నాజూగ్గా... నల్లపూసలు
ABN, Publish Date - Nov 28 , 2024 | 05:21 AM
ఎన్ని నగలు ఉన్నప్పటికీ వివాహమైన మహిళలు నల్ల పూసల గొలుసుకు ఇచ్చే ప్రాధాన్యం మాత్రం ప్రత్యేకం.
ఎన్ని నగలు ఉన్నప్పటికీ వివాహమైన మహిళలు నల్ల పూసల గొలుసుకు ఇచ్చే ప్రాధాన్యం మాత్రం ప్రత్యేకం. అందుకే సంప్రదాయం, ఆధునికతల సమ్మేళనంతో కాలానుగుణంగా నల్ల పూసల గొలుసులు రూపుదిద్దుకుంటున్నాయి. ట్రెండ్‌ను అనుసరించే ఉద్యోగినులను ఆకట్టుకునే విధంగా ఎన్నో రకాలు లభ్యమవుతున్నాయి. బంగారం, నవరత్నాలు, క్రిస్టల్స్, సిజెడ్స్‌తో కలగలిసి మహిళల మనసు దోచుకున్న ట్రెండీ డిజైన్స్ ఇవే....
బంగారం, వజ్రాలతో: బంగారు తీగకు నల్ల పూసలను జతచేసి అందమైన అమరికలో చుడతారు. బంగారం అల్లిక ఎక్కువగా, నల్ల పూసల అల్లిక తక్కుగా ఉండేలా రూపొందిస్తారు. దీనికి చిన్న వజ్రాలతో తయారు చేసిన లాకెట్‌ను జోడిస్తారు. లాకెట్‌ను పోలిన జుంకాలు లేదా దిద్దులు, ఉంగరం కూడా అందుబాటులో ఉంటాయి. నాజూగ్గా ఉంటూనే గొప్పగా కనిపించే ఈ నల్ల పూసల గొలుసు ఏ వయసువారికైనా నప్పుతుంది.
ముత్యాలతో: నల్ల పూసలు దగ్గరగా ఉండేలా బంగారు తీగతో గొలుసులా చుడతారు. లాకెట్ స్థానంలో పెద్ద సైజు ముత్యాలను, బంగారు గుండ్లను ఒక క్రమంలో అమర్చి గొలుసుకు జోడిస్తారు. ఈ గొలుసుకు మరో పెద్ద ముత్యాన్ని వేలాడేలా అమరుస్తారు. ఈ నల్లపూసల గొలుసు నాజూగ్గా ఉంటూ ఉద్యోగినులకు అనుకూలంగా ఉంటుంది.
రాశి గుర్తులతో: బంగారు తీగతో నల్ల పూసలను గొలుసులా అల్లిన తరవాత దానికి జోడించే లాకెట్‌లో భార్య భర్తల జన్మ రాశి గుర్తులను బంగారంతో తయారు చేసి అమరుస్తారు. లేదంటే రాశి గుర్తులనే లాకెట్‌లా జోడిస్తారు. ఈ రాశి గుర్తుల మీద వజ్రాలు లేదా సిజెడ్‌లను కూడా పొదుగుతారు. కావాలనుకుంటే కెంపులు, పచ్చలు కూడా అమర్చుకోవచ్చు. బాలివుడ్ నటి సోనమ్ కపూర్ ఈ తరహా నల్లపూసల గొలుసు ధరించడంతో అప్పటి నుంచి ఈ మోడల్ అత్యంత మహిళాదరణ పొందింది.
నవరత్నాలతో: పొట్టిగా ఉండే నల్లపూసల గొలుసుకు నవరత్నాలను ఒక క్రమంలో లాకెట్‌లా జోడిస్తారు. దీనికి వజ్రాన్ని వేలాడేలా అమరుస్తారు. ఈ మోడల్ గొలుసు ఆధునిక దుస్తుల మీద బాగుంటుంది. నవరత్నాలైన పగడం, గోమేధికం, పుష్యరాగం, నీలం, మాణిక్యం, మరకతం, వజ్రం, వైఢూర్యం, ముత్యంలను ఒకే పరిమాణంలో ఉండేలా మార్చి వాటిని బంగారంతో అందమైన ఆకృతిలో జోడించి లాకెట్ రూపొందిస్తారు. దీనిని నల్లపూసల గొలుసుకు అమరుస్తారు. అప్పుడు అది చిన్న నెక్లె్‌సలా కనిపిస్తుంది. రోజువారీ వేసుకోవడానికి గృహిణులకు, ఉద్యోగినులకు అనుకూలంగా ఉంటుంది.
చాంద్‌బాలీతో: అర్థచంద్రాకారపు చాంద్‌బాలీ లాకెట్‌ను జోడించి తయారు చేసే ఈ నల్ల పూసల గొలుసు చాలా అందంగా కనిపిస్తుంది. నల్ల పూసల గొలుసు మూడు లేదా అయిదు వరుసలు ఉండేలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ గొలుసుల్లో చిన్న, పెద్ద బంగారు గుండ్లను కూడా చేరిస్తే మంచి హారంలా మారుతుంది. చాంద్‌బాలీ లాకెట్‌కు ముత్యాలు లేదంటే నల్ల పూసల గుత్తులు వేలాడేలా చేస్తే ఈ నల్ల పూసల హారం ఇంకా గొప్పగా కనిపిస్తుంది.
మీనాకారీతో: నల్ల పూసల గొలుసుకు జోడించే లాకెట్‌ను బంగారంతో మాత్రమే కాదు. రాగి, వెండి లోహాలతో కూడా తయారు చేయవచ్చు. వీటి మీద అందమైన ఎనామిల్ రంగులు వేసి రంగురంగుల కుందనాలు అద్ది మీనాకారీ హారం రూపొందిస్తారు. ఈ మీనాకారీ హారం అన్ని రకాల చీరల మీద గొప్పగా కనిపిస్తుంది. మహిళలు ఎటువంటి సంకోచం లేకుండా అన్ని సందర్భాల్లో ధరించేందుకు వీలుగా ఉంటుంది.
Updated Date - Nov 28 , 2024 | 05:22 AM