ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : సరళ జీవనమే ధ్యాన సోపానం

ABN, Publish Date - Aug 23 , 2024 | 05:15 AM

ధ్యానానికి, జీవనశైలికి అవినాభావ సంబంధం ఉంది. జీవితంలో సరళత తెచ్చుకుంటే... ధ్యానస్థితి దానంతట అదే అనుభవంలోకి వస్తుంది.

ధ్యానానికి, జీవనశైలికి అవినాభావ సంబంధం ఉంది. జీవితంలో సరళత తెచ్చుకుంటే... ధ్యానస్థితి దానంతట అదే అనుభవంలోకి వస్తుంది. ఆలోచనల ప్రవాహం నెమ్మదించడానికి, మానసిక ఒత్తిడి కొంత తగ్గడానికి రోజూ కొంత సమయంపాటు ధ్యానసాధన మంచిదే. అయితే, జీవితంలో ప్రశాంతత, ధ్యానస్థితి నిరంతరం ఉండాలంటే... అందుకు అనువైన వాతావరణం కల్పించడం మరింత ముఖ్యం.

దీనికి మౌలికమైన పునాది సరళ జీవనం అనేది నిస్సందేహం. ప్రస్తుత హడావిడి జీవితంలో ఏ మార్పూ లేకుండా, కోరికలు, ప్రాపంచిక వ్యాపకాలు యధావిధిగా కొనసాగిస్తున్నవారికి ధ్యానం పేరుతో కాసేపు కళ్ళు మూసుకుని కూర్చోవడం వల్ల ఫలితం శూన్యం.

వాహన వేగం తగ్గించాలంటే ఉన్నపళంగా బ్రేక్‌ వేయలేం. ముందు వేగవర్ధకం (యాక్సెలరేటర్‌) మీద ఒత్తిడి తీసేయాలి. అలాగే జీవితాన్ని సరళతరం చేసుకోవాలి. అదే నిజమైన ధ్యాన సాధన.


పరిమిత వినియోగం

సరళ జీవనం అంటే ఏమిటి? అవసరం మేరకే వనరులు ఉపయోగించటడం, ప్రాపంచిక విషయాల్లో చిక్కుకుపోకుండా ఉండడం. ఆకలి తీర్చుకోవడానికి ఆహారం అనే రోజులు పోయాయి.

నేడు జిహ్వ చాపల్యం కోసం, కాలక్షేపం కోసమే తింటున్నామంటే అతిశయోక్తి కాదు. సౌకర్యాల స్థాయి దాటి విలాసాలకు చిరునామా అయ్యాయి మన నివాసాలు.

ఇవన్నీ ఒక ఎత్తయితే... ఈ వినిమయ సంస్కృతినే అభివృద్ధిగా చూడడం, వాడెయ్‌-పారెయ్‌ ధోరణి వెర్రితలలు వేయడం మరో విషాదం. వేడుకల పేరుతో జరుగుతున్న అనవసర ఆర్భాటం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.


నిజమైన ప్రేమ

ఇక కుటుంబ బంధాల్లో సరళత అత్యంత ముఖ్యం. పిల్లల పాలన-పోషణ, విద్యాబుద్ధులతో పాటు, వారితో తగిన సమయం గడపడం, వాళ్ళ అభిరుచులను గౌరవించాలి. వాళ్లు స్వేచ్ఛగా, స్వతంత్ర వ్యక్తులుగా ఎదిగేలా తల్లిదండ్రులు సహకరించాలి. ఇవీ వారిపై నిజమైన ప్రేమకు నిదర్శనాలు.

కానీ వాస్తవంలో చూస్తే... పిల్లలను తమ ఆస్తిపాస్తులు కాపాడే వారసులుగా, తమ కలలను, ఆశలను నెరవేర్చిపెట్టే సాధనాలుగా భావించటం, తమకన్నా విలాసవంతంగా బతకాలి అని కోరుకోవడం నేటి తల్లిదండ్రుల్లో ఎక్కువైపోయిందన్నది వాస్తవం. ఆలోచిస్తే ఇది పిల్లలపై ప్రేమ కాదు సరికదా కేవలం స్వార్ధపరత్వం.

ఇక ఉద్యోగంలో తమను తాము నిరూపించుకోవడానికి ఒత్తిడి పెంచుకోవడం, సహోద్యోగులతో నిరంతర పోటీవైఖరి, పదోన్నతులు, జీతం పెంపుల కోసం యాతన పడడం, ఇలా ఉద్యోగమే జీవితం అయిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు.


గృహస్థుగా ఉంటూనే...

ఇలాంటి హైటెక్‌, హైస్పీడ్‌ జీవితాల వేగం ఇలాగే కొనసాగిస్తూ ‘రోజూ కాసేపు ధ్యానం’ అంటూ సాధన చేయడం వృధా. ఇది జబ్బును పెంచి పోషిస్తూ ఉత్తుత్తి మాత్రలు మింగడం లాంటిది. వాహన వేగం పెంచుకుంటూ పోతూ బ్రేక్‌ పడాలని ప్రార్ధించడం లాంటిది.

సరళ జీవనం అంటే అందరూ ఋషులూ, సన్యాసులూ అయిపోవాలని కాదు. ఆ అవసరమూ లేదు. గృహస్థుగా ఉంటూనే... మితాహారం, వస్తు-సౌకర్యాలను పొదుపుగా వాడడం, ప్రకృతికి దగ్గరగా జీవించడం, ఏదో ఒక సృజనాత్మక వ్యాపకం పెంపొందించుకోవడం, భవిష్యత్తుపై అతిభయాన్ని తగ్గించుకోవడం, వర్తమానాన్ని పూర్తిగా ఆస్వాదించడం... ఇలాంటి మార్గాల ద్వారా జీవితాన్ని సరళతరం చేసుకుంటే ధ్యానం దానంతటదే కలిగే అనుభవం అవుతుంది. జీవితమే ధ్యానాత్మకమై వెలుగులీనుతుంది.

ఈదర రవికిరణ్‌

Updated Date - Aug 23 , 2024 | 05:15 AM

Advertising
Advertising
<