Story : గందరగోళం కుందేలు
ABN, Publish Date - May 11 , 2024 | 12:00 AM
ఒక అడవిలో ఓ కుందేలు ఉండేది. అది గందరగోళంకు గురి అవ్వటంలో ముందుండేది. చిన్న చప్పుడయినా భయపడేది. చినుకు పడినా ఉరికేది. గాలి
ఒక అడవిలో ఓ కుందేలు ఉండేది. అది గందరగోళంకు గురి అవ్వటంలో ముందుండేది. చిన్న చప్పుడయినా భయపడేది. చినుకు పడినా ఉరికేది. గాలి శబ్దానికి భీతిల్లేది. ఆఖరికి దూరంగా సాధారణ పక్షి అరుపు విన్నా భయపడేది. దీంతో ఆ కుందేలును అంతా ‘గందరగోళం కుందేలు’ అని పిలిచేవాళ్లు.
బాగా ఎండాకాలం. మామిడిచెట్టు కింద పడుకుంది కుందేలు. ఒక మామిడిపండు చెట్టుమీద నుంచి కుందేలు తల మీద పడింది. అంతే కుందేలు పరిగెత్తింది. ఎక్కడా నిలబడలేదు. ‘ఆకాశం విరిగి పడుతోంది’ అంటూ పరిగెత్తింది. కొన్ని జింకలు కనపడ్డాయి. ‘ఎందుకింత పరుగు?’ అని అడిగాయి. ‘ఆకాశం విరిగిపడుతోంది. నేనుచూశా. మీరు ఇక్కడే ఉంటే చస్తారు’ అంటూ గట్టిగా అరిచింది. జింకలు వెంటనే పరిగెత్తాయి. కుందేలుతో పాటు జింకలు పరిగెత్తటం ఎలుగుబంట్లు చూశాయి. విషయం ఏంటని? అడిగాయి. ‘చెడు జరుగుతంది. ఈ ఆకాశం ఊడి పడుతోంది. ఇక్కడే ఉంటే ప్రాణాలు నిలబడవు’ అన్నది ఓ జింక. పాపం పరిగెత్తలేక ఆ ఎలుగుబంట్లు ముందుకు ఉరికాయి.
అడవిలో గందరగోళం, చప్పుళ్లు. గాలి వీస్తోంది గట్టిగా. కుందేలు, జింకలు, ఎలుగుబంట్లకు తోడుగా నక్కలు జతకలిశాయి. పక్షులూ ఈ గుంపు మాట నమ్మాయి. అవి కూడా తుర్రుమన్నాయి. ఎదురుగా అడవికి రాజైన సింహం వచ్చింది. ‘ఎందుకిలా పరిగెత్తుతున్నారు?’ అని అడిగింది. ‘ఆకాశం పడుతోంది’ అంటూ విషయం చెప్పాయి. ఎవరు చెప్పారు? అని అడిగింది సింహం. ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. సింహం గట్టిగా నవ్వింది. విషయం తెలుసుకుందాం? అని అడిగింది. అంతలోనే ‘అసలు ఈ విషయాన్ని ఎవరు ముందు చూశారు?’ అని అడిగింది. అందరూ కుందేలు అని చెప్పింది. ‘విషయం ఏంటీ?’ అని కుందేలును అడిగింది సింహం. ‘మామిడిచెట్టుమీద నుంచి ఆకాశం విరిగి పడింది’ అని చెప్పింది. ‘ఇదేదో తేడాగా ఉంది. అక్కడికి వెళ్లి చూద్దాం’ అన్నది నక్క. అన్ని జంతువులూ బయలుదేరాయి ఆ ప్రాంతానికి. మామిడిచెట్టు కింద మామిడి పండు పడింది. అది చూసి ఇదేనా ఆకాశం నుంచి విరిగిపడిన ముక్క అన్నది సింహం. జంతువులన్నీ ఒకటే నవ్వులు. గందరగోళం కుందేలు మాట వినటమే తప్పు అనుకున్నాయి.
Updated Date - May 11 , 2024 | 12:00 AM