే కీమోథెరపీ చేయించుకోవాలనుకున్నాం. చాలా బాధ అనుభవించాం. సరిగ్గా ఈ సమయంలోనే ప్రభుత్వం ‘ఫుడ్‌ ప్రిజర్వేషన్‌ ట్రెయినింగ్‌’ను ప్రారంభించింది. వెంటనే అందులో చేరా. కీమోథెరపీ సెషన్‌ పూర్తయిన వెంటనే తరగతులకు హాజరయ్యా.

నోటి మాటతోనే...

‘‘క్రమంగా క్యాన్సర్‌ నుంచి ఇద్దరం కోలుకున్నాం. నాకున్న పరిజ్ఞానంతో పచ్చళ్లు, జామ్‌ల వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా. అప్పుడు నా దగ్గర 1500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బుతోనే మొదట లెమన్‌ స్క్వాష్‌, తండాయి తయారు చేశా. పిల్లల సహకారంతో పాత గాజు సీసాల్లో వీటిని నింపాను. ఆ రోజుల్లో మహిళలు ఎక్కువగా కిట్టీ పార్టీలు చేసుకునేవాళ్లు. అక్కడికి ఈ సీసాలు తీసుకెళ్లి అమ్మకానికి పెట్టేదాన్ని. ఇంట్లో తయారు చేసినవి అనగానే వాళ్లు ఆసక్తి చూపేవారు. రుచి కూడా నచ్చడంతో విరగబడి కొనేవాళ్లు. క్రమంగా ఊరగాయలు, స్క్వాష్‌లు కూడా తయారుచేసి నా ఉత్పత్తులను పరిచయం చేసేందుకు స్టాల్స్‌ ప్రారంభించా. మొదట వచ్చిన పెద్ద ఆర్డర్‌... రెండు కిలోల మామిడికాయ పచ్చడి. ఆ నోటా ఈ నోటా విని ఆర్డర్లు పెరిగాయి.’’


నాణ్యతకే పెద్ద పీట...

‘‘వ్యాపారం విస్తరిస్తుండడంతో ఇంట్లోనే ‘తృప్తి ఫుడ్స్‌’ పేరుతో ఒక యూనిట్‌ ప్రారంభించా. పిల్లలు, భర్త పూర్తి సహకారం అందించారు. యూనిట్‌ పనుల్లో సహాయం కోసం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలను నియమించుకున్నా. ఇప్పటికీ అందరం కలిసి ఒకే కుటుంబంలా పనిచేస్తాం. కాలానుగుణంగా లభించే పండ్లు, కాయలతో ఉత్పత్తులను నిర్ణయించి తయారుచేస్తాం. అందుకు స్థానిక మార్కెట్ల నుంచి తాజాగా ఉన్నవాటిని మాత్రమే ఎంచుకుని కొనుక్కొస్తాం. ఉత్పత్తుల నిల్వ కోసం ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి ప్రకారమే సోడియం బెంజోయేట్‌ని కలుపుతాం. కృత్రిమ రంగులు అసలు కలపం. పెద్ద ఆర్డర్లు వచ్చినపుడు వాటి తయారీ, నిల్వ, ప్యాకింగ్‌ అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రస్తుతం మా యూనిట్‌ నుంచి 70 రకాలు తయారు చేస్తున్నాం. కారం, ఇతర మసాలా పొడులను సంప్రదాయ పద్దతుల్లోనే సిద్దం చేసుకుంటాం. ఇక్కడ పనిచేయడానికి వచ్చే మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తాం. ప్రతి ఉత్పత్తినీ నిర్దేశించిన కొలతల ప్రకారం మాత్రమే తయారయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకే మేం పెట్టిన పచ్చళ్లు, ఊరగాయలు తిన్నవాళ్లు ‘అచ్చం అమ్మమ్మ చేసినట్లే ఉన్నాయి’ అంటుంటారు. ఇది మాకెంతో సంతృప్తినిస్తుంది.

అదే అందరికీ ఇష్టం...

మా ఉత్పత్తుల్లో ‘హింగ్‌ అచార్‌’ బాగా ప్రాచుర్యం పొందింది. యూనిట్‌ మొత్తం అమ్మకాల్లో మూడొంతులు దీనిదే. లీఫీ స్క్వాష్‌, యాపిల్‌ జామ్‌, కీవీ జామ్‌, పైనాపిల్‌ క్రష్‌, స్ట్రాబెర్రీ స్క్వాష్‌లకు మంచి ఆదరణ ఉంది. స్థానికంగా నిర్వహించే ఎగ్జిబిషన్లు, ప్రత్యేక ఈవెంట్లలో స్టాల్స్‌ పెడుతుంటాం. మీరట్‌లో నాలుగు రిటైల్‌ అవుట్‌లెట్లు ప్రారంభించాం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కూడా మా ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. అమెజాన్‌ నుంచి కూడా కొనుక్కోవచ్చు. విదేశాలకు వెళ్లే కుటుంబాలు మా ఉత్పత్తులను వెంట తీసుకెళుతుంటే మాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంటుంది.’’

Updated Date - Dec 14 , 2024 | 03:30 AM