ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మరుగునపడ్డ తెలుగు రాణి

ABN, Publish Date - Nov 27 , 2024 | 01:15 AM

మహారాణి మంగమ్మ... ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మదురై రాజధానిగా పాలించిన నాయక రాజుల వంశానికి చెందిన ఈ తెలుగు రాణి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ.

హారాణి మంగమ్మ... ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మదురై రాజధానిగా పాలించిన నాయక రాజుల వంశానికి చెందిన ఈ తెలుగు రాణి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. తాజాగా ఆమె గురించి... ‘మధుర మహారాణి మంగమ్మ’ అనే పరిశోఽధనాత్మక చారిత్రక నవల వెలువడింది. ‘ఇందులో 80 శాతం చారిత్రక సత్యాలే’ అంటారు ఆ నవలా రచయిత... డాక్టర్‌ సగిలి సుధారాణి.

ఆ విశేషాలను ఆమె ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘నేను పుట్టి పెరిగింది తిరుపతిలో. పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు వచ్చాను. తెలుగు విశ్వవిద్యాలయంలో ‘చిత్తూరు జిల్లా మహిళల సంప్రదాయ గేయాలు’ అనే అంశంపై పరిశోధన చేశాను. ఆ తర్వాత చెన్నైకు వెళ్లాను. ‘ద్రావిడ విశ్వవిద్యాలయం’లో పీహెచ్‌డీ చేయాలనుకున్నప్పుడు... ‘జానపద మౌఖిక సాహిత్యం’ అనే అంశంపై పరిశోధన ప్రారంభించాను. చెన్నైలో ఇళ్లలో పని చేసేవారు, ధారాళంగా తెలుగు మాట్లాడేవాళ్లకు కూడా తెలుగు రాయటం రాదు. రెండు మూడు శాతం మందికి, అది కూడా విశ్వవిద్యాయాల్లో చదివేవారికి మాత్రమే రాయటం కూడా వస్తుంది. నేను మౌఖికంగా తరతరాలుగా వస్తున్న జానపద సాహిత్యాన్ని సేకరిస్తున్నప్పుడు... అక్కడ అనేక తెలుగు పదాలు ఉన్నాయని తెలిసింది.

క రోజు నేను చెన్నై నుంచి ప్రయాణిస్తుంటే మధ్యలో ‘మంగమ్మ సాలై’ (మంగమ్మ రోడ్డు) వచ్చింది. ఆ పేరు నన్ను ఆకర్షించింది. రహదారికి ‘మంగమ్మ’ పేరు ఎందుకు పెట్టారనే ప్రశ్న తలెత్తింది. దానికి సమాధానం వెతికితే... ఆమె నాయకరాజుల సమయంలో ఒక మహారాణి అని, భర్త, కొడుకు, మనవడు రాజ్యాన్ని పాలిస్తున్న సమయంలో ఆమె కీలకమైన పాత్ర పోషించిందనే విషయం తెలిసింది. మరింతగా లోతుకు వెళితే... ఆమె తెలుగు రాణి అని కూడా అర్థమయింది.


ఎన్నో ప్రశ్నలు...

నా పరిశోధన పూర్తి అయిన తర్వాత ‘తమిళనాట తెలుగు ప్రజల జానపద విజ్ఞానం’ అనే గ్రంథం తీసుకువచ్చాను. దీనికి మంచి ప్రశంసలు లభించాయి. ఈ పుస్తకం చూసిన శ్రీ రంగాచారి అనే పరిశోధకుడు- తనవద్ద ఉన్న ఒక పుస్తకాన్ని పంపించారు. అది మహారాణి మంగమ్మకు సంబంధించిన పుస్తకం. దాన్ని రచయిత్రి రూపాబాయి మోతీలాల్‌ తెలుగులో రాశారు. ‘కట్టబొమ్మన నాయకుడు’ పేరిట ఆమె ఒక తెలుగు వార పత్రికలో ధారావాహిక రాశారు. కట్టబొమ్మన తెలుగువాడని ఆమె ఈ ధారావాహికలో నిరూపించారు. మహారాణి మంగమ్మపై రూపాబాయి రాసిన పుస్తకం చదివిన తర్వాత నాలో అనేక రకాల ప్రశ్నలు తలెత్తాయి. వాస్తవానికి ఇప్పుడు భౌగోళిక ప్రాంతాల ఆధారంగా వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పాడ్డాం కానీ ఒకప్పుడు తెలుగువారందరూ కలిసే ఉండేవారు. తెలుగువారు అనేక ప్రాంతాలను పాలించారు కూడా! స్థూలంగా ఆ చరిత్రను విశ్లేషించాలనే ఉత్సుకత ఈ మధ్యకాలంలో తగ్గిపోతోంది. దీనివల్ల చరిత్రలో కీలక భూమికను పోషించినవారు కనుమరుగు అవుతున్నారు. దీన్ని భవిష్యత్తు తరాలవారికి అందించాలనే ఉద్దేశంతో ఆ ప్రతిని పరిష్కరించి ‘మధుర మహారాణి మంగమ్మ’ అనే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చాను.

ఊహల్లో రాణి కాదు...

ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. సాధారణంగా మహారాణి మంగమ్మ అనగానే చాలామంది శత్రువులతో యుద్ధం చేసిన వీరనారి అనుకుంటారు. కానీ మంగమ్మ కండ బలం కన్నా బుద్ధి బలాన్ని ఉపయోగించి రాజ్యాన్ని కొనసాగేలా చేసింది. మంగమ్మ భర్త చొక్కనాథ నాయకుడు. కొన్ని పరిస్థితులవల్ల ఆయన చెరసాలలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో భర్తకు సాయం చేసి, రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకుంది మంగమ్మ. ఆయన రాజ్యాధికారానికి వచ్చిన కొద్ది రోజులకే చొక్కనాథ నాయకుడు మరణించాడు. అప్పటికి మంగమ్మ గర్భవతి. ఆ నాటి సంప్రదాయమైన సతీసహగమనం చేయకుండా మంగమ్మ కుమారుడికి జన్మనిచ్చింది. రాజమాతగా తన కొడుకు సింహాసనాన్ని అధిష్టించేలా చేసింది. దురదృష్టమేమిటంటే... కోడలు గర్భవతిగా ఉన్న సమయంలో కొడుకు కూడా చనిపోతాడు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కోడలు చనిపోతుంది. కానీ తన మనవడికి రాజ్యాన్ని అప్పగించి... అతనికి యుక్త వయస్సు వచ్చే దాకా రాజమాతగా పరిపాలిస్తుంది. ఇలా భర్త, కొడుకు, మనమడి రాజ్యాధికార సమయంలో మంగమ్మ కీలకమైన పాత్ర పోషించింది. నాయకరాజుల వారసత్వం కొనసాగేలా చేసింది. అందుకే ఇప్పటికీ మదురై, తిరుచ్చి, శ్రీరంగం ప్రాంతాల్లో మహారాణి మంగమ్మ గురించి కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికీ మంగమ్మ రాయించిన తెలుగు శాసనాలు కూడా ఉన్నాయి.


పేరెందుకు రాలేదు?

‘మహారాణి మంగమ్మకు ఇతర రాజుల స్థాయిలో పేరు ఎందుకు రాలేదు’ అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. బహుశా పురుషాధిక్య చరిత్రలో ఆమెకు సముచిత స్థానం లభించలేదేమో. ఆమె వేయించిన రహదారులు ఇప్పటికీ తమిళనాట ప్రజలు వాడుతున్నారు. ఆమె సమాజహితం కోసం చేసిన పనుల గురించి శాసనాలు ఉన్నాయి. కానీ మౌఖిక చరిత్రలో ఆమె గురించి అనేక అవాస్తవాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె అక్రమ సంబంఽధం పెట్టుకుందని, చేసిన మంచి పనులన్నింటి వెనక వ్యక్తిగత స్వార్థం ఉందనే రీతిలో కథలు ప్రచారంలోకి వచ్చాయి. బహుశా దీనివల్ల ఆమెకు తగినంత ప్రాముఖ్యత లభించి ఉండకపోవచ్చు.

అందుకే తక్కువ...

మన దగ్గర పరిశోధనలు చేసే మహిళలు తక్కువ. దీనికి రెండు కారణాలున్నాయి. వివాహం కాకముందు- యువతులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండాలి. వారు భద్రంగా ఉంటారని తల్లిదండ్రులు నమ్మాలి. మన సమాజంలో అమ్మాయిలు స్వేచ్ఛగా దూర ప్రాంతాలకు వెళ్లటానికి అనుమతులు లభించవు. విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థిక సాయం చేస్తే, వారు స్వేచ్ఛగా పరిశోధనలు చేసుకోగలుగుతారు. వివాహం అయిన తర్వాత ఇంకొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. భర్త, పిల్లలు అనేక కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయితే వ్యక్తిగతమైన ఆసక్తి ఉంటే పరిశోధనలు సులభంగానే చేయవచ్చు. దీనికి నేనే నిదర్శనమని చెప్పవచ్చు.’’

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌


మంగమ్మ కథ...

మహారాణి మంగమ్మ 17వ శతాబ్దంలో మధురను పాలించిన తెలుగు రాణి. ఈమె పూర్వీకులు చంద్రగిరికి చెందివారు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం తంజావూరు, మధుర, పుదుక్కోట, సెంజి, మైసూరు పాలకులు స్వతంత్రులయ్యారు. వీరిలో నాయక రాజులు- మధుర, తిరుచ్చి రాజధానులుగా సుమారు 200 సంవత్సరాలు పాలించారు. వీరిలో విశ్వనాథ నాయకుడు, తిరుమలనాయకుడు, చొక్కనాథ నాయకుడు, మహారాణి మంగమ్మ ముఖ్యులు. రాణీ మీనాక్షి కాలంలో నాయకరాజుల పాలన అంతరించిపోయింది. మంగమ్మ గురించి ఆ ప్రాంతాల్లో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ‘చిక్క దేవరాయులు (మైసూరు పాలకుడు) లాగా కూడబెట్టి పిసినారిలా జీవించేకన్నా... దానధర్మాలు చేసి మంగమ్మలా బతకాలి’ అనే నానుడి ఇప్పటికీ ప్రచారంలో ఉంది.

సేవకులు అనడం సరికాదు...

మిళనాడులోని అనేక ప్రాంతాలను తెలుగు రాజులు పాలించారు. వారి సమయంలో రాజభాష తెలుగే. అనేకమంది ప్రజలు తెలుగు మాట్లాడేవారు. ఈ రాజులకు సేవ చేయటానికి తెలుగు ప్రాంతాల నుంచి అనేక మంది తరలి వెళ్లారు. వీరిలో అనేక వృత్తులవారు ఉన్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి అక్కడి రాజులకు సేవ చేశారనటం సరికాదు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మనం కులాంతర, మతాంతర వివాహాలు విన్నాం. కానీ భాషాంతీకరణ జరిగిందనిపిస్తుంది. అంటే అక్కడ నివసించే తెలుగు ఇంటి పేర్లు కనుమరుగైపోతున్నాయి. సాధారణంగా తెలుగువారు తమ ఇంటి పేరును ముందు పెట్టుకుంటారు. వారి కుటుంబ అస్థిత్వం ఆ ఇంటి పేరు నుంచే వస్తుంది. తమిళులు తమ తండ్రి పేరును తమ పేరు చివరన పెట్టుకుంటారు. ఇలా పేరు పెట్టుకుంటే వారికి కొన్ని సదుపాయాలు లభిస్తాయి. దానితో చాలా మంది తెలుగువారు తమ ఇంటి పేరును వదిలేసి చివరలో తండ్రి పేరు పెట్టుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే తమిళనాడులో తెలుగువారు చాలా ఎక్కువ మంది ఉంటారు.

Updated Date - Nov 27 , 2024 | 01:16 AM