Story : మారని బుద్ధి
ABN, First Publish Date - 2024-02-07T22:44:34+05:30
ఒక ఊరిలో జోగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పరమ పిసినారి. ఇంట్లో పిల్లలకు కూడా మంచి తిండి తినిపించని పిసినారి. అంత సంపాదించి.. ఏమి మూటగట్టుకుంటావు? అనేవారు ఊరిలో కొందరు. ‘ఆ డబ్బుంటేనే కదా..
ఒక ఊరిలో జోగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పరమ పిసినారి. ఇంట్లో పిల్లలకు కూడా మంచి తిండి తినిపించని పిసినారి. అంత సంపాదించి.. ఏమి మూటగట్టుకుంటావు? అనేవారు ఊరిలో కొందరు. ‘ఆ డబ్బుంటేనే కదా.. మీరు నన్ను పట్టించుకునేది. మీరంతే మారరు’ అంటూ వారిమీద పరిహాసం చేసేవాడు జోగయ్య.
ఎందుకో జోగయ్యకు వ్యాపారాలంటే ఇష్టం. పైగా ఆ వ్యాపారానికి పెట్టుబడి పెట్టడానికి మనసొచ్చేది కాదు. అందుకే కిరాణ కొట్టు పెట్టినా అతనికి కలిసిరాలేదు. తనలోని తప్పు తెలిసేది కాదు. తక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టి... ఎక్కువ సంపాదించాలనే ఆలోచన తనది. అలా వ్యవసాయం చేశాడు. నష్టాలను చవిచూశాడు. చివరికి తన మిత్రుడు సలహా మేరకు పాల వ్యాపారంలోకి వచ్చాడు. పాలల్లో నీళ్లు కలుపుతూ మంచి ధనాన్ని సంపాదించాడు.
అలా వ్యాపారం చేస్తూ సొంతంగా గేదెలు, ఆవులు కొన్నాడు. పాలు తన ఇంటిలో పుష్కలం. అయినా పాలల్లో నీళ్లను మాత్రం కలిపేవాడు. పోనుపోను పాలకంటే నీళ్లు ఎక్కువ తేలేవి. అయినా పట్టించుకునేవాడు కాదు. తన దగ్గర పాలు కొనమని భీష్మించుకున్నా పోటీలేక ప్రజలు జోగయ్య దగ్గరే కొనేవారు. నీళ్లు శాతం పాలల్లో ఎక్కువ అవటంతో ఆ ఊరిలోని పెద్దలంతా కలసి జోగయ్యను ఊరినుంచి తరిమేశారు. జోగయ్య తన తప్పే లేదన్నాడు. పాలల్లో నీళ్లు కలపడం లేదనేమాట మాత్రం మాట్లాడలేదు.
జోగయ్య కట్టుబట్టలతో ఊరి చివర తాచ్చాడుతుండగా చెట్టు కింద ఓ యోగి కనపడ్డాడు. ఆయన దగ్గరకు వెళ్లి తన బాధను వెళ్లగక్కాడు. బాధపడకు జోగయ్య.. అంటూ ఓదార్చాడు. ‘నీకేమి కావాలో కోరుకో. మంత్రశక్తితో నీకు ఇస్తాను’ అన్నాడు. ‘నాకు పాల వ్యాపారం మళ్లీ చేయాలనుంది.. అది కూడా వేరే ఊరిలో’ అన్నాడు. ‘ఆ చెరువంతా పాలే.. ఇక సంపాదించుకో’ అన్నాడు యోగి. ‘నిజమా.. అయితే అదే పనిగా ఇంకో చెరువులో మంచి నీళ్లు వచ్చేట్లు చేయండి’ అన్నాడు జోగయ్య. ‘ఇక నీ బుద్ధి మారదా?’ అంటూ ‘ఇక్కడినుంచి తక్షణమే వెళ్లిపో’ అన్నాడు. ‘నిజంగా పాలున్నాయా స్వామి.. ఆ చెరువులో’ అన్నాడు జోగయ్య. ‘దూరంగా కనపడేది చెరువు కాదు.. పాలరాళ్లు. నీ కంటికి అలా కనిపిస్తోంది’ అన్నాడు యోగి.
Updated Date - 2024-02-07T22:44:35+05:30 IST