ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీలలితా సహస్రంలో యోగ రహస్యాలు

ABN, Publish Date - Oct 04 , 2024 | 12:07 AM

శ్రీ లలితా సహస్ర నామం ఆవిర్భావం గురించి ఒక కథ ఉంది. తనకు అత్యంత రహస్యమైన సహస్రనామాలను ఉపదేశించవలసిందిగా శ్రీ మహావిష్ణువు అవతారమైన హయగ్రీవుణ్ణి అగస్త్య మహర్షి కోరాడు. అప్పుడు హయగ్రీవుడు లలితా సహస్రనామాలకు అనంతమైన శక్తి ఉంది కాబట్టి యోగ్యులైన

శ్రీ లలితా సహస్ర నామం ఆవిర్భావం గురించి ఒక కథ ఉంది. తనకు అత్యంత రహస్యమైన సహస్రనామాలను ఉపదేశించవలసిందిగా శ్రీ మహావిష్ణువు అవతారమైన హయగ్రీవుణ్ణి అగస్త్య మహర్షి కోరాడు. అప్పుడు హయగ్రీవుడు లలితా సహస్రనామాలకు అనంతమైన శక్తి ఉంది కాబట్టి యోగ్యులైన పుణ్యాత్ములకు మాత్రమే దాన్ని తెలియజేయాలనే సూచనతో... శ్రీలలితా సహస్రనామ మూలాన్ని అగస్త్యుడికి ఉపదేశించాడు. దానికి స్వరకర్తలు వాసిని తదితర వాగ్దేవతలు. శ్రీలలితా దేవి ఆజ్ఞపై వారు లలితా సహస్ర నామ స్తోత్రాన్ని రచించారు. రహస్యమైన మంత్రాలతో కూడిన వెయ్యి నామాలను సమకూర్చారు. దాన్ని సాక్షాత్తూ శ్రీ లలితాదేవి సమక్షంలో వారు, ఇతర దేవతలు పఠించారు. అది విని ముగ్ధురాలైన అమ్మవారు... ‘‘ఈ నామాలను ఎవరు అనుసరిస్తారో, అర్థం తెలుసుకొని ఆచరిస్తారో, రోజూ ఎవరు ఈ స్తోత్రాన్ని చదువుతారో వారి పట్ల నేను ప్రీతిని కలిగి ఉంటాను. వారి యోగక్షేమాలను స్వయంగా చూసుకుంటాను’’ అని ప్రకటించారు. ఈ స్తోత్రం అన్ని రకాల సమస్యలకు శక్తిమంతమైన పరిష్కారమని శ్రీ మాతాజీ నిర్మలాదేవి చెప్పారు. ఈ స్తోత్రం ‘బ్రహ్మాండపురాణం’లోని 36వ అధ్యాయంలో... ‘లలితోపాఖ్యానం’లో ఉంది. అందులో శ్రీలలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగా, సృష్టిస్థితి లయాధికారిణిగా వర్ణించారు. ఈ స్తోత్రం గురించి తెలియనివారు ఉండరు. నిత్యపారాయణ చేసేవారు చాలామంది ఉంటారు. కానీ అమ్మవారి నామాలను అర్థం చేసుకొని, వాటిని ధ్యానంలో ప్రత్యక్షంగా అనుభూతి చెందుతూ, అనన్యమైన భక్తిశ్రద్ధలతో పారాయణ చేసేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. జాగ్రత్తగా గమనిస్తే... మన సూక్ష్మ శరీరంలో ఉన్న వివిధ శక్తి కేంద్రాలు లేదా చక్రాల దగ్గర... శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ఏ విధంగా కొలువై ఉంటారో ఈ స్తోత్రంలో వర్ణించి ఉంది. ఈ చక్రాలన్నీ మన శరీరంలోనే ఉన్నాయి. అంటే మన దేహంలోనే వివిధ చక్రాలలో, విభిన్న రూపాలలో అమ్మవారు కొలువై ఉన్నారు. ఆమె శక్తి గద్వారానే మానవుని సూక్ష్మ శరీరంతో పాటు అండపిండ బ్రహ్మాండాలతో నిండిన ఈ చరాచర జగత్తు సమస్తం నడుస్తోంది.


ఈ స్తోత్రంలో అమ్మవారిని ‘అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా’ అని వర్ణిస్తారు. అంటే మన చిత్తం బహిర్ముఖమై ఉన్నప్పుడు ఆ తల్లిని చేరుకోవడం కష్టం. అంతర్ముఖులమై ధ్యానం చేస్తేనే కుండలినీ శక్తి జాగృతం అవుతుంది. అలాగే ఆమెను ‘మహామాయ’గా పేర్కొన్నారు. అంటే ఆమె మన లోపల ఉంటూ... ప్రలోభాలకు గురి చేసి పరీక్షిస్తుంది. సద్గుణాలతో ఆ మాయను దాటిన వారిని అనుగ్రహిస్తుంది. అప్పుడు వారు మాయ నుంచి విముక్తి పొందుతారు. వారిలో కుండలినీ శక్తి ఉత్థానం చెంది... మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఆమె ఒక కంటి చూపుతో బ్రహ్మాండాన్ని సృష్టించగలదు, అదే కంటి చూపుతో నాశనం చేయగలదు. ఈ స్తోత్రంలో అమ్మవారిని వెయ్యి నామాలతో స్తుతించారు. వాటిలో సహజయోగ పరంగా ప్రాధాన్యమైన నామాల అర్థాలను... నవరాత్రి పూజల సందర్భంగా శ్రీ మాతాజీ నిర్మలాదేవి తన ప్రవచనాల్లో వివరించారు. ‘త్రికోణ’ అంటే ‘త్రికోణంలో నివసించేది’ అని అర్థం. మన వెన్నుపాము అడుగున ఉన్న త్రికోణాకారపు ఎముకలో అమ్మవారు కుండలినీ శక్తి రూపంలో నిద్రాణ స్థితిలో ఉంటారు. ‘మూలధార నిలయా’... మూలాధారం అంటే షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి కాస్త పైన ఉంటుంది. ఈ మూలాధారంలో అమ్మవారు కుండలినీ శక్తి రూపంలో నివసిస్తారు. ‘కుండల’ అంటే సంస్కృతంలో ‘సర్పిలాకారం’ అనే అర్థం ఉంది. ఈ శక్తి మూలాధారం అనే త్రికోణాకార ఎముకలో మూడున్నర చుట్లు తిరిగి, సర్పిలాకారంలో నిద్రిస్తున్న పాములా ఉంటుంది. అందుకే దీనికి ‘కుండలినీ’ అనే పేరు వచ్చింది. ఈ నామం కూడా స్తోత్రంలో కనిపిస్తుంది. అలాగే ‘బిసతంతు తనీయసి’ అంటే ‘తామరకాడలోని పోగుల లాంటి స్వభావం కలిగినది’ అని అర్థం. కుండలినీ శక్తి అనేక దారపు పోగులతో పేనిన తాడులా ఉంటుందని శ్రీ మాతాజీ వివరించారు.


‘షట్చక్రోపరి సంస్థితా’ అంటే ‘ఆరు చక్రాల పైభాగంలో చక్కగా ఉన్నది’ అని అర్థం. మన సూక్ష్మ శరీరంలో వెన్నుపాము వెంబడి తల మీద మాడు భాగం వరకూ మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్ర చక్రాలనే ఏడు శక్తి కేంద్రాలు ఉంటాయి. మూలాధార చక్రంలో ఉండే కుండలినీ శక్తి మిగిలిన ఆరు చక్రాలను దాటి, మన తలపైన ఉండే బ్రహ్మరంధ్రంలోంచి బయటకు వచ్చి, భగవంతుడి పరమ చైతన్య శక్తిలో ఐక్యమవుతుంది. అప్పుడే మనకు యోగం లభిస్తుంది. కుండలినీ శక్తి ప్రయాణించే మార్గంలో... చక్రాల మధ్య బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులు ఉంటాయి. వాటిని ఛేదించుకొని కుండలినీ శక్తి పైకి వెళ్తుంది. అందుకే ఆమెకు‘ బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని’ అనే నామాలు ఏర్పడ్డాయి. మానవ సూక్ష్మ శరీరంలో ఇడా, పింగళా, సుషుమ్నా అనే నాడులు ఉంటాయి. కుండలినీ శక్తి ఈ నాడుల ద్వారా పైకి వచ్చినప్పుడు... ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులను ప్రసాదిస్తాయి. అందుకే అమ్మవారిని ‘ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ’ అని వర్ణిస్తారు. స్వాధిష్ఠాన పద్మంలో నివసించేది కాబట్టి ‘స్వాధిష్ఠానాంబుజగతా’ అనీ, మణిపూర చక్రం లోపలి నుంచి ఉదయించేది కాబట్టి ‘మణిపూరాంతరుదితా’ అనీ, అనాహత చక్రంలో ఉంటుంది కాబట్టి ‘అనాహతాబ్జ నిలయా’ అనీ, విశుద్ధ చక్రంలో నివసిస్తుంది కాబట్టి ‘విశుద్ద చక్ర నిలయా’ అనీ, ఆజ్ఞా చక్రంలో కొలువుతీరుతుంది కాబట్టి ‘ఆజ్ఞాచక్రాంత రాళస్థా’ అనీ అమ్మవారిని లలితా సహస్రనామాల్లో వర్ణించారు.


సహస్రారాంబుజారూఢా’ అంటే ‘వెయ్యి దళాలున్న పద్మంలో నివసించేది’ అని అర్థం. దానికి శ్రీమాతాజీ వివరణ ఇస్తూ ‘‘ఈ చక్రం మన తల మీద మాడు లేదా బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది. ఈ చక్రాన్ని కుండలినీ శక్తి ఛేదించుకొని పైకి వచ్చినప్పుడు మనిషికి యోగం లభిస్తుంది. అప్పుడు మానవ చేతన... తన చుట్టూ ఉన్న భగవంతుడి పరమ చైతన్య శక్తితో అనుసంధానం అవుతుంది. మనిషి మెదడును లోపలి నుంచి (అడ్డుకోత కోసి) గమనిస్తే... వెయ్యి నరాలు కలిసి, వెయ్యి దళాలున్న పద్మంలా కనిపిస్తుంది. అందుకే దాన్ని ‘సహస్రారం’ అంటారు’’ అని చెప్పారు. ఇక ‘సుధాసారాభి వర్షిణి’ అంటే ‘అమృతధారలు కురిపించేది’ అని అర్థం. కుండలినీ శక్తి సహస్రార చక్రాన్ని దాటిన తరువాత.. సాధకునిలో చైతన్య తరంగాల అనుభూతి మొదలవుతుంది. అమృతధారల్లాంటి ఆ చైతన్య తరంగాలను అనుభూతి చెందడం కుండలినీ జాగృతి ద్వారానే సాధ్యమవుతుంది. ఆ సమయంలో సాధకులు బ్రహ్మానందానుభూతిలో లీనమవుతారు.

( శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారు ఇచ్చిన ప్రవచనాల ఆధారంగా)

డాక్టర్‌ పి. రాకేష్‌ 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

Updated Date - Oct 04 , 2024 | 12:07 AM