ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అతిథిగా వెళ్లి.. ఆర్థిక భరోసా ఇచ్చి

ABN, Publish Date - Nov 27 , 2024 | 01:05 AM

పదేళ్ళ క్రితం... జీవితానికి భద్రత ఇస్తున్న ఉద్యోగంతో రాజీ పడాలా? నచ్చినట్టు స్వేచ్ఛగా బతకాలా? ఎటూ తేల్చుకోలేని సందిగ్ధత నన్ను చాలా రోజులు వెంటాడింది.

టెకీ ఉద్యోగం... మంచి జీతం... ఆశావహమైన భవిష్యత్తు... అయినా ఏదో వెలితితో ఎంతో సతమతమయ్యారు ప్రతిభా కృష్ణయ్య. జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడానికి ఆమె చేపట్టిన ప్రయాణం కొన్ని వందల మంది మహిళలకు కొత్త జీవితాన్నిచ్చింది.

‘‘పదేళ్ళ క్రితం... జీవితానికి భద్రత ఇస్తున్న ఉద్యోగంతో రాజీ పడాలా? నచ్చినట్టు స్వేచ్ఛగా బతకాలా? ఎటూ తేల్చుకోలేని సందిగ్ధత నన్ను చాలా రోజులు వెంటాడింది. అప్పట్లో... స్వస్థలమైన బెంగళూరులోనే ఒక బహుళజాతి కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేసేదాన్ని. ఉద్యోగంలో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది. లక్ష్యాలను పూర్తి చేయడానికి ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చేది. అందరితోనూ కలిసిపోవడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి చదువుకుంటున్న రోజుల నుంచీ నాకు అలవాటు. కానీ ఉద్యోగంలో చేరిన తరువాత... ఒంటరితనం పెరిగినట్టు అనిపించేది. దాన్ని తప్పించుకోవడానికి ఒక బడిలో ఉచితంగా లెక్కల పాఠాలు చెప్పేదాన్ని. హఠాత్తుగా అనారోగ్యంతో కొన్నాళ్ళు ఇంటికే పరిమితం కావలసి వచ్చింది. నా గురించి తీరికగా ఆలోచించుకొనే సమయం దొరికింది.

‘జీవితం నుంచి నేను ఏం కోరుకుంటున్నాను? అసలు జీవితానికి అర్థం ఏమిటి? దాన్ని అర్థవంతంగా చేసుకోవాలంటే ఏం చెయ్యాలి?’... ఇవన్నీ నాకు నేను వేసుకున్న ప్రశ్నలు. అప్పటికి నాకు ముప్ఫై ఏళ్ళు దాటాయి. ‘మరో ఇరవయ్యేళ్ళకో, పాతికేళ్ళకో ఉద్యోగం మానేసిన తరువాత... ఇన్నేళ్ళూ ప్రశాంతతను కోల్పోయాననీ, ‘ఇదీ నేను చేసిన మంచి పని’ అని చెప్పుకొనేది ఒక్కటీ లేదనీ విచారించకూడదు’ అనుకున్నాను. నా తమ్ముడితో ఈ విషయాలన్నీ చర్చించాను. ‘‘ఉద్యోగం మానేసి ఏం చేస్తావు?’’ అని అడిగాడు. ‘‘ఈ ఒత్తిళ్ళకు దూరంగా... ఏదైనా పల్లెటూర్లో ప్రశాంతంగా ఉండాలని ఉంది’’ అని చెప్పాను. కొన్ని రోజుల తరువాత... ‘‘ఎస్‌బిఐ అందిస్తున్న ‘యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌’ (వైఐఎ్‌ఫ)కు దరఖాస్తు చేసుకో’’ అంటూ ఒక లింక్‌ను నా తమ్ముడు పంపించాడు. దరఖాస్తు చేశాను. ఫెలోషి్‌పకు ఎంపికయ్యాను. అక్కడి నుంచి నా కొత్త ప్రయాణం ఆరంభమయింది.


నైపుణ్యానికి మెరుగులు...

వైఐఎఫ్‌ కోసం ఏదైనా ఒక గ్రామీణ ప్రాంతంలో పని చెయ్యాల్సి ఉంటుంది. ఉత్తరాఖండ్‌లోని ఖేతిఖాన్‌ అనే మారుమూల గ్రామంలో ఉన్న ‘బిఎఐఎఫ్‌ డెవల్‌పమెంట్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’తో కలిసి పనిచేయడానికి నన్ను పంపించారు. అది నాకు పూర్తిగా కొత్త ప్రపంచం. ఒక ఏడాది పాటు స్థానికులతో కలిసి పని చేశాను. వారి భాష నేర్చుకున్నాను. వారి సంస్కృతిని అవగాహన చేసుకున్నాను. ఎంతో ఒత్తిడితో గడిపిన పాత రోజులతో పోలిస్తే... అంతులేని ప్రశాంతత నాలో నెలకొంది. ఆ ప్రాంతం నాకు ఎంతగా నచ్చిందంటే... ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. గ్రామంలోని మహిళలు నన్ను ఎంతో ఆదరించారు. వారి కష్ట సుఖాలు నాతో చెప్పుకొనేవారు. సొంతంగా ఎంతో కొంత సంపాదించాలనే కోరిక చాలామందిలో ఉంది. కానీ దానికి తగిన అవకాశాలు వారికి లేవు. అందుకోసం ఏదైనా చెయ్యాలనుకున్నాను. హిమాలయ ప్రాంతాల్లోని మహిళలకు కుట్లు, అల్లికల్లో మంచి ప్రతిభ ఉంటుంది. ఇరుగు పొరుగువారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో ఒకటి అల్లుతూనే ఉంటారు. దాన్నే వారికి ఆదాయమార్గంగా మార్చాలనుకున్నాను. కొందరు స్నేహితులతో ఈ సంగతి చర్చించాను. ‘హిమాలయన్‌ బ్లూమ్స్‌’ అనే లాభాపేక్ష లేని సంస్థ ఏర్పాటుకు ఆ విధంగా బీజం పడింది. మహిళల్లో ఉన్న నైపుణ్యానికి మెరుగులు దిద్ది, చక్కటి డిజైన్లతో ఉత్పత్తులు తయారు చేయించి, వాటిని విక్రయించడం, లాభాలను వారికి పంచడం... ఇదీ మా లక్ష్యం.


అన్నీ నిర్వహించేది వారే...

దైనా కొత్త ప్రయత్నం చేపట్టినప్పుడు తొలి రోజుల్లో ఆటంకాలు సహజం. మా విషయంలోనూ అదే జరిగింది. ఎక్కువమంది మహిళలు ఆసక్తి చూపించలేదు. నెల రోజుల ప్రయత్నం తరువాత... కేవలం 12 మంది మహిళలు మాత్రమే మాతో చేరారు. వారికి శిక్షణతో పాటు కావలసిన సామగ్రిని అందజేశాం. ఆ ప్రాంతాల్లో వాటికి పెద్దగా డిమాండ్‌ ఉండదు. అందుకే బెంగళూరులో ప్రదర్శన ఏర్పాటు చేశాం. రెండు రోజుల్లోనే మేము తీసుకొచ్చిన ఉత్పత్తులన్నిటినీ అమ్మేశాం. ఇది తెలుసుకొని... మొదట్లో సందేహించిన వారు ముందుకువచ్చారు. ప్రస్తుతం ఖేతిఖాన్‌, ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 250 మందికి పైగా మహిళలు మా సంస్థలో సభ్యులుగా ఉన్నారు. ఊలుతో స్వెట్టర్లు, బొమ్మలు, గృహాలంకరణ వస్తువులు, ఉపకరణాలతో పాటు రాఖీల్లాంటివి కూడా వారు తయారు చేస్తారు. వాటి విక్రయం మన దేశంలోని పలు ప్రాంతాలతోపాటు అమెరికా, యూరప్‌, జపాన్‌ దేశాలకు కూడా విస్తరించింది. వివిధ దేశాల్లో మేము ఏర్పాటు చేసిన హస్తకళా ప్రదర్శనలకు మంచి ఆదరణ ఉంది. గ్రామీణ మహిళ స్వావలంబనే ప్రధానంగా... ఇంటర్నెట్‌ వినియోగం, ట్యాలీ, ఎంఎస్‌ ఆఫీస్‌ లాంటి సాఫ్ట్‌వేర్లలో శిక్షణను కూడా మా సంస్థ అందిస్తోంది. ఇప్పుడు ‘హిమాలయన్‌ బ్లూమ్స్‌’ తరఫున మార్కెటింగ్‌, నిర్వహణ, వినియోగదారులతో సంబంధాలు, కొత్తగా చేరే మహిళలకు శిక్షణ... ఇలా అన్ని వ్యవహారాలను సభ్యులైన మహిళలే నిర్వహిస్తున్నారు. వారి సంపాదన నెలకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉంటుంది. పిల్లల చదువుల కోసం, భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే నిబంధనను అందరూ పాటిస్తున్నారు. 2014లో... అతిథిగా ఆ ప్రాంతంలో అడుగు పెట్టాను. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక సభ్యురాలినైపోయాను. ‘నా జీవితానికి అర్థం ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబు దొరికింది.’’

Updated Date - Nov 27 , 2024 | 01:19 AM