ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PCOD : పీసీఓడీకి అడ్డుకట్ట పిండ దశ నుంచే..

ABN, Publish Date - Nov 26 , 2024 | 04:16 AM

వ్యాయామం లేకపోవడం, కొవ్వులతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం, వృత్తి, విద్యాపరమైన ఒత్తిళ్లు, పర్యావరణ ప్రభావాలు ఇవన్నీ కలగలిసి, పీసీఓడీ సమస్యను విపరీతంగా పెంచేస్తున్నాయి.

టీనేజి మొదలు పెళ్లీడు వయసు వరకూ యువతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పీసీఓడీ (పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌). అంతర్గతంగా ఆరోగ్యాన్ని హరిస్తూ, దీర్ఘకాల రుగ్మతలకు దారి తీసే ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడం సులభమే అంటున్నారు వైద్యులు.

వ్యాయామం లేకపోవడం, కొవ్వులతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం, వృత్తి, విద్యాపరమైన ఒత్తిళ్లు, పర్యావరణ ప్రభావాలు ఇవన్నీ కలగలిసి, పీసీఓడీ సమస్యను విపరీతంగా పెంచేస్తున్నాయి. గతంలో ఈ సమస్య 5ు అమ్మాయిల్లో ఉంటే, ఇప్పుడు 20 నుంచి 30ు అమ్మాయిల్లో ఈ సమస్య కనిపిస్తోంది. అలాగని ఈ సమస్యకు మూలాలు గతి తప్పిన మన జీవనశైలిలోనే ఉన్నాయనుకుంటే పొరపాటు. గర్భంలో పిండదశలో ఉన్నప్పుడు మొదలు, పుట్టిన తర్వాత పెరిగే క్రమంలో జరిగే పొరపాట్లు, అలవాట్లలో కూడా పిసిఒడి మూలాలు దాగి ఉంటాయి.

గర్భంలోనే బీజాలు

గర్భిణులు తనతో పాటు గర్భంలో పెరిగే బిడ్డతో కలిపి ఇద్దరికి సరిపడా ఆహారం తినాలనే నమ్మకం సర్వత్రా స్థిరపడిపోయింది. దాంతో గర్భిణులు నచ్చిన ఆహార పదార్థాలను పరిమితం లేకుండా తినేస్తూ ఉంటారు. అవి తీపి పదార్థాలు కావచ్చు, జంక్‌ ఫుడ్‌ కావచ్చు, నూనెలో వేయించిన పదార్థాలు కావచ్చు. కానీ నిజానికి ఇలాంటి ఆహార స్వేచ్ఛ వల్ల గర్భిణితో పాటు కడుపులో పెరిగే బిడ్డ బరువులు పెరిగిపోతాయి. ఫలితంగా పుట్టబోయే ఆడపిల్ల భవిష్యత్తులో పీసీఓడీ బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. నాలుగు కిలోల బరువుతో బిడ్డ పుడితే తల్లులు పొంగిపోతూ ఉంటారు. కానీ పుట్టినప్పుడు నాలుగు కిలోల మేరకు బరువున్న పిల్లల్లో భవిష్యత్తులో పీసీఓడీతో పాటు మధుమేహం, అధిక రక్తపోటు మొదలైన జీవనశైలి సంబంధిత రుగ్మతల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే గర్భిణి సమతులాహారం తీసుకుంటూ, కొవ్వు పదార్థాలకు, చక్కెర, జంక్‌ ఫుడ్‌కూ దూరంగా ఉండాలి.


బాల్యంలో తీపి వద్దు

పిల్లలు తీపికి త్వరగా ఆకర్షితులవుతారు. తల్లి దగ్గర పాలు తగ్గిపోయినప్పుడు పోత పాలు పట్టిస్తూ ఉంటాం. ఆ పాలను తాగడానికి బిడ్డ అయిష్టత ప్రదర్శించినప్పుడు, వాటిలో కాస్త చక్కెర కలిపి పట్టించేస్తూ ఉంటారు. ఇలా పసి వయసులోనే చక్కెర రుచిని అలవాటు చేయడం సరి కాదు. పిల్లలకు చాక్లెట్లు, కేకులు, శీతల పానీయాలను అలవాటు చేయకూడదు. తీపి కోసం పండ్లు ఇవ్వొచ్చు. పండ్ల రసాలకు బదులుగా కొబ్బరి నీళ్లు అలవాటు చేయాలి. పండ్ల రసాలకు బదులుగా నేరుగా పండ్లు తినడం అలవాటు చేయాలి.

అధిక బరువు, పీసీఓడీ

అధిక బరువు, పీసీఓడీలకు అవినాభావ సంబంధం ఉంటుంది. పీసీఓడీ మూలంగా బరువు పెరిగిపోవడం, అధిక బరువు మూలంగా పీసీఓడీ బారిన పడడం సర్వసాధారణం. కాబట్టి బరువును అదుపులో పెట్టుకోవడంతో పాటు పెరిగిన బరువును ఆరోగ్యకరమైన అలవాట్లతో తగ్గించుకోగలిగితే పీసీఓడీ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. పీసీఓడీ సమస్యను ప్రారంభంలో గుర్తించడం కోసం మొదటి నెలసరి కనిపించినప్పటి నుంచి ఆడపిల్లల ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచాలి. మొదటి మూడేళ్ల వరకూ నెలసరి అస్తవ్యస్థంగా ఉండడం సహజమే! ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగినా, శరీరం మీద వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతున్నా, మొటిమలు ఎక్కువగా వేధిస్తున్నా పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలి.


చికిత్స ఇలా...

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడమే పీసీఓడీ ప్రధాన చికిత్స. ఈ మార్పులు లేని పీసీఓడీ చికిత్స ఫలితాన్నివ్వదు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజుకు కనీసం గంట పాటు వ్యాయామం చేయడం, జంక్‌ ఫుడ్‌ మానేయడం తప్పనిసరి. ఒకవేళ పీసీఓడీ వల్ల శరీరంలో టెస్టోస్టిరాన్‌ విపరీతంగా పెరిగిపోయినా, శరీరం మీద వెంట్రుకలు ఎక్కువగా పెరిగిపోతున్నా, పీసీఓడీ, గర్భధారణకు అడ్డంకిగా మారేంత తీవ్ర దశకు చేరుకున్నా, అదనంగా మందులు వాడుకోవలసి ఉంటుంది. నెలసరి వస్తోంది కాబట్టి పీసీఓడీని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు అనే భావనలో ఉండిపోయే వాళ్లూ ఉన్నారు. కానీ ఈ సమస్యతో గర్భం దాల్చినప్పుడు మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు తలెత్తుతాయి. వీటితో గర్భాన్ని కొనసాగించడం ఇబ్బందికరంగా మారుతుంది. నెలసరి అవకతవకలను దీర్ఘకాలం పాటు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ప్రభావం గుండె మీద పడుతుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ పరిస్థితి అంతర్గత అవయవాలన్నిటికీ హానికరమే!

ఈ లక్షణాలు గమనించాలి

శరీరంలో పురుష హార్మోన్‌ టెస్టోస్టిరాన్‌ పెరగడం

శరీరం మీద వెంట్రుకలు ఎక్కువగా పెరగడం

మఽధుమేహం సూచనలు కనిపించడం (మెడ వెనక నలుపు)

నెలసరిలో అవకతవకలు

మానసిక కుంగుబాటు, ఆందోళన

డాక్టర్‌ ఎ. మహిత రెడ్డి

అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌

గైనకాలజిస్ట్‌,

అపోలో క్రేడిల్‌, హైదరాబాద్‌.

Updated Date - Nov 26 , 2024 | 04:16 AM