ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dr. Nori Dattatreya : చేయించేది ఆ సర్వాంతర్యామే

ABN, Publish Date - Jun 27 , 2024 | 11:34 PM

కేన్సర్‌ చికిత్సలో ఆయనది అంతర్జాతీయ ఖ్యాతి. దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులకు ప్రాణదాత. ప్రపంచంలో ఆరోగ్య సంపదను పెంచడానికి నిరంతర కృషి చేస్తూనే... ఆధ్యాత్మిక సంపదను కూడా అపారంగా సంపాదించుకున్న డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు ‘నివేదన’తో పంచుకున్న అనుభవాలివి.

కేన్సర్‌ చికిత్సలో ఆయనది అంతర్జాతీయ ఖ్యాతి. దేశ విదేశాలకు చెందిన

ఎందరో ప్రముఖులకు ప్రాణదాత. ప్రపంచంలో ఆరోగ్య సంపదను పెంచడానికి నిరంతర

కృషి చేస్తూనే... ఆధ్యాత్మిక సంపదను కూడా అపారంగా సంపాదించుకున్న

డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు ‘నివేదన’తో పంచుకున్న అనుభవాలివి.

దేవుడు, భక్తి... వీటిని ఎలా నిర్వచిస్తారు?

భక్తి మనలో వ్యక్తిగతంగా మొదలవుతుంది. ‘‘సూపర్‌ పవర్‌ ఒకటి ఉన్నది, అదే మనల్ని నడిపిస్తోంది. మనం నిమిత్తమాత్రులం’’ అని మనం నమ్మాలి. అప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తాం. ఆ తరువాత అది సామాజికంగా మారుతుంది. ఇక దైవారాధన విషయానికి వస్తే... భారతదేశం, మన హిందూ సంస్కృతి... ఒక ఆధ్యాత్మిక సూపర్‌మార్కెట్‌. ఇక్కడ ఎందరో దేవుళ్ళు ఉన్నారు. ఎన్నో భక్తి మార్గాలు ఉన్నాయి. మనకు కావలసిన దైవాన్ని మనం పూజించుకొనే వెసులుబాటు ఉంది. ఇది మన హిందూమతానికి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకత. ‘‘మీకు ఇందరు దేవుళ్ళు ఎందుకున్నారు? ఇన్ని విగ్రహాలు ఏమిటి?’’ అని విదేశీ మిత్రులు నన్ను అడుగుతూ ఉంటారు. మాకు ఆధ్యాత్మికంగా, భక్తిపరంగా అంత వైవిధ్యం ఉందని నేను సమాధానం ఇస్తూ ఉంటాను. మనకు చదువులో అనేక స్థాయిలు ఉంటాయి. టెన్త్‌ తరువాత ఇంటర్‌ చదవాలి. ఆ తరువాత డిగ్రీ చేశాక పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చెయ్యాలి. ఆ తరువాత పిహెచ్‌డి చెయ్యాలి. అలాగే భక్తిలోనూ ఒక్కొక్క స్థాయినీ దాటుకుంటూ వెళ్ళాలి. పిహెచ్‌డి తరువాత మళ్ళీ వెనక్కి వెళ్ళక్కర్లేదు. అలాగే ఆధ్యాత్మికతలో... అత్యున్నత స్థాయికి చేరుకొని, ‘దేవుళ్ళందరూ ఒక్కటే’ అని అర్థమయిన తరువాత... మిగిలినవాటితో పని లేదు.

మీకు దైవ చింతన ఏ వయసులో బలపడింది?

మా తల్లితండ్రులకు దైవభక్తి ఎక్కువ. దైవ చింతన నాకు బాల్యం నుంచీ బలంగానే ఉంది. పిల్లలకు భక్తి, పూజా పునస్కారాలు నేర్పారు. నాకు అయిదారేళ్ళ వయసులో మా నాన్నగారు గతించారు. అప్పుడు నేను దేవుడి గదిలోకి వెళ్ళి, తలుపులు వేసుకొని... ‘‘మా నాన్నను నాకు తిరిగి ఇస్తావా? లేదా?’’ అని ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థించాను. దేవుణ్ణి ఇష్టపడే ధోరణి నాకు చిన్నప్పటినుంచీ ఉంది. ఏనాడూ ఆ విషయంలో నాకు రెండో ఆలోచన లేదు. ఆ పునాదులు కుటుంబంలోనే పడ్డాయి. క్రమేపీ భక్తి పెరిగింది.

‘ఇది దైవసంకల్పం వల్ల జరిగింది’ అనే సంఘటనలు ఏవైనా ఉన్నాయా?

మన జీవితంలో ప్రతిదీ దేవుడి ప్రమేయంతోనే జరుగుతుందనేది నా విశ్వాసం. అందులో మరో ఆలోచన లేదు. అయితే... ‘ఆధ్యాత్మికత గొప్పదా? వైద్యం గొప్పదా?’ అనే మీమాంస ఒకప్పుడు నాలో కలిగింది. ఎందుకంటే నాది సైన్స్‌ నేపథ్యం. సైన్స్‌ ప్రధానంగా వైద్యం... రుజువులను బట్టి ఫలితాన్ని నిర్ధారణ చేస్తాయి. ‘ఒక అత్యున్నతమైన శక్తి అంటే సుప్రీమ్‌ పవర్‌ ఉంది, అన్నిటినీ అదే నడిపిస్తోంది’ అనేది నా నమ్మకం. నేను వైద్యుణ్ణి అయ్యాక... దాన్ని మరింతగా నిర్ధారించుకున్నాను. వైద్యం, ఆధ్యాత్మికత అనేవి పరస్పర వ్యతిరేకమైనవి కావనీ, నిజానికి అవి పరస్పర దోహదకారులనీ అర్థమయింది. నేను ఎవరికైనా మంచి మందు ఇవ్వాలన్నా, ఆపరేషన్‌ చెయ్యాలన్నా... నా మనసు నిర్మలంగా ఉండడం, బుద్ధి పదునుగా ఉండడం ప్రధానం. దానికి ఆధ్యాత్మికత దోహదం చేస్తోంది. అది కాంప్లిమెంటరీ.

అమెరికాలో షిరిడీ బాబా ఆలయాలు కట్టించారు. ఆయన మీద గురి ఎలా కుదిరింది?

నేను కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుతున్న రోజులవి. అప్పట్లో రాష్ట్రంలోనే అతి పెద్ద షిరిడీ సాయిబాబా ఆలయాన్ని... తుంగభద్ర తీరంలో నిర్మించారు. నేను సాయంత్రం ఆ ప్రాంతానికి వెళ్లేవాణ్ణి. ఆ ఆలయంలో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా అనిపించేది. ఆ తరువాత షిరిడీబాబా గురించి తెలుసుకోవాలని... ‘సాయి సచ్ఛరిత్ర’ లాంటి పుస్తకాలు చదివాను. ఆయన సిద్ధాంతాలు చాలా సరళంగా, ప్రభావం కలిగించేలా, సులువుగా అనుసరించేలా ఉన్నాయనిపించింది. ఆయన మీద భక్తి పెరిగింది. షిరిడీబాబాకు మనం సన్నిహితంగా వెళ్ళేకొద్దీ ఆయన అనేక అనుభవాలు కూడా కలిగిస్తూ ఉంటారు. అవి చమత్కారంగా ఉంటాయి.

మీకు అలాంటి అనుభవాలేవైనా కలిగాయా?

ఒకటీ రెండూ కాదు... ఎన్నో. నేను న్యూయార్క్‌లో బాబా ఆలయాన్ని కట్టాలనుకున్నాను. విగ్రహం సిద్ధమైంది. దాన్ని స్థాపించడానికి సరైన స్థలం దొరకలేదు. అక్కడ అనుమతులు చాలా కఠినంగా ఉంటాయి. భవనానికి స్థలం దొరికితే జోనింగ్‌ కావాలి. జోనింగ్‌ దొరికితే దానికి పార్కింగ్‌ కావాలి. అన్నీ ఉంటే తప్ప అనుమతులు ఇవ్వరు. అనువైన స్థలం కోసం దాదాపు ఆరేళ్ళపాటు వెతికాను. ఎక్కడా దొరకలేదు. షిరిడీబాబాకు గురువారం ప్రియమైన రోజు. అలాంటి ఒక గురువారం నాడు... నేను పొద్దున్న పూజ చేసుకొనేటప్పుడు ‘‘బాబా! స్థలం వెతకడం ఇక నా వల్ల కాదు. ఆ ప్రయత్నం నేను వదిలేస్తున్నాను. మీ విగ్రహావిష్కరణ కోసం ఎవరో ఒకరిని మీరే వెతుక్కోండి’’ అని దాదాపు సవాల్‌ చేశాను. తరువాత క్లినిక్‌కు వచ్చాను. పేషెంట్స్‌ను పరీక్షిస్తున్నాను. ఉదయం బాబాకు చేసిన సవాలే నాకు మనసులో మెదులుతూ ఉంది. అప్పుడు ఒకామె వచ్చింది. అప్పటికి పదేళ్ళ ముందు ఆమెకు నేను కేన్సర్‌ నయం చేశాను. ఆమె ఫాలోఅప్‌ చెకప్‌ కోసం వచ్చింది. ఒకప్పుడు రోగులతో కుటుంబ సభ్యులతో ఉండేటంత చనువు ఉండేది. ఆ చనువుతోనే ‘‘అమ్మా! ఇప్పుడు మీరు ఏ ప్రొఫెషన్‌లో ఉన్నారు?’’ అని అడిగాను. ‘‘నేను రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో ఉన్నాను’’ అని ఆమె చెప్పింది. ‘‘నాకు నా అవసరానికి తగిన జోనింగ్‌, పార్కింగ్‌ ఉన్న స్థలం ఏదైనా చూపిస్తారా? ఎంత వెతికినా దొరకడం లేదు. వెతికి వెతికి విసుగుపుట్టింది’’ అని అడిగాను. ‘‘నేను ఆఫీసుకి వెళ్ళి, కంప్యూటర్లో చెక్‌ చేసి చెప్తాను’’ అంది. వెళ్ళిన కొంతసేపటికే ఆమె ఫోన్‌ చేసింది. ‘‘ఒకటి దొరికిందండీ! వాళ్ళ అపాయింట్‌మెంట్‌ తీసుకోనా?’’ అని అడిగింది. ‘‘అపాయింట్‌మెంట్‌ అక్కర్లేదమ్మా! నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను’’ అని చెప్పాను. వెళ్ళాను, స్థలాన్ని చూశాను, సంతకాలు పెట్టి, ఆ స్థలాన్ని తీసుకున్నాను. అప్పుడు నాకు ‘గజేంద్రమోక్షం’లో ‘నీవేతప్ప నితఃపరంబెరుగ...’’ అనే పద్యం గుర్తుకువచ్చింది. ‘నాపని అయిపోయింది. ఆ పని మీరే చేసుకోవాలి’ అని నేను అన్న తరువాత... ఆయన వెంటనే మార్గాన్ని చూపించారు. 2001లో ఆలయ నిర్మాణం జరిగింది. ఇలాంటి చమత్కారాలు ఎన్నో జరిగాయి.


మీరే దేవుడని మీ పేషెంట్లు చాలామంది చెబుతూ ఉంటారు. వారికి మీరేం చెబుతారు?

‘‘నాలో ఆధ్యాత్మిక దృక్పథం, నా వృత్తిని ప్రేమించే తత్త్వం ఉన్నాయి కాబట్టి నా ద్వారా భగవంతుడు మీకు సాయం చేశాడు. ఆయన నన్ను ఒక సాధనంగా ఎంచుకున్నాడు’’ అని చెబుతాను. అలా చెప్పడంవల్ల వాళ్ళలోనూ భక్తి భావన పెరుగుతుంది. అంతా నేనే చేస్తున్నాననే అహంకారం మీలో ఏర్పడితే... అక్కడితో మీ అధ్యాయం పూర్తయినట్టే. కాబట్టి ఇవన్నీ నా ద్వారా ఆ సర్వాంతర్యామి చేయిస్తున్నాడనే నేను అనుకుంటాను.

మీ దృష్టిలో... ఇలాంటివి భక్తులందరికీ కలుగుతూ ఉంటాయా?

ఆయన మీద భక్తి పెరిగే కొద్దీ చమత్కారాలు ఎక్కువ చూపిస్తూ ఉంటారు. నిస్వార్థంగా, పరిపూర్ణమైన భక్తిభావం ఉన్నప్పుడు... మీ జీవితంలో ఇలాంటి అనుభవాలు కలుగుతూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా... వాటిని గమనించడం, అనుభూతి చెందడం మాత్రమే. అలాంటి మరో అద్భుతమైన సంఘటన ఏమిటంటే... అమెరికాలో వాణి అని షిరిడీబాబా భక్తురాలు ఒకామె ఉండేవారు. ఆమె భారతదేశం నుంచి అక్కడికి వచ్చారు. ఆసుపత్రిలో నా పని పూర్తి చేసుకున్నాక... ఆమెను కలుసుకొని... ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ ఉండేవాణ్ణి. బాబా గురించి ఎన్నో విషయాలు ఆమె చెబుతూ ఉండేవారు. ఒకసారి ఆమె ఏదో కథ చెబుతూ... ‘‘బాబాకు మాధవరావ్‌ దేశ్‌ముఖ్‌ అనే శిష్యుడు ఉండేవాడు...’’ అంటూ... ‘‘ఆ పేరు నాకెందుకో సరిగ్గా గుర్తుకు రావడం లేదు...’’ అని ఆపేశారు. అప్పటికే రాత్రి పదకొండయింది. ‘‘నాయనా! ఇప్పటికే ఆలస్యమైంది. నువ్వు ఇంటికి వెళ్ళు’’ అన్నారు. నేను ఇంటికి వచ్చాను. పదకొండున్నర అయింది. టిఫిన్‌ తింటూ... టీవీ ఆన్‌ చేశాను. అప్పుడొక ఇండియన్‌ ఛానెల్‌ వస్తోంది. మా వాళ్ళు ఇండియన్‌ ఛానెల్స్‌ కూడా పెట్టించారని నాకు తెలీదు. ఆ ఛానెల్‌లో షిరిడీ గురించిన కథ నడుస్తోంది... వాణిగారు తను చెబుతున్న కథ ఎక్కడైతే ఆపేశారో... నేను చూసేటప్పటికి అక్కడినుంచే టీవీలో కథ మళ్ళీ మొదలైంది. అందులో ఒక పాత్రధారి ‘‘మేరా నామ్‌ మాధవరావ్‌ దేశ్‌ముఖ్‌ నహీహై... దేశ్‌పాండే’’ అని చెబుతున్నాడు. దీన్ని యాదృచ్ఛికం అందామా? దేవుడి ఉనికికి నిదర్శనం అందామా? బాబా మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. ఇలాంటి సంఘటనల వల్ల భక్తి ఇంకా పెరుగుతుంది. భక్తి పెరిగినకొద్దీ దేవుడు మీకు స్నేహితుడవుతాడు. మీరతణ్ణి ఆజ్ఞాపించవచ్చు. డిమాండ్‌ చెయ్యవచ్చు. అయితే అది మీ సొంత ప్రయోజనాలకోసం మాత్రం కాకూడదు. నాలోనూ ఆ విధంగానే భక్తి పెరిగి... ఇంకేదైనా చేయాలనే ఆలోచనతో న్యూయార్క్‌లో గుడి కట్టాను. అమెరికాలో మొదటి షిరిడీ సాయి గుడి అదే. మిగిలిన రాష్ట్రాల వాళ్ళు కూడా అక్కడికి రావడం మొదలుపెట్టారు. వాళ్ళకు చాలా దూరం అవుతోందనే ఆలోచనతో... న్యూజెర్సీలో మరో గుడి కట్టాను.

సంభాషణ: కృష్ణశర్మ

Updated Date - Jun 27 , 2024 | 11:34 PM

Advertising
Advertising