ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వన భోజనాలు ఎందుకంటే...

ABN, Publish Date - Nov 22 , 2024 | 06:28 AM

ఆస్తులు, విలాసవంతమైన వస్తువులను సంపదగా చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ సంపదకు మన పూర్వీకుల నిర్వచనం వేరు. వారు ఆ రోజుల్లోనే సంపదకు నిజమైన అర్థమేమిటనేది

ఆస్తులు, విలాసవంతమైన వస్తువులను సంపదగా చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ సంపదకు మన పూర్వీకుల నిర్వచనం వేరు. వారు ఆ రోజుల్లోనే సంపదకు నిజమైన అర్థమేమిటనేది తెలుసుకున్నారు. తెలుసుకోవడమే కాకుండా... దాన్ని మన అనుభవంలోకి తీసుకురావడం కోసం అనేక ఆచారాలను, సంప్రదాయాలను ఏర్పరిచారు. దైనందిన జీవితంలో మనం వాటికి అలవాటు పడేలా చేశారు. ఆ విధంగా ఏర్పాటు చేసినవే కార్తిక మాస వనభోజనాలు. ప్రకృతి సంపదతో అలరారే వనంలో బంధుమిత్రుల కలయిక, అక్కడే వంటలు, ఆటలు, పాటలు, భోజనాలు, ఎటువంటి అరమరికలు లేని ఆహ్లాదకరమైన సామూహిక ఆనందం... కార్తీక మాసంలో వన సమారాధనలు ఉంటే గుర్తుకువచ్చేవి ఇవే. కానీ బయటకు సరదాగా కనిపించే ఈ వన భోజనాల వెనుక లోతైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయని తన ప్రవచనాలలో శ్రీ మాతాజీ నిర్మలాదేవి పేర్కొన్నారు అవేమిటో తెలుసుకుందాం.

ఆరోగ్యప్రదాయిని...

కార్తీక మాసంలో ఉసిరిచెట్టు కింద వనభోజనాలు చేస్తారు. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవని లాంటిది. ఈ కాలంలోనే ఉసిరి కాయలు బాగా కాస్తాయి. ‘సి విటమిన్‌ పుష్కలంగా ఉండే ఉసిరిని మనం రోజూ ఏదో ఒక రూపంలో తినాలి. ఇది మన జీర్ణ శక్తిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిది. ఉసిరిలో ఒక్క ఉప్పదనం తప్ప మిగిలిన ఆరు రుచులూ ఉంటాయి. దీనిలో ఆమ్ల గుణం అంటే పులుపు ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘ఆమలకము’ లేదా ‘ఆమ్ల’ అంటారు. కార్తీక మాసంలో ఉసిరికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంలో ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ఈ నెల నుంచే శీతాకాలం మొదలవుతుంది. దగ్గు, జలుబుతో పాటు చలి కారణంగా ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉసిరిని తినడం, ఉసిరి చెట్టు నీడన ఉండడం వల్ల ఆ దోషాల నివారణ జరుగుతుంది. వృద్ధాప్యాన్ని దరి చేరనివ్వని ఔషధ మొక్కలలో ఉసిరిని మించినది లేదని ‘చరక సంహిత’ పేర్కొంది.

సామాజిక బంధాలు పెరుగుతాయి...

వన భోజనాల వల్ల సమకూరే ప్రధానమైన ప్రయోజనం... సామూహిక జీవనం. సామూహిక జీవనాన్ని మానవులకు అలవాటు చేయడానికే శ్రీకృష్ణుడు భూమిమీద అవతరించాడంటారు పెద్దలు. ఆయన దైవికమైన తన వాక్చాతుర్యంతో... గోపాలునిగా, స్నేహితుడిగా తన చుట్టూ ఉన్నవారికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించాడు. ఒంటరిగా జీవించే వ్యక్తుల కన్నా... అందరితో కలిసి జీవించే వ్యక్తుల్లో అహంకారం, నిరాశ, నిస్పృహలు తక్కువగా ఉంటాయి. అహంకారం.. ఆధ్యాత్మిక పురోగతికి అతి పెద్ద అవరోధం. దాన్ని అధిగమించడానికి తేలికైన మార్గం.. అందరితో కలిసి హాయిగా నవ్వుకోవడం. వ్యక్తుల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే... వన భోజనాల వల్ల అవి తొలగిపోతాయి. సామరస్యం ఏర్పడుతుంది. ఒకరికోసం అందరూ... అందరికోసం ఒక్కరూ... ఇలా కలిసి సహకరించుకోవడం వల్ల వారి మధ్య ప్రేమపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. అహంకారాలు కరిగిపోతాయి. హృదయం విశాలం అవుతుంది. అలాంటి వాతావరణంలో పెరిగే పిల్లల మీద మంచి ప్రభావాన్ని చూపుతుంది. వారిలో సానుకూల దృక్పథం ఏర్పడడానికి దోహదపడుతుంది. అలాంటి పిల్లలు చక్కటి భద్రతా భావన కలిగి ఉంటారు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం వారికి అలవడుతుంది. మానవుల సూక్ష్మ శరీరంలో... గొంతు భాగంలో ఉండే విశుద్ధ చక్రం... ఆకాశతత్త్వాన్ని కలిగి ఉంటుంది. సామూహిక జీవనం కలిగి ఉన్న వ్యక్తులలో అది చక్కగా అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల సంభాషణా చాతుర్యం అలవడుతుంది. అందరితో సత్సంబంధాలు పెంచుకోగలుగుతాం.

ప్రకృతితో పరిచయం...

ఉద్యానవనంలోనైనా, వ్యవసాయ క్షేత్రంలోనైనా తిరుగుతున్నప్పుడు... అక్కడ ఉన్న మొక్కలు, చెట్లు, పువ్వులు మనల్ని పలకరిస్తున్నట్టు మమేకం అయిపోతాం. ఆ ఆనందం మరెక్కడా రాదు. పువ్వులను చూడండి... అవి ఎన్నో రంగుల మేళవింపు. ప్రతి చెట్టూ భిన్నమైన ఆకృతిలో ఉంటుంది. వీటిలో భగవంతుడికి ప్రీతిపాత్రమైనవి, అలంకారాలకు ఉపయోగించేవి ఉంటాయి. వాటిని, ఫలాలను, కూరగాయలను మన మనుగడ కోసమే భగవంతుడు సృష్టించాడు. వాటి గురించి, వాటి ప్రయోజనాల గురించి పిల్లలకు పరిచయం చెయ్యడానికి వన భోజనాలు చక్కటి అవకాశం. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు, మనిషి స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని ఆరోగ్యంగా జీవించడానికి చెట్లు ఎలా సహకరిస్తాయో, వాటిని ప్రేమగా ఎలా పెంచుకోవాలో పిల్లలకు అవగాహన కల్పించాలి. వన భోజనాలు ఆటపాటల కోసం, వినోదం కోసం, పిక్నిక్‌ లాంటి కాలక్షేపం కోసమే కాకుండా... పిల్లలకు విజ్ఞాన యాత్రలా, పెద్దలకు ఆధ్యాత్మిక యాత్రలా... వెరసి సామాజిక బంధాలను పెంచుకొనే ఒక మార్గంగా ఉండాలి.

కుండలినీ జాగృతి కోసం...

మన ప్రాచీన ఋషులు ఏర్పాటు చేసిన సంప్రదాయాలన్నీ మన సూక్ష్మ శరీరంలో కుండలినీ శక్తిని జాగృతం చేసుకోవడానికి ఉద్దేశించినవే. ఇలా జాగృతం చేసుకోవడానికి మనకు అందుబాటులో ఉన్న మార్గం సహజయోగ. ఈ సహజయోగ పద్ధతిలో ధ్యానం చేస్తూ... కుండలినీ శక్తిని, మన సూక్ష్మ శరీరంలో ఉన్న శక్తి కేంద్రాలను లేదా చక్రాలను అనుభూతి చెందినప్పుడు... మన సంప్రదాయాల వెనకు ఉన్న అసలైన అంతరార్థం మనకు బోధపడుతుంది. నుదుటిపై కుంకుమను ధరించడాన్ని ఉదాహరణగా తీసుకుంటే... అలా ధరించినప్పుడు మన సూక్ష్మ శరీరంలోని ఆజ్ఞాచక్రం చల్లబడుతుంది. అంతర్గత ప్రశాంతతను అనుభూతి చెందుతాం. అంతేకాదు... ఇది ఆజ్ఞా చక్రానికి రక్షణ కూడా కల్పిస్తుంది. కార్తిక మాసంలో చేసే వన భోజనాలు కూడా అలాంటి ఒక సంప్రదాయమే. ‘సహజయోగ’ అనే పదంలోనే సహజత్వం ఉంది. ఈ యోగాన్ని పొందడం సహజత్వానికి... అంటే ప్రకృతికి దగ్గరగా ఉండేవారికి చాలా సులభం. ఎందుకంటే మన లోపల ఉన్న షట్చక్రాలు... పంచభూతాల తత్త్వాలతో చాలా వేగంగా స్పందిస్తాయి. కృత్రిమమైన జీవనానికి అలవాటు పడినవారికి ఈ యోగం సిద్ధించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి కనీసం ఏడాదికి ఒకసారి కార్తీక మాస వన భోజనాల ద్వారానైనా ప్రకృతి ఒడిలో సేదతీరితే... మనకు మనంగా ఏర్పరచుకున్న కృత్రిమమైన అవరోధాల నుంచి కొంతయినా విముక్తి పొందగలం.

పురాణ కథల్లో...

సూత మహాముని తన తోటి మునులతో కలిసి... ఉసిరిచెట్టు కింద వనభోజనాలు చేసినట్టు, ద్వాపర యుగంలో గోపాలురితో కలిసి శ్రీకృష్ణుడు వనభోజనాలకు వెళ్ళినట్టు పురాణాలలో ఉంది. గోవర్ధన పూజ జరపడం ద్వారా... దేవతల కన్నా మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఆరాధించడం ముఖ్యమనే సందేశాన్ని శ్రీకృష్ణుడు ఇచ్చాడు. అలాగే గోవర్ధన గిరిని పైకి ఎత్తి... ఈ ప్రకృతి మనకు గొడుగులా ఏ విధంగా రక్షణను ఇస్తుందో చూపించాడు. ఈ గోవర్ధన పూజ కూడా కార్తీకమాసంలోని తొలిరోజున వస్తుంది.

డాక్టర్‌ పి. రాకేష్‌ 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

Updated Date - Nov 22 , 2024 | 06:28 AM