A wise fox : తెలివైన నక్క
ABN, Publish Date - Aug 17 , 2024 | 11:11 PM
ఒక అడవిలోని చెరువులో ఉండే మొసలికి చాలా రోజులుగా అదే చెరువులోని చేపలను తినీతినీ విసుగు పుట్టింది. వేరే ఏదైనా జంతువు ఆహారంగా దొరికితే బాగుండు అనుకున్నది. వెంటనే తన మిత్రుడైన
ఒక అడవిలోని చెరువులో ఉండే మొసలికి చాలా రోజులుగా అదే చెరువులోని చేపలను తినీతినీ విసుగు పుట్టింది. వేరే ఏదైనా జంతువు ఆహారంగా దొరికితే బాగుండు అనుకున్నది. వెంటనే తన మిత్రుడైన పీతను పిలిచి, ‘నువ్వు అడవిలోకి వెళ్లి., అన్ని జంతువులకు మొసలి చనిపోయింది అని చెప్పు. అపుడు అవి భయం లేకుండా ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తాయి. సమయం చూసి, నేను ఏదో ఒక జంతువును పట్టుకుని తింటాను’ అని చెప్పింది. పీత వెళ్లి మొసలి చెప్పినట్టే అడవిలో చెప్పింది. దాని మాటలు ఒక నక్క తప్ప మిగతా అన్ని జంతువులు నమ్మాయి.
నక్క మాత్రం ‘మిత్రులారా.. దీని మాటలు నమ్మవద్దు. మనమే స్వయంగా చెరువు దగ్గరికి వెళ్లి చూద్దాం పదండి’అని జంతువులను బయల్దేరదీసింది. చెరువు దగ్గరికి చేరగానే, నక్కమిగతా జంతువులతో ఇలా అన్నది. మిత్రులారా.. నేను విన్న దాని ప్రకారం మొసలి చనిపోయినా దాని తోక మాత్రం కదులుతూనే ఉంటుందట. కాబట్టి ఈ మొసలి తోక కదిలితే మనం నమ్మవచ్చుఅన్నది. ఆ మాటలు విన్న తెలివి తక్కువ మొసలి తాను చనిపోయానని నమ్మించడానికి మెల్లగా తన తోకను కదిలించడం మొదలు పెట్టింది. అదిచూసిన నక్క మిత్రులారా.. నేను ఊహించింది నిజమే. ఈ మొసలి చావలేదు నాటకమాడుతుంది. మనం చెరువు దాకా వస్తే మనలో ఎవరినైనా చంపవచ్చని దీని పన్నాగం.అందుకే నా మాట వినగానే తోక కదిలిస్తోంది పదండి ఇక్కడినుండి పోదాం’ అంటూ అన్ని జంతువులప్రాణాలు ఆ రోజు తన ఉపాయంతో కాపాడింది తెలివైన నక్క. మిగతా జంతువులన్నీ దానికి ఆ రోజు కృతజ్ఞతలు చెప్పాయి.
Updated Date - Aug 17 , 2024 | 11:12 PM