Yakshagana Art: ఆమె కళ.. నాన్న కల
ABN, Publish Date - Nov 21 , 2024 | 06:31 AM
పురుషులదే ఆధిపత్యమైన యక్షగాన కళలో నిష్ణాతురాలు కావడమే కాదు...తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి... కళావ్యాప్తికి అంకితమయ్యారు ప్రియాంకా మోహన్ యక్షగాన బోధకురాలుగా వేలమంది పిల్లలను తీర్చిదిద్దారు. తన ప్రదర్శనలతో సామాజిక చైతన్యానికి దోహదం చేస్తున్నారు.రాబోయే తరాల్లో ఈ కళకు మరింత ప్రాచుర్యం కల్పించడమే తన లక్ష్యం అంటున్న ప్రియాంక కథ... ఆమె మాటల్లోనే...
పురుషులదే ఆధిపత్యమైన యక్షగాన కళలో నిష్ణాతురాలు కావడమే కాదు...తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి... కళావ్యాప్తికి అంకితమయ్యారు ప్రియాంకా మోహన్ యక్షగాన బోధకురాలుగా వేలమంది పిల్లలను తీర్చిదిద్దారు. తన ప్రదర్శనలతో సామాజిక చైతన్యానికి దోహదం చేస్తున్నారు.రాబోయే తరాల్లో ఈ కళకు మరింత ప్రాచుర్యం కల్పించడమే తన లక్ష్యం అంటున్న ప్రియాంక కథ... ఆమె మాటల్లోనే...
‘‘యక్షగానం... నా నరనరాల్లో జీర్ణించుకుపోయిన కళారూపం. మా పూర్వీకులది దక్షిణ కర్ణాటకలోని ఉడుపి జిల్లా సాలిగ్రామ. అది యక్షగాన కళకు ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం. మా నాన్న కె.మోహన్ అందులో నిష్ణాతులు. పట్టణ ప్రాంతాల్లో ఆ కళను వ్యాప్తి చేయాలనే తపనతో... 1970ల్లో ఆయన బెంగళూరుకు వలస వచ్చారు. ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు ఎందరికో శిక్షణ ఇచ్చేవారు. 1981లో ‘యక్షదేగుల’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. రెండు పడక గదుల మా ఇంట్లో ఎప్పుడూ 20, 30 మందికి తక్కువ కాకుండా శిష్యులు ఉండేవారు. అందరికీ భోజన ఏర్పాట్లు మా అమ్మ, నాయనమ్మ చేసేవారు. నేను, నా చెల్లెలు ప్రీతి ఇదంతా చూస్తూ పెరిగాం.
అందరూ వ్యతిరేకించారు...
మమ్మల్ని మంచి కళాకారులుగా, యక్షగానంలో తనకు వారసులుగా తీర్చిదిద్దాలని మా నాన్న తపన పడేవారు. ఒక రోజు నన్ను, ప్రీతిని పిలిచి ‘‘రేపటి నుంచి మీరు కూడా శిక్షణ తీసుకోబోతున్నారు’’ అని చెప్పారు. నాకు, ప్రీతికి అది ఇష్టమే. కానీ దానికి మా బంధువుల నుంచి, మా కుటుంబ సన్నిహితుల నుంచే కాదు ఆఖరికి ఆయన శిష్యుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ‘యక్షగానం అంటే పురుషులకే పరిమితం’ అనే భావన చాలా బలంగా ఉండేది. కానీ నాన్న తన నిర్ణయానికే కట్టుబడ్డారు. ‘‘నా కుమార్తెలు ప్రదర్శనలు ఇవ్వలేకపోయినా... ఆ కళను ఏదో విధంగా ముందుకు నడిపిస్తారు’’ అని స్పష్టం చేశారు.
మాకు నేర్పడం మొదలుపెట్టారు. ఈ సంగతి తెలిసి... చుట్టుపక్కల వారు కూడా వారి అమ్మాయిలను చేర్చడం ప్రారంభించారు. రెండేళ్ళ తరువాత... అందరూ పిల్లలే ప్రదర్శించే ‘మక్కళమేళ’ అనే కార్యక్రమంలో... నేను, ప్రీతి తొలి ప్రదర్శన ఇచ్చాం. ఒక వైపు చదువు, మరోవైపు ప్రదర్శనలు... ఇలా కొన్నేళ్ళపాటు సాగింది. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. నాకన్నా ప్రీతి ఎంతో శ్రద్ధగా నేర్చుకొనేది. చాలా ప్రదర్శనల్లో తనే ప్రధాన పాత్ర పోషించేది. నేను పదోతరగతికి వచ్చేసరికి మేము 300 వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాం. నాన్న ప్రోత్సాహంతో అప్పుడప్పుడు పిల్లలకు శిక్షణ ఇచ్చేదాన్ని తప్ప గురువుగా మారే ఆలోచన నాకు మొదట్లో లేదు. కానీ నా గురించి తెలిసిన మా కళాశాల అధ్యాపకులు... నా తోటి విద్యార్థులకు యక్షగాన రీతులను బోధించాలని అడిగారు. ఇంటి బయట ఎవరికైనా నేర్పడం అదే తొలిసారి. ఇది నాకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడమే కాదు, నా నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచింది.
అంతా ఉచితంగానే..
నేను బిటెక్ చేశాను. ‘విప్రో’ తదితర సంస్థల్లో ఉద్యోగాలు చేశాను. ప్రీతి డాక్టర్ అయింది. తను ప్రదర్శనలు ఇవ్వడం తప్ప శిక్షకురాలుగా ఉండలేని పరిస్థితి. ఒకసారి మా ‘యక్షదేగుల’లో శిక్షణ పొందిన తొలి బ్యాచ్ పిల్లలం అందరం ఒక చోట కలుసుకున్నాం. నాన్న తరువాత ఆ సంస్థను ఎవరు నడిపిస్తారనే ప్రశ్న చాలామంది అడిగారు. నేను ఆలోచనలో పడ్డాను. ‘నేను చేస్తున్న ఉద్యోగంతో నిజంగానే సంతృప్తిగా ఉన్నానా?’ అని ప్రశ్నించుకున్నాను. ‘లేదు’ అనిపించింది. ఆ యక్షగానం పట్ల అవగాహన పెంపొందించడం, దేశ, విదేశాల్లో దాని ఖ్యాతిని చాటి చెప్పడం, రాబోయే తరాలకు ఆ కళను అందించడం... ఇవీ నాన్న ఆశయాలు. ఆయన బిడ్డగా ఆ ఆశయాలను కొనసాగించవలసిన బాధ్యత నా మీద ఉందనిపించింది. ఉద్యోగానికి రాజీనామా చేసి... పూర్తిస్థాయి కళాకారిణిగా, శిక్షకురాలుగా స్థిరపడ్డాను. నేను తీసుకున్నది చిన్న బాధ్యత కాదని నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్న ఇన్నేళ్ళుగా... శిక్షణ ఇవ్వడానికి ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గరా తీసుకోలేదు. పూర్తిగా ఉచితంగానే బోధించారు. మేము కూడా దాన్నే కొనసాగిస్తున్నాం.
గురువుగా నన్ను ఆమోదించలేదు...
ఇప్పటివరకూ నేను యక్షగానంలో రెండువేలమందికి పైగా శిక్షణ ఇచ్చాను. ఈ కళని బోధించే అతి కొద్దిమంది మహిళల్లో నేనొకర్ని. నన్ను గురువుగా ఈ రంగంలో ఉన్న వారు ఆమోదించలేదు. కానీ ఇప్పుడు అందరూ గౌరవిస్తున్నారు. ప్రదర్శనల విషయానికి వస్తే... నేను పురుష, స్త్రీ పాత్రలన్నీ వేస్తూ ఉంటాను. హాస్యపాత్రలంటే నాకు బాగా ఇష్టం. యక్షగాన కళ భక్తి ప్రధానంగా ఉంటుంది. పౌరాణిక కథలే ఎక్కువగా ఉంటాయి. అయితే సామాజిక సమస్యల గురించి చర్చించడానికి ఈ కళను ఒక సాధనంగా కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఎంపిక చేసింది. ఆ శాఖ తరఫున కొన్ని ప్రదర్శనలు కూడా ఇచ్చాం. ఆ తరువాత... కొవిడ్ వ్యాపించిన సందర్భంగా... గ్రామాల్లో తిరిగి మా ప్రదర్శనలతో ప్రజలకు అవగాహన కల్పించాం. సమకాలీన అంశాలకు చోటు కల్పించినప్పుడు, ప్రజల్లో చైతన్యం కలిగించి, ఆలోచనలు రేకెత్తించినప్పుడు ఏ కళ అయినా ఎక్కువ ఆదరణకు నోచుకుంటుందనేది నా విశ్వాసం. అందుకే వీలైనంత వరకూ సామాజికమైన విషయాలు ఉండేలా కార్యక్రమాలను రూపొందిస్తూ ఉంటాను. ఇప్పటివరకూ నేను, నా శిష్య బృందాలు దేశ, విదేశాల్లో ఏడు వేలవరకూ ప్రదర్శనలు ఇచ్చాం. ఇటీవల ‘కాంతారా’ లాంటి సినిమాల వల్ల యక్షగాన ప్రదర్శనలకు ఆదరణ పెరిగింది. నేర్చుకోవాలనే ఆసక్తి కూడా ఎక్కువమందిలో కలుగుతోంది. ఇది మంచి పరిణామం.’’
Updated Date - Nov 21 , 2024 | 06:32 AM