బరువు తగ్గండిలా...
ABN, Publish Date - Nov 09 , 2024 | 11:03 PM
ఆరోగ్యంగా ఉంటూనే బరువు తగ్గడమనేది పెద్ద సవాల్. చాలామంది బరువు తగ్గాలని రకరకాల వ్యాయామాలు, వాకింగ్ చేస్తుంటారు. అయినా ప్రయోజనం ఉండదు. మరికొంతమంది తినడం మానేస్తుంటారు. దీనివల్ల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదముంది. రోజువారీ తీసుకునే
ఆరోగ్యంగా ఉంటూనే బరువు తగ్గడమనేది పెద్ద సవాల్. చాలామంది బరువు తగ్గాలని రకరకాల వ్యాయామాలు, వాకింగ్ చేస్తుంటారు. అయినా ప్రయోజనం ఉండదు. మరికొంతమంది తినడం మానేస్తుంటారు. దీనివల్ల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదముంది. రోజువారీ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సులభంగా బరువు తగ్గవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం!
బ్రేక్‌ఫాస్ట్
మనం ఉదయం తీసుకునే అల్పాహారం రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఇడ్లీ, వడ వంటివి కాకుండా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, నట్స్, పాలకూర, టోఫుతో కూడిన సలాడ్స్; మొలకెత్తిన గింజలు, పండ్ల రసాలు, పప్పు ధాన్యాలు, పన్నీరు, గ్రుడ్లు, యోగర్ట్ తీసుకోవడం మంచిది. ప్రోటీన్లు ఆకలిని నియంత్రించి వేగంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి.
ఫైబర్
ప్రేగులలో సమస్యలను నివారించి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఫైబర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీరంలో జీవక్రియలను పెంచి క్రొవ్వు పేరుకోకుండా చేస్తుంది. ఫైబర్ అధికంగా లభించే ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, చిక్కుళ్లను తరచూ తినడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
కార్బోహైడ్రేట్స్
ఇవి శరీరానికి శక్తిని అందించే ప్రాథమిక పోషకాలు. అయినప్పటికీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్రొవ్వు పెరుగుతుంది. బరువు తగ్గడంలో భాగంగా మనం ఎంచుకొని తీసుకునే ఆహారం నుంచి లభించే కార్బోహైడ్రేట్స్ శరీరానికి సరిపోతాయి. అదనంగా అవసరం లేదు. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే బియ్యం, గోధుమలతో తయారు చేసిన ఆహారాన్ని తినడం తగ్గించాలి.
నీరు
ప్రతిరోజూ శరీరానికి అవసరమైన నీరు త్రాగినపుడే అవయవాలన్నీ సరిగా పనిచేసి వ్యర్థాలను బయటికి పంపుతాయి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగితే ప్రేగు కదలికలు సక్రమంగా ఉండి శరీరంలో టాక్సిన్స్ పేరుకోవు. ఉదయాన్నే ఓ గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల కూడా బరువు నియంత్రణలో ఉంటుంది.
నిద్ర
సరిగా నిద్రపోకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తయి ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రించడం వల్ల అంతర్గత అవయవాలు విశ్రాంతి పొంది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
సమయపాలన
బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. భోజనానికి గంట ముందు ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తినడం మంచిది. ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం పూర్తిచేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గకుండా శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడకుండా ఉంటాయి.
వ్యాయామం
బరువు పెరగకుండా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయాయం చేయాలి. వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్స్, స్ట్రెచర్స్ చేయడం వల్ల శరీరంలోని అనవసర క్రొవ్వులు కరగిపోతాయి. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. కండరాలు దృఢంగా మారతాయి. ఉదయం వేళల్లో వాకింగ్, రన్నింగ్ కూడా మంచి ఫలితాన్నిస్తాయి.
Updated Date - Nov 09 , 2024 | 11:03 PM