Parenting : పిల్లల్లో సానుకూల దృక్పథానికి...
ABN, Publish Date - Nov 02 , 2024 | 12:18 AM
సాధారణంగా పిల్లల్లో ఎన్నో భయాలు, అపోహలు, నెగెటివ్ ఆలోచనలు ఉంటాయి. వీటన్నింటినీ తట్టుకుని పిల్లలు సానుకూల దృక్పథంతో ఎదగడానికి తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పేరెంటింగ్
సాధారణంగా పిల్లల్లో ఎన్నో భయాలు, అపోహలు, నెగెటివ్ ఆలోచనలు ఉంటాయి. వీటన్నింటినీ తట్టుకుని పిల్లలు సానుకూల దృక్పథంతో ఎదగడానికి తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూ ఉన్నత లక్ష్యాలవైపు అడుగులు వేసేలా పిల్లల ఆలోచనా తీరును సరిదిద్దడం ఎలానో తెలుసుకుందాం!
పిల్లలకు చిన్న కష్టం కూడా తెలియకుండా పెంచాలని తల్లిదండ్రులు అనుకుంటారు. ఇలా చేస్తే పిల్లలు సున్నితమనస్కులుగా మారతారు. చిన్న సమస్య ఎదురైనా భూతద్దంలో చూస్తూ భయపడుతుంటారు. అలా కాకుండా సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో పిల్లలకు తెలియజేయాలి.
తోటి పిల్లలు కొడుతున్నారనో, తిడుతున్నారనో చెప్పినపుడు సాధారణంగా తల్లిదండ్రులు మీరు కూడా అలాగే చేయండి అనేస్తుంటారు. ఇది సమర్థనీయం కాదు. తోటివారితో స్నేహంగా ఎలా మెలగాలో పిల్లలకు నేర్పించాలి. చక్కని మాటతీరుతో స్నేహపూర్వకంగా ఉండేలా ప్రోత్సహించాలి.
కొంతమంది పిల్లలు హింసాత్మక ధోరణితో ఉంటారు. ఇంటి చుట్టూ ఉండే కుక్కలను, పిల్లులను రాళ్లతో కొడుతుంటారు. దుడుకు స్వభావంతో తోటి పిల్లలతో గొడవపడుతుంటారు. పిల్లల్లో ఈ స్వభావాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. సందర్భానుసారం దయ, ప్రేమ, స్నేహం గురించి వివరిస్తూ ఎవరినీ బాధించకూడదని నచ్చచెప్పాలి.
తోటి పిల్లలకు హోంవర్క్‌లో సహాయం చేయడం, పాఠశాలలో లంచ్ బాక్స్ షేర్ చేసుకోవడాన్ని ప్రోత్సహించాలి. పిల్లలకు బాధ కలిగినపుడు దాన్ని స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోవడం నేర్పించాలి. అలాగే తోటివారి సమస్యల గురించి ఆలోచించే అలవాటు చేయాలి. ఎదుటివారికి సహాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని పిల్లలకు అనుభవంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి.
పిల్లలతో తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రేమగా మాట్లాడాలి. వారిపై చిరాకు, కోపం ప్రదర్శించకూడదు. పిల్లలు ఏదైనా మంచి పనిచేసినపుడు వారిని అభినందిస్తూ ప్రోత్సహించాలి.
ఓటమి ఎదురైనపుడు పిల్లలు కృంగిపోకుండా అది సహజంగా జరిగేదే అన్న ధోరణిలో తల్లిదండ్రులు సర్దిచెప్పాలి. గెలుపు, ఓటములను; సంతోషం, బాధలను సమానంగా చూడగలిగే మనోధైర్యాన్ని మరోసారి విజయం సాధించగలమనే ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలి.
Updated Date - Nov 02 , 2024 | 12:18 AM