తేనీరు ఇలా కూడా!
ABN, Publish Date - Dec 01 , 2024 | 01:06 AM
చాలామందికి ఉదయం లేవగానే తేనీటిని సేవించే అలవాటు ఉంటుంది.
చాలామందికి ఉదయం లేవగానే తేనీటిని సేవించే అలవాటు ఉంటుంది. చిక్కని పాలలో కొన్ని నీళ్లు, పంచదార, తేయాకు పొడి వేసి బాగా మరిగించి తేనీటిని తయారు చేస్తారు. ఇది అందరికీ తెలిసిన పద్దతే! ఒంట్లో నీరసంగా అనిపించినపుడు, ఆరోగ్యం బాగాలేనపుడు ఇంట్లో దొరికే కొన్ని దినుసులు ఉపయోగించి కొత్త రకంగా తేనీటిని తయారు చేసుకుని తాగితే క్షణాల్లో శరీరానికి శక్తి లభిస్తుంది. బడలికని పోగొట్టి మెదడుని ఉత్తేజితం చేసేందుకు తేనీటీలో కలపాల్సిన దినుసులు ఇవే....
అల్లం: ఒక చిన్న అల్లం ముక్కను పొట్టు తీసి కచ్చా పచ్చాగా నూరి మరుగుతున్న తేనీటిలో వేస్తే అందులోనుంచి వచ్చే సువాసనకే అలసట మొత్తం పోతుంది. ఈ తేనీటిని తాగిన వెంటనే అల్లంలోని జింజర్‌సోల్ అనే సమ్మేళనం గొంతు గరగరను పోగొడుతుంది. రాత్రి తిన్న ఆహారపదార్థాలు పొట్టలో సమస్యలు కలిగించకుండా వాటిని క్షణాల్లో జీర్ణం చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
ఏలకులు : రెండు ఏలకులను పొట్టుతో సహా మెత్తగా నూరాలి. ఈ పొడిని కప్పు లేదా గ్లాసులో వేసుకోవాలి. అందులో ముందుగా తయారు చేసుకున్న వేడి తేనీటిని వడబోయాలి. తరవాత చెంచాతో కలిపితే తేనీటికి మంచి సువాసన పడుతుంది. ఈ తేనీటిని తాగడం వల్ల ఏలకులలో ఉండే రైబోఫ్లెవిన్, నియాసిన్ అనే విటమిన్లు; యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. ఇవి కడుపులో ఆమ్లతత్వాన్ని నిరోధిస్తాయి. శరీరంలో జీవక్రియలను వేగవంతం చేస్తాయి.
దాల్చినచెక్క: మరుగుతున్న తేనీటిలో అర అంగుళం పొడవున్న దాల్చిన చెక్కను వేస్తే అందులోని ఔషధగుణాలన్నీ తేనీటిలోకి చేరతాయి. ఉదయాన్నే ఈ తేనేటిని తాగితే నిద్ర మత్తు వదలిపోతుంది. దాల్చిన చెక్కలో ఉండే పాలీఫెనాల్ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్దీకరిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
తులసి: వేడి తేనీటిలో నాలుగు లేదా అయిదు తులసి ఆకులు వేసుకుని తాగితే శరీరానికి రోగనిరోధక శక్తి అందుతుంది. ఒత్తిడి, మానసిక ఆందోళన, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు, సి విటమిన్ చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.
సోంపు: తేనీరు మరుగుతున్నపుడు అందులో అర చెంచా సోంపు గింజలు కలిపితే అది పొట్టను శుభ్రం చేసే కషాయంలా మారుతుంది. ఈ తేనీటిని తాగిన అర్థగంటలోపే కడుపు ఉబ్బరం, అజీర్తి, కడుపులో మంట తదితర సమస్యలన్నీ పోతాయి.
లవంగాలు: లవంగ మొగ్గల్లో కె, సి విటమిన్లతోపాటు యూజినాల్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు, గొంతు గరగర లాంటి సమస్యలను నివారిస్తాయి. నోటి ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఒక గ్లాసు తేనీటిలో రెండు లవంగాలను పొడి చేసి కలుపుకుని తాగితే చలికాలంలో వచ్చే శ్వాసకోశ సమస్యలనుంచి బయటపడవచ్చు.
మిరియాలు: వేడిగా ఉన్న తేనీటిలో చిటికెడు మిరియాల పొడిని కలుపుకొని తాగితే శరీరానికి సత్తువ లభిస్తుంది. ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, తలనొప్పి, గొంతు నొప్పి తదితర సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
Updated Date - Dec 01 , 2024 | 01:07 AM