అంతరంగం
ABN, Publish Date - Jul 05 , 2024 | 12:14 AM
ఆమెకా మూట చాలా బరువుగా తోచింది. అపుడే ఆమె పక్కనుండి గుర్రం మీద ఒక యువకుడు వెళుతూ కనిపించాడు.
ఒక ముసలావిడ తల మీద పెద్ద మూట మోసుకుంటూ పొరుగూరికి నడుస్తున్నది.
ఆమెకా మూట చాలా బరువుగా తోచింది. అపుడే ఆమె పక్కనుండి గుర్రం మీద ఒక యువకుడు వెళుతూ కనిపించాడు. ముసలావిడ అతన్ని ఆపి, ‘బాబూ ఈ మూట చాలా బరువుగా ఉంది. దీన్ని గుర్రం మీద తీసుకెళితే నేను తరువాత వచ్చి తీసుకుంటాను’ అన్నది. అప్పటికే చాలా అసహనంగా ఉన్న ఆ యువకుడు ‘నాకంత సమయం లేదమ్మా’ అనేసి వెళ్లిపోయాడు. కాసేపు ప్రయాణం చేసిన తర్వాత అతను
‘ ఆ మూటలో ఏవైనా విలువైన వస్తువులు ఉండవచ్చు కదా, ఆ మూటను తీసుకుని, ఆమెకు ఇవ్వకుండా వెళ్లిపోతే మాత్రం నన్ను అడిగేదెవరు? మూట తీసుకున్నా బాగుండేది’ అనుకున్నాడు. అలా అనుకోగానే అతను తిరిగి ముసలావిడ వద్దకు వచ్చి ‘పెద్దమ్మా నీ మూటను నేను మోస్తా ఇటివ్వు’ అని అడిగాడు. దానికి ముసలావిడ ‘ఇపుడు నేను నిన్ను నమ్మలేను’ అన్నది.
దానికి ఆ యువకుడు ఎందుకలా అంటున్నావు? ఇలా మాట్లాడమని నీకెవరు చెప్పారు? అన్నాడు అపుడు ముసలావిడ ‘మూట కోసం తిరిగి వెనక్కి రమ్మని నీకు చెప్పిన వాడే నాకూ ఇవ్వవద్దని చెప్పాడు అన్నది.
‘నీ మాటలను బట్టి నీ అంతరంగంలో ఆలోచన నాకు తెలిసిపోయిందిలే’ అని మెల్లగా అని అక్కడినుండి నడక సాగించింది ముసలావిడ.
Updated Date - Jul 05 , 2024 | 12:14 AM