ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Madhulika : పాలియెస్టర్‌పై పోరు

ABN, Publish Date - Nov 21 , 2024 | 06:22 AM

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని తల్లితండ్రులందరూ కోరుకుంటారు. అయితే తినే ఆహారం నుంచి వేసుకొనే బట్టల దాకా ప్రతి అంశం పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ విషయాలపై చాలామంది తల్లిదండ్రులకు అవగాహన ఉన్నా... వాటిని పెద్దగా పట్టించుకోరు.

చైతన్యం

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని తల్లితండ్రులందరూ కోరుకుంటారు. అయితే తినే ఆహారం నుంచి వేసుకొనే బట్టల దాకా ప్రతి అంశం పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ విషయాలపై చాలామంది తల్లిదండ్రులకు అవగాహన ఉన్నా... వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఊళ్ల మధులిక మాత్రం ఒక పోరాటమే ప్రారంభించారు. పాలియెస్టర్‌కు బదులుగా సహజసిద్ధ వస్త్రాలైన లినెన్‌, నూలుతో తయారయ్యే యూనిఫామ్‌లను వాడుకలోకి తీసుకురావాలనుకున్నారు. అందు కోసం తన పిల్లవాడు చదువుతున్న బడి ప్రధానోపాధ్యాయురాలికి ఆమె రాసిన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ లేఖ వెనకనున్న కారణాలను మధులిక ‘నవ్య’కు వివరించారు.

‘‘తెలుగు రాష్ట్రాల్లో ఏ పాఠశాలనైనా తీసుకోండి. దానిలో పిల్లలు వేసుకొనే యూనిఫామ్స్‌ను ఏ వస్త్రంతో తయారుచేస్తున్నారో గమనించండి. ఎక్కడో ఒకటి... అరా తప్ప యూనిఫాంలు అన్నీ పాలియెస్టర్‌ కలిపిన మిశ్రమ పోగులతోనే తయారవుతున్నాయి. దీని ఫలితాలు వెంటనే మనకు కనబడకపోవచ్చు. దీర్ఘకాలంతో మాత్రం ఇటు పిల్లల ఆరోగ్యానికి... అటు పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది. ఈ విషయంపై ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో చర్చ జరుగుతోంది. అనేక అధ్యయనాలు సాగుతున్నాయి. పాలియెస్టర్‌ దుస్తులు ఎక్కువ కాలం వేసుకొనే పిల్లలకు థైరాయిడ్‌ వంటి హార్మోన్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఒకప్పుడు మన దేశంలో అందరూ నూలు లేదా కాటన్‌ దుస్తులను మాత్రమే ధరించేవారు. ఆ తర్వాతి కాలంలో కాటన్‌ వాడకం తగ్గింది.

  • నా ఒక్కదాని సమస్య కాదు...

ఈ మధ్య కాలంలో పాలియెస్టర్‌ వస్త్రాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని అంతర్జాలంలో చదివాను. ఆ సమాచారం చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యమేసింది. చిన్నారుల చర్మాలకు పాలియెస్టర్‌ బట్టలవల్ల కలిగే దుష్పరిణామాలు అనేకం ఉన్నాయి. అయినా మనం వాటిని వాడుతూనే ఉంటాం. తొలుత మా అబ్బాయి విషయంలో ఏం చేయాలో నాకు అర్థంకాలేదు. వాడికి రోజూ కాటన్‌ బనియన్‌ తొడిగి, ఆ తర్వాత యూనిఫాం వేయటం మొదలుపెట్టా! కానీ ఇది నా ఒక్కదాని సమస్య మాత్రమే అనిపించలేదు.


దాంతో యూనిఫాంలను కాటన్‌తో తయారు చేయమని స్కూలు ప్రధానోపాధ్యాయురాలిని అభ్యర్థిస్తూ ఉత్తరం రాశా. ఆ ఉత్తరమే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మార్పు వెంటనే సాధ్యమవుతుందని... యూనిఫాంలను తయారు చేసే పద్ధతులను మారుస్తారని నేను అనుకోవటంలేదు. ఎందుకంటే చాలా కాలంగా అలవాటు పడిన పద్ధతులను అంత త్వరగా మార్చుకోలేం. కానీ ఎక్కడో అక్కడ ఒక ప్రయత్నం మొదలు కావాలి కదా. అందుకోసం ఎవరో ఒకరు తొలి అడుగు వేయాలి. అదే నేను చేసింది.

  • ఇదే మొదలు కాదు...

పాలియెస్టర్‌ వాడకాన్ని నియంత్రించాలనే ఉద్యమానికి నా లేఖ నాంది కాదు. ‘ఈశా ఫౌండేషన్‌’ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ పాలియెస్టర్‌ దుప్ప్రభావాలు, సహజసిద్ధ పోగులతో ఒరిగే ప్రయోజనాల గురించి ఎప్పటి నుంచో అవగాహన కల్పిస్తున్నారు. నూలుతో తయారైన యూనిఫామ్స్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. ప్రస్తుతం చాలామందికి పాలియెస్టర్‌ దుస్తులు వాడకంవల్ల ఎదురయ్యే దుష్ప్రభావాల తీవ్రత అర్థం కావడంలేదు. అది అర్థమైన రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాటన్‌ దుస్తులనే ధరిస్తారు.’’

- గోగుమళ్ల కవిత

Updated Date - Nov 21 , 2024 | 06:22 AM