నా కష్టం... వేరొకరికి రాకూడదని...
ABN, Publish Date - Oct 17 , 2024 | 07:09 AM
పదిహేనేళ్లకే పెళ్లి. పద్దెనిమిదేళ్లు నిండకుండానే ఒక బిడ్డకు తల్లి. వద్దు వద్దని మొత్తుకున్నా పుట్టింటివాళ్లు బరువు వదిలించుకున్నారు. అత్తింటివారు మాఇంటికి రావద్దని అన్నారు. అందరూ ఉండి ఒంటరి అయ్యారు 24 ఏళ్ల రోషిణీ పర్వీన్.
పదిహేనేళ్లకే పెళ్లి. పద్దెనిమిదేళ్లు నిండకుండానే ఒక బిడ్డకు తల్లి. వద్దు వద్దని మొత్తుకున్నా పుట్టింటివాళ్లు బరువు వదిలించుకున్నారు. అత్తింటివారు మాఇంటికి రావద్దని అన్నారు. అందరూ ఉండి ఒంటరి అయ్యారు 24 ఏళ్ల రోషిణీ పర్వీన్. కానీ ఆమె కుంగిపోలేదు. విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు. బాల్య వివాహాలను అరికడుతూ... ఎందరో బాలికల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు.
‘‘నా బాల్యం అంతా ముళ్ల బాటలోనే సాగింది. బాగా చదువుకొని... ఒకరిపై ఆధారపడకుండా నా బతుకు నేను బతుకుదామని అనుకున్నా. కానీ ఆ సంకల్పానికి మా అమ్మానాన్నలే విఘాతం కలిగించారు. బీహార్ రాష్ట్రం కిషన్‌గంజ్ జిల్లాలోని మారుమూల పల్లె సిమల్‌బారీలో ఓ సాధారణ కుటుంబం మాది. ఎనిమిదో తరగతి వరకు అంతా బాగానే సాగింది. ఎప్పుడైతే తొమ్మిదో తరగతిలోకి అడుగుపెట్టానో అప్పటి నుంచీ ఊహించని కష్టాలు వచ్చిపడ్డాయి. మా ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ‘ఇంకా పదో తరగతి కూడా పూర్తవ్వలేదు. అప్పుడే పెళ్లేంటి?’ అని అడిగాను. నాకు ఇంకా చదువుకోవాలని ఉందని, అప్పటివరకు ఓపిక పట్టమని ప్రాథేయపడ్డాను. అమ్మానాన్న వినలేదు. రోజూ ఎవరూ ఒకరు నన్ను చూడ్డానికి వచ్చేవారు. చాలా సంబంధాలు తిప్పి పంపాను. అయినా వాళ్ల ప్రయత్నం ఆగలేదు. చివరకు నా పోరాటం వృథా అయింది. బలవంతంగా పెళ్లి చేశారు. అది కూడా నాకంటే వయసులో మూడు రెట్లు పెద్దవాడితో. అప్పుడతనికి 45 సంవత్సరాలు. అత్తింటికి వెళ్లేవరకు అతని వయసు నాకు తెలియదు. వివాహ బంధం అంటే ఏంటో కూడా అవగాహన లేదు. వేధింపులు ఎక్కువయ్యాయి. దాంతో భయం వేసి మూడు నెలలకే మా ఇంటికి వెళ్లిపోయాను.
పుట్టింటివారూ పట్టించుకోలేదు...
కొన్నాళ్లకు తెలిసింది... నేను గర్భవతిని అని. తరువాత బాబు పుట్టాడు. భర్త దగ్గరకు వెళ్లమని అమ్మానాన్న చెప్పారు. నేను ఆ నరకంలోకి మళ్లీ వెళ్లాలనుకోలేదు. కానీ ఇంట్లోవాళ్లు బలవంతం చేశారు. వెళితే... అత్తింటివాళ్లు నన్ను లోపలికి రానివ్వలేదు. ఏడాది దూరంగా ఉన్నానని, అందుకే నేను తనకు వద్దని నా భర్త తెగేసి చెప్పాడు. మా ఇంట్లోవాళ్లు కూడా నన్ను రానివ్వలేదు. అందరూ ఉండి ఎవరూ లేని అనాథనయ్యాను. చంకలో పసి బిడ్డతో రోడ్డున పడ్డాను. అలాగని బాధతో కూర్చోలేదు. నా కాళ్ల మీద నేను నిలబడాలని ఆ క్షణమే బలంగా నిర్ణయించుకున్నాను.
బంధాలు తెంచుకుని...
నన్ను వద్దనుకున్న భర్త, నాకు ఆశ్రయం ఇవ్వని తల్లిదండ్రులు, సామాజిక కట్టుబాట్లు... బంధాలన్నిటినీ తెంచుకొని ధైర్యంగా అడుగు బయటకు వేశాను. నా కోసం, నా బిడ్డకు బంగారు భవిష్యత్తు కోసం కృషి చేయాలని సంకల్పించాను. తొలుత ఒక షోరూమ్‌లో హెల్పర్‌గా చేరాను. అదే సమయంలో ‘చైల్డ్‌లైన్ ఇండియా ఫౌండేషన్’లో వాలంటీర్‌గా పని చేశాను. అక్కడ నాలా భయంకరమైన కథలున్న మహిళలు చాలామందిని చూశాను. బాల్య వివాహానికి బలయింది నేనొక్కదాన్నే కాదని అప్పుడు అర్థమైంది. అలాంటి మహిళల గళం నేనెందుకు కాకూడదనే ఆలోచన వచ్చింది. నాటి నుంచి మహిళల హక్కుల సాధన, సాధికారత దిశగా అడుగులు వేశాను. ముఖ్యంగా బాల్య వివాహాలను నియంత్రించడంపై దృష్టి పెట్టాను.
పాఠశాలల్లో పునాది...
సమాజంలో రుగ్మతలు రూపుమాపి, బాల్య వివాహాలు అరికట్టాలంటే తల్లిదండ్రులతో పాటు బాలికలకు కూడా అవగాహన కల్పించాలి. ఆ ఉద్దేశంతోనే పలు గ్రామాల్లోని బాలికలతో పదిహేను బృందాలు ఏర్పాటు చేశాను. స్థానిక పెద్దలు, నాయకుల సాయం కూడా తీసుకున్నాను. వారందరి సహకారంతో ఎక్కడైనా బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తాను. ఎక్కడైనా అందుకు ఏర్పాట్లు జరుగుతుంటే తక్షణం వెళ్లి, పెద్దలతో మాట్లాడి ఆపడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ వినకపోతే తదనంతర పరిణామాల గురించి వివరిస్తాను. అప్పటికీ దారికి రాకపోతే పోలీసుల సహాయం తీసుకొంటాను.
ఇక్కడే ఎక్కువ...
‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే’ (ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స)-5 నివేదిక ప్రకారం... 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయసుగల ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరు 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేసుకున్నవారే. అంత చిన్న వయసులో వివాహ బంధంలోకి అడుగుపెట్టడంవల్ల వాళ్లు విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. అది వారికి జీవితాంతం ఒక మాయని గాయంలా మిగిలిపోతోంది. అలాగే మహిళల అక్రమ రవాణా కూడా పెద్ద సమస్యగా మారింది. వీటన్నిటిపైనా ఒక యుద్ధమే చేస్తున్నా. అమ్మాయిలు నిర్భయంగా తమ జీవితానికి ఏంకావాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛను కల్పించేందుకు కృషి చేస్తున్నా. స్వయంసాధికారత దిశగా వారిని నడిపించేందుకు నావంతు ప్రయత్నం ఇది.’’ ‘యునిసెఫ్’తో కలిసి...
‘సేవ్ ది చిల్డ్రన్, యునిసెఫ్’ తదితర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తూ వచ్చాను. ఆ క్రమంలో బీహార్‌లోని చాలా గ్రామాలు తిరిగాను. బాల్య వివాహాలవల్ల కలిగే అనర్థాలను తల్లిదండ్రులకు చెప్పాను. అది వారి భవిష్యత్తును మొగ్గలోనే చిదిమేస్తుందని, అది చట్టవిరుద్ధమని వివరించాను. ఫలితంగా ఇప్పటికి పదుల సంఖ్యలో బాల్య వివాహాలు ఆపగలిగాను. నా ప్రయత్నానికి ప్రోత్సాహకంగా రెండేళ్ల కిందట జెనీవాలో జరిగిన సదస్సులో ‘యునైటెడ్ నేషన్స్’ నాకు ప్రతిష్టాత్మక అవార్డునిచ్చి సత్కరించింది. సమాజంలో పాతుకుపోయిన కట్టుబాట్లను దాటి, మహిళల జీవితాల్లో మంచి మార్పునకు కృషి చేస్తున్నందుకుగానూ నన్ను కొనియాడింది.
Updated Date - Oct 17 , 2024 | 07:09 AM