తెలుగు నాట పులగానికి సాటి లేదు
ABN, Publish Date - Dec 14 , 2024 | 03:09 AM
తెలుగు నేలకు సంబంధించినంతవరకూ పెసలు మన మొదటి పప్పు ధాన్యం. ఆ సమయంలో పెసర చేనుని పైరు అనేవారు.
తెలుగు నేలకు సంబంధించినంతవరకూ పెసలు మన మొదటి పప్పు ధాన్యం. ఆ సమయంలో పెసర చేనుని పైరు అనేవారు. తరువాతి కాలంలో అన్ని పంటచేలనూ పైరు అనటం మొదలుపెట్టారు. పెసల తర్వాతే మనకు కందిపప్పు తదితర పప్పుధాన్యాలు తెలిశాయి. మొదట్లో అన్నంలో పెసరపప్పును కలుపుకొని తినేవారు. వరి బియ్యాన్ని, పెసరపప్పును కలిపి వండటం ఆ సమయంలో ఒక కొత్త ప్రయోగం. దేవుడికి మహానివేదన పెట్టే సమయంలో ప్రతి రోజూ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టలేరుగా! దానికి బదులుగా పెసరపప్పు అన్నం నివేదనగా పెట్టేవారు. ఈ పెసరపప్పు అన్నంను సంస్కృత పాకశాస్త్ర గ్రంథాల్లో, వైద్య గ్రంథాల్లో- కృశర అని పిలుస్తారు. కొన్ని చోట్ల ముద్గౌదనం (పప్పన్నం) అని కూడా కనిపిస్తుంది. ఇక పెసరపప్పు పసిడి వర్ణంలో ఉంటుంది కాబట్టి దీనిని తెలుగులో పులగం అని పిలవటం మొదలుపెట్టారు.
‘భోజన కుతూహలం’ గ్రంథంలో ఈ కృశర గురించి ‘‘తండులా దాలిసంయుక్తా లవణార్ద్రకహింగుభి.. యుక్తాశ్చ సలిలె సిద్ధా కృశరా కథితా బుధై’’ అని పేర్కొంటారు. తండులా దాలిసంయుక్తా అంటే పెసరపప్పు, బియ్యం కలిపి వండినది అని.. ‘‘లవణార్ద్రక హింగుభి’’ అంటే సైంధవలవణం, అల్లంముక్కలు, ఇంగువ వగైరా కలిపినది అని.. ‘‘సలిలె సిద్ధా కృశరా కథితా బుధై’’ అంటే చాలినంత నెయ్యి వేసి వండితే దాన్ని కృశరా అని మేథావులు పిలుస్తారని.. ‘‘శుక్రలా’’ అంటే పురుషుల్లో జీవకణాలను పెంచే సమర్థత దీనికి ఉందని.. ‘‘బల్యా గురు పిత్త కఫప్రదా’’ అంటే బలకరం, ఆలస్యంగా అరిగి ఎక్కువ సేపు ఆకలి వెయ్యకుండా.. కఫదోషాన్ని పోగొడుతుందని.. ‘‘బహువిష్టంభ’’ అంటే నీళ్ళవిరేచనాలను, అతిమూత్రాన్ని ఆపుతుందని.. ‘‘మలమూత్రకరీ’’ అంటే మలమూత్రాలు సులభంగా అయ్యేలా చేస్తుందని.. ‘‘బుద్ధివివర్థక’’ అంటే ఙ్ఞాపకశక్తిని పెంచేదిగా ఉంటుందని అర్ధం.
పిల్లలకు...
ఎదిగే పిల్లలకు పులగాన్ని మించిన ఆహార పదార్థం ఇంకొకటి లేదు. తల్లి దండ్రులు తమ పిల్లలకు ఉదయాన్న ఈ కమ్మని కృశరా అనే పులగాన్ని పెట్టి పంపిస్తే పిల్లలు చురుకుగా ఉంటారు. కడుపులో మంట, అల్సర్లు, అమీబియాసిస్, కడుపు ఉబ్బరం లాంటి బాధల్ని ఈ పులగం తగ్గిస్తుంది. దీనిని తిన్న తరువాత బెల్లం పానకం గానీ నిమ్మరసం షర్బత్తు గానీ మజ్జిగ గానీ తాగితే తేలికగా అరుగుతుంది. ఇక ఈ పులగాన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. మొదటిది కారం (కట్టు) పులగం. రెండోది తీపి పులగం. ఇక్కడ ఒక మరో విషయాన్ని కూడా చెప్పాలి. పులగం, పొంగలి ఒకటి కావు. ఒక కప్పు బియ్యం, ఒక కప్పు పెసరపప్పును రెండు కప్పుల నీటిలో ఉడికించి చేసేది పులగం. ఒక కప్పు బియ్యపు పిండి, ఒక కప్పు పెసరపప్పులను రెండు కప్పుల నీళ్లలో వేసి చేసేది పొంగలి. దీనిలో ఎవరికి కావాల్సినంత నెయ్యి వారు వేసుకోవచ్చు. ఇక తీపి పులగం విషయానికి వస్తే- బియ్యం, పెసరపప్పు, బెల్లం, కొబ్బరి, మిరియాలు, నెయ్యి, ఆవుపాలు వీటిని తగుపాళ్లలో కలిపి సన్నని సెగపై ఉడికించాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. తినటానికి చాలా రుచిగా కూడా ఉంటుంది.
Updated Date - Dec 14 , 2024 | 03:09 AM