ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sabalenka : రాకెట్‌లా దూసుకెళుతూ...

ABN, Publish Date - Sep 11 , 2024 | 03:33 AM

ఈ ఏడాది మార్చిలో సబలెంక మాజీ ప్రియుడు, ఐస్‌ హాకీ క్రీడాకారుడైన 42 ఏళ్ల కాన్‌స్టాన్టిన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే ఇద్దరూ విడిపోయినా... ఆ ఘటన ఆమెను తీవ్ర మనోవేదనకు గురి చేసింది.

  • విజయం ఎప్పుడూ మధురమే.

  • కానీ దానికి పునాది ఓటమి.

  • ఈ చేదు నిజం... బెలారస్‌ టెన్నిస్‌ తార

  • అరినా సబలెంక అనుభవ పాఠం.

  • అందుకే ఓడిన ప్రతిసారీ కెరటంలా ఉవ్వెత్తున ఎగసింది.

  • పట్టు వదలని ప్రయత్నంతో... మూడేళ్లుగా ఊరిస్తున్న యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను ముద్దాడింది.

  • ఆమె ప్రయాణంలో గెలుపు మజిలీలే కాదు... నోరు జారి కొని తెచ్చుకున్న వివాదాలు... మోడల్‌ను తలపించే ఫ్యాషన్‌ పరేడ్‌లూ... ఇంకా ఎన్నో ఉన్నాయి.

ఏడాది మార్చిలో సబలెంక మాజీ ప్రియుడు, ఐస్‌ హాకీ క్రీడాకారుడైన 42 ఏళ్ల కాన్‌స్టాన్టిన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే ఇద్దరూ విడిపోయినా... ఆ ఘటన ఆమెను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. తన బాధను బహిరంగంగానే వ్యక్తం చేసింది. కానీ అంతటి విషాదంలోనూ... రాకెట్‌ పట్టి... ఆట కొనసాగించింది. అన్నిటికీ మించి మూడేళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది. 2021లో ఈ టోర్నీ సెమీస్‌ వరకు వచ్చి నిరాశపర్చిన సబలెంక... మరుసటి ఏడాది కూడా అదే స్థానంతో సరిపెట్టుకుంది. అయితే గత ఏడాది మరో మెట్టు ఎక్కింది. తుది పోరుకు చేరి... రన్నర్‌పగా నిలిచింది. టైటిల్‌ సాధించాలన్న ఆమె కల మరోసారి నెరవేరలేదు. అలాగని అంతటితో ఆట అయిపోలేదు. మరింత ఫామ్‌ను సంతరించుకున్న సబలెంక... ఈ ఏడాది ఆరంభంలో ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ గెలిచి... టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఎలాగైనా ఈసారి యూఎస్‌ ఓపెన్‌ కప్‌ను ముద్దాడాలన్న సకల్పంతో కఠోరంగా శ్రమించింది. దాని కోసం ఒలింపిక్స్‌ను సైతం త్యాగం చేసింది.

  • కల నెరవేరిన వేళ...

మాజీ ప్రియుడు చనిపోయిన తరువాత సబలెంక ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌. ఒక్క మ్యాచ్‌ మినహా ఫైనల్‌తో సహా ఆమె వరుస సెట్లలో ప్రత్యర్థులను మట్టి కరిపించింది. జెస్సికా పెగులాతో జరిగిన అంతిమ పోరు తొలి సెట్‌లో సర్వీస్‌ కోల్పోయి తడబడింది. ఇక సెట్‌ గెలవడం కష్టం అనుకున్న దశలో చెలరేగింది. వరుసగా ఐదు పాయింట్లు గెలిచి, సెట్‌నూ సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో కూడా పెగులా నుంచి గట్టి పోటీ ఎదురైనా, అనుభవంతో దాన్ని అధిగమించి తన ఖాతాలో తొలి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను వేసుకుంది. కలల ట్రోఫీతో పాటు 3.6 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీని ఇంటికి తీసుకువెళ్లింది. అంతేకాదు, ఒకే ఏడాది ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఐదో మహిళగా ఆమె రికార్డులకు ఎక్కింది.


  • ‘నన్ను చూసి నేనే గర్వపడుతున్నా’...

మ్యాచ్‌ అనంతరం ఎంతో భావోద్వేగానికి లోనైన సబలెంక... ‘నన్ను చూసి నేనే గర్వపడుతున్నా. ఇలా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఈ విజయం నాకు అంతటి సంతృప్తిని, సంతోషాన్ని, నాపై నాకు ఎనలేని నమ్మకాన్ని ఇచ్చింది. నా కల నెరవేర్చుకొనే దిశలో నా నమ్మకాన్ని నేను ఎప్పుడూ కోల్పోలేదు’ అంటూ తన ఉద్వేగంగా చెప్పిన సబలెంక... ఈ గెలుపును తన కుటుంబానికి అంకితమిచ్చింది. ‘నా ఉన్నతి కోసం ఎంతో శ్రమించిన మా నాన్న చనిపోయినప్పటి నుంచి నా లక్ష్యం ఒక్కటే... టెన్నిస్‌ చరిత్రలో మా కుటుంబం పేరు చిరస్థాయిగా నిలవాలని. ట్రోఫీ మీద నా పేరు చూసిన ప్రతిసారీ నా కుటుంబాన్ని చూసి గర్వపడతా. నా కలలను వారివిగా చేసుకుని, అన్నింటా మద్దతుగా నిలిచి, ఎంతో ప్రోత్సహించారు’ అంటూ ఉద్వేగానికి గురైంది 26 ఏళ్ల సబలెంక.ఐదేళ్ల కిందట అనారోగ్యంతో ఆమె తండ్రి సెర్గే మరణించారు. ఆయన ఐస్‌ హాకీ ఆటగాడు.


  • అనుకోకుండా అలా...

బెలారస్‌ రాజధాని మిన్‌‌స్క్ నగరంలో పుట్టిన సబలెంక అనూహ్యంగా టెన్నిస్‌ రాకెట్‌ పట్టింది. ‘ఒక రోజు నాన్నతో కలిసి కారులో వెళుతుంటే... దారిలో టెన్నిస్‌ కోర్టులు కనిపించాయి. వెంటనే నన్ను అక్కడికి తీసుకువెళ్లారు. కోర్టుతో పాటు ఆట కూడా నాకు బాగా నచ్చింది. ఆ రోజంతా అక్కడ ఉత్సాహంగా గడిచిపోయింది. బాగా ఆస్వాదించాను. అలా టెన్నిస్‌ రాకెట్‌ పట్టాను. నాలోని ప్రతిభ చూసి 2014లో నాన్న నన్ను తీసుకువెళ్లి స్థానిక ‘జాతీయ టెన్నిస్‌ అకాడమీ’లో చేర్చారు. మరుసటి ఏడాది చిన్న చిన్న టోర్నమెంట్లలో పాల్గొన్నాను. ఐటీఎఫ్‌ దిగువ స్థాయి పోటీల్లో డబుల్స్‌, సింగిల్స్‌ ఆడుతూ వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చిన సబలెంక... అంతకు రెండేళ్ల ముందే జూనియర్స్‌కు అర్హతా ఉన్నా... ఐటీఎఫ్‌ ఉమెన్స్‌ సర్క్యూట్‌లో పోటీపడింది.


  • డబుల్స్‌తో మొదలుపెట్టి...

సబలెంక పేరు దేశ వ్యాప్తంగా పరిచయం అయింది 2017లో. ఆమె సారథ్యంలోని బెలారస్‌ ‘ఫెడ్‌ కప్‌’ టీమ్‌ రన్నర్‌పగా నిలిచింది. టాప్‌ 75 ర్యాంకుల్లో లేని జట్టు గెలుపు... అప్పట్లో సంచలనంగా మారింది. తరువాత అద్భుత విజయాలు నమోదు చేసుకున్న సబలెంక... 2018, 19 ప్రపంచ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో పదకొండో స్థానానికి ఎగబాకింది. రెండేళ్లకు రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 2023లో ఆమె కెరీర్‌లోనే పెద్ద మలుపు. ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ గెలిచి, తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన పేరిట లిఖించుకుంది. ఈ ఏడాది ఆ టైటిల్‌ను నెలబ్టుకోవడమే కాకుండా... ఎప్పటి నుంచో ఊరిస్తున్న యూఎస్‌ ఓపెన్‌ కూడా నెగ్గడం... సబలెంకలోని దీక్షాదక్షతకు నిదర్శనం. వీటికి ముందు ఆమె... ఎలైజ్‌ మెర్టెన్స్‌తో జతకట్టి యూఎస్‌ ఓపెన్‌ (2019), ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ (2021) డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గింది. సబలెంక కెరీర్‌లో ఇప్పటికి మొత్తం 22 టైటిల్స్‌ ఉన్నాయి. అందులో 16 సింగిల్స్‌, 6 డబుల్స్‌ టైటిల్స్‌. గత ఏడాది ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌కు దూసుకుపోయిన ఆమె... ప్రస్తుతం రెండో ర్యాంక్‌లో కొనసాగుతోంది.


  • ‘ది వారియర్‌ ప్రిన్సెస్‌’...

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా, బెలారస్‌ క్రీడాకారులకు స్పాన్సర్లు దొరక్క ఇబ్బంది పుడుతున్న తరుణంలోనూ... సబలెంక బడా బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ప్రముఖ వెల్‌నెస్‌ బ్రాండ్స్‌లో పెట్టుబడులు కూడా పెట్టింది. టెన్నిస్‌ కోర్టులో శక్తిమంతమైన షాట్లతో ప్రత్యర్థులతో ఎంతలా ఆడేసుకొంటుందో... కోర్టు బయట విభిన్న ఆహార్యంతో అంతగా మతి పోగొడుతుంది. మోడల్స్‌కు మించిన ట్రెండీ టచ్‌తో నిత్యం తన అభిమానులకు పండగ చేస్తుంది. ఇన్‌స్టాలో ఆమెకు దాదాపు పాతిక లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన అనుభవాలను ఇన్‌స్టాలో పంచుకొంటూ... ఔత్సాహికుల్లో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతుంది. టెన్నిస్‌ సర్కిల్‌లో ‘ది వారియర్‌ ప్రిన్సె్‌స’గా పేరు గడించిన ఈ తార... ప్రస్తుతం బ్రెజిల్‌కు చెందిన ‘ఓక్‌బెర్రీ’ బ్రాండ్‌ అధిపతి జార్జియస్‌ ఫ్రాంగులిస్‌ ప్రేమలో మునిగి తేలుతోంది.


  • వివాదాలకు కేంద్రం...

2023లో ‘ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌’ (ఐటీఎఫ్‌) నుంచి ప్రతిష్టాత్మక ‘ప్రపంచ చాంపియన్‌ అవార్డు’ను అందుకున్న సబలెంక... బలమైన సర్వ్‌, గ్రౌండ్‌ స్ర్టోక్స్‌కు పెట్టింది పేరు. దూకుడుగా ఆడడం ఆమె శైలి. కోర్టులో ఉన్నంతసేపూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే సబలెంక పేరు... నిత్యం ఏదో ఒక వివాదంలో వినిపిస్తుంటుంది. అందుకు ప్రధాన కారణం ఆమె నోటి దురుసు అనేది పలువురు సీనియర్ల మాట. ఒక మాజీ టెన్నిస్‌ ఆటగాడితో ముఖాముఖీలో కూడా అభ్యంతరకర పదం ఉపయోగించి మరోసారి అందరి నోట్లో నానింది. ఎందుకలా అని అడిగితే... ‘బహుశా అది నా రక్తంలోనే ఉందేమో’ అంటూ నవ్వేస్తుంది ఈ బెలారస్‌ భామ.

Updated Date - Sep 11 , 2024 | 03:33 AM

Advertising
Advertising