The story of Ayodhya : అయోధ్య కథ కంచికి... ఇది మన మంచికే!
ABN , Publish Date - Jan 19 , 2024 | 05:29 AM
అయోధ్యతో మాకు రెండు రకాలుగా సంబంధం ఉంది. ఒకటి క్షేత్ర సంబంధం. రెండోది ఉద్యమ సంబంధం. 1980లలో రామమందిర ఉద్యమ సమయంలో జయేంద్ర సరస్వతి స్వామి వారు ఉత్తరదేశ యాత్రలో ఉన్నారు. ఆ సమయంలో నేను పరమాచార్యులవారి వద్ద ఉన్నా. అప్పుడు ఇరు పక్షాలకు సంబంధించిన అనేక మంది
అయోధ్యలో భవ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు
దేశమంతా సంసిద్ధమవుతోంది. రామమందిర
ఉద్యమంలో ఒక దశలో కంచిమఠం ప్రధానపాత్ర
పోషించింది. అయోధ్యతో కంచికి ఉన్న సంబంధం గురించి, భవిష్యత్తులో ధర్మప్రచారం ఎలా సాగాలనే విషయం గురించి కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి
‘నవ్య’తో సంభాషించారు.
‘‘అయోధ్యతో మాకు రెండు రకాలుగా సంబంధం ఉంది. ఒకటి క్షేత్ర సంబంధం. రెండోది ఉద్యమ సంబంధం. 1980లలో రామమందిర ఉద్యమ సమయంలో జయేంద్ర సరస్వతి స్వామి వారు ఉత్తరదేశ యాత్రలో ఉన్నారు. ఆ సమయంలో నేను పరమాచార్యులవారి వద్ద ఉన్నా. అప్పుడు ఇరు పక్షాలకు సంబంధించిన అనేక మంది పరమాచార్యను వచ్చి కలుస్తూ ఉండేవారు. శిలన్యాస్ సమయంలో పరమాచార్య కొన్ని ఇటుకలను పూజించి అయోధ్యకు పంపారు. ఆ తరువాతి కాలంలో జయేంద్ర సరస్వతి స్వామి ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సుబ్రహ్మణ్యస్వామి, జార్జి ఫెర్నాండెజ్‌తో సహా అనేక మంది రాజకీయనాయకులు, అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు కార్యదర్శి పి.వి.ఎ్‌స.కె. ప్రసాద్, వీహెచ్‌పీ అధ్యక్షుడు అశోక్‌సింఘాల్ తదితరులు వచ్చి... మహాస్వామితో పరిష్కారం కోసం చర్చలు జరుపుతూ ఉండేవారు. ఇక 1997లో అనుకుంటా.... మేము కాశ్మీర్ యాత్రకు వెళ్లాం. ఆ సమయంలో అయోధ్యలో కొన్ని రోజులు ఉన్నాం. అప్పుడు రామ్‌లాలా (శ్రీరాముని విగ్రహం) తాత్కాలికంగా వేసిన టెంట్‌లో ఉండేవారు. ‘‘ఆయన భక్తులు అందరూ ఇళ్లు కట్టుకుంటున్నారు. ఆయనకు మాత్రం తాత్కాలిక నివాసమా?ఆయనకు కూడా ఒక గొప్ప ఇల్లు ఉంటే ఎంత బావుంటుంది?’ అనే ఆలోచన కలిగింది. ఇప్పుడు ఆ ఆలోచన సాకారమై... ఒక గొప్ప దేవాలయం నిర్మాణమైనందుకు ఆనందంగా ఉంది.
రెండింటి సంబంధం..
ఇటీవల నేను కాశీ వెళ్లాను. అక్కడి నుంచి అయోధ్య, దాని నుంచి నైమిశారణ్యం వెళ్లా. దీని వెనకున్న అంతరార్థమేమిటో చెబుతా. ‘ శృతి.. స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం... నమామి భగవద్పాద శంకరం.. లోకశంకరం’ అనే పద్యాన్ని మనం చదువుకుంటూ ఉంటాం. మనకు శృతులు ముఖ్యమే. స్మృతులు ముఖ్యమే. శృతులైన వేదాలకు కేంద్రం కాశీ. ఆ వేదాలు చెప్పిన విషయాలను ఆచరించి చూపించిన వారు రాములవారు. వారి కేంద్రం అయోధ్య. ఈ విధంగా ఈ రెండు మనకు ముఖ్యమైన కేంద్రాలు. ఇక ధర్మం గురించి పురాణాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. నైమిశారణ్యంలో చక్రతీర్థం అనే ప్రదేశముంది. అది కూడా చాలా ముఖ్యమైనది. దీని గురించి పురాణాలలో ప్రస్తావన ఉంది. శృతి, స్మృతి, పురాణాలు- ఈ మూడింటికీ ప్రతీకగా రాముడిని, సీత అమ్మవారిని చెప్పుకోవచ్చు. ఈ మూడింటిలోను పేర్కొన్న- వీరం, విక్రమం, వినయం, విద్య, విశ్వాసం, వైరాగ్యం, వేదాంతం- ఈ గుణాలన్నింటికీ రాముల వారు ఉదాహరణ. ఆయన ధనుర్విద్యే కాకుండా అన్ని శాస్త్రాలను నేర్చుకున్నారు. ఎంత పరాక్రమశాలి అయినా అందరితోను వినయంగానే ఉండేవారు. భారతీయ ఆర్ఘ ధర్మంపై ఆయనకు అచంచలమైన విశ్వాసం ఉండేది. రాముల వారు ఒక సందర్భంలో- ‘‘ఆత్మానాం మానుషం మన్యే రామాంత శ్రద్ధాత్మజం’’ అంటారు. ‘‘నన్ను నేను ఒక మనిషిగానే చూస్తున్నాను.. నేను ఋషులకు సమానమైనవాడినని తెలుసుకోండి’’ అంటారు. పరాక్రమానికి ప్రతీకగా నిలిచి, అపరిమితమైన అధికారం ఉండి, దాన్ని ప్రదర్శించే అవకాశం ఉండి కూడా ఆయన తన గురించి తాను చెప్పుకున్న మాటలు అందరికీ ఆచరణీయాలు. అందుకే ఆయన రాజర్షి అయ్యారు. ఆయనలో లౌకికం ఉంది. ధార్మికం ఉంది. జ్ఞానం ఉంది. త్యాగం ఉంది. వీటి అవసరం ఈనాడు మనకు ఎంతయినా ఉంది.
కంచితో సంబంధం...
కంచితో అయోధ్యకు రకరకాలుగా సంబంధం ఉంది. దీనిలో మొదటిది మోక్ష సంబంధం. దక్షిణ దేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కంచి. మిగిలిన మోక్ష క్షేత్రాలైన- అయోధ్య, మధుర, కాశీ, అవంతిక మొదలైనవన్నీ ఉత్తరదేశంలోనే ఉన్నాయి. ఆ విధంగా ఈ రెండింటికి క్షేత్ర సంబంధం ఉంది. ఇక రెండోది శక్తి సంబంధం. కంచి ఒక శక్తి పీఠం. శివ క్షేత్రాలలో శివకంచిలోని ఏకాంబరేశ్వరుడిది పృధ్వీ క్షేత్రం. మూడోది కులదేవతా సంబంధం. సూర్యవంశ కులదేవత- దేవకాళి. దశరథ మహారాజుకు కలలో కనిపించి- కంచిలోని కామాక్షి అమ్మవారిని దర్శిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆదేశిస్తుంది. దానితో దశరథ మహారాజు సకుటుంబంగా కంచికి వచ్చి వారం రోజులు ఉండి, క్షేత్ర నియమాలు అన్నీ పాటించి.. ‘‘కామాక్షి తీర్థమోవర్ణః సర్వమంగళ హేతువాః’’ అని ప్రస్తుతిస్తాడు. దీనికి సంబంధించిన విషయాలు ‘లలితోపాఖ్యానం’లో మనకు కనిపిస్తాయి. ఆ తర్వాతే దశరఽథుడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు. ఇన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టే- గత ఏడాది ఆగస్టులో జరిగిన భూమి పూజకు కంచి నుంచి మృత్తికలు పంపించాం. వాటితో పాటుగా- ‘జయ, నంద, భద్ర, రిక్త, పూర్ణ’ దేవతల కోసం ఐదు బంగారు కాసులు పంపాం. వీటన్నింటినీ భూమి పూజలో వినియోగించారు. ఏది ఏమైనా... ఎట్టకేలకు అయోధ్య రామమందిరం కథ కంచికి చేరింది. ఇది అందరి మంచి కోసమే!
సమన్వయం..
మన దేశ సంస్కృతి ఒకటైనా కాలచక్రంలో శీతోష్టం, ఆర్థిక వికాసం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఉత్తర దేశం వారి వద్ద నిష్ఠ ఉంది. మన దగ్గర నియమాలు ఉన్నాయి. వారి వద్ద నిధి ఉంది. మన వద్ద నిర్వహణ ఉంది. వీటిని సమన్వయపరిచి ముందుకు వెళ్లటమే మానవ ధర్మం. కొన్ని నెలల క్రితం అయోధ్య వెళ్లినప్పుడు... అక్కడ భక్తుల కోసం వివిధ రాష్ట్రాల వారు నిర్మించిన భవనాలు, ఆశ్రమాలను చూశాం. మన దక్షిణ దేశంలో కూడా రాములవారితో సంబంధమున్న అనేక ప్రాంతాలు ఉన్నాయి. కర్ణాటకలో కిష్కింద ఉంది. గోదావరీ తీరంలో ఆయన సంచరించాలనేది లోకప్రసిద్ధం. తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన శివలింగాన్ని ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. కంచిపీఠం 59వ పీఠాధిపతి- భవనామభోదేంద్ర సరస్వతి స్వామి ‘రామనామ’ జపాన్ని ఒక స్పూర్తిగా నెలకొల్పారు. ఆయన జన్మించిన గోవిందపురమనే ప్రాంతంలో ఇప్పటికీ రామనామ దీక్ష తీసుకుంటూ ఉంటారు. ఇలా మనకు రామ భావనతో ఎప్పటి నుంచో సంబంధం ఉంది. ఇప్పుడు క్షేత్రంతో మరింత బలోపేతమవుతోంది. యజ్ఞయాగాదులు, వేద స్వస్తిలకు మన వారు పెట్టింది పేరు. అయోధ్య దివ్య క్షేత్రాన్ని లౌకికంగా చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు. అన్ని వసతులు కల్పిస్తున్నారు. దీనితో పాటుగా- అయోధ్య ధర్మప్రచారానికి, శాస్త్ర ప్రచారానికి ఒక వేదిక కావాలి. చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలన్నీ ప్రభావితం కావాలి. కనీసం 500 గుళ్లకైనా మేలు జరగాలి. ప్రజలు ప్రభావితం కావాలి. కొత్త సౌకర్యాలు ప్రాచీన శాస్త్ర సంపదతో సంతులనం కావాలి. దక్షిణ బుద్ధి, ఉత్తర శక్తి కలిసి పనిచేయాలి. అలా చేస్తేనే- దేశానికి, ధర్మానికి మంచి జరుగుతుందని అందరూ గ్రహించాలి. అలా జరిగిన నాడు భారత దేశం, ఆర్ష ధర్మం ప్రపంచానికి గురువు అవుతుంది. చక్రవర్తిగా నిలుస్తుంది.
మన ప్రార్థన, రాముల వారి కృప వల్ల, న్యాయాలయం చేసిన నిర్ణయం వల్ల భవ్య మందిరం నిర్మాణం జరుగుతోంది. ప్రాణ ప్రతిష్ఠకు ముహర్తం పెట్టిన జ్ఞానేశ్వర శాస్త్రి ద్రావిడ మన దక్షిణ భారత దేశ మూలాలు ఉన్నవారే! ఆయన ముత్తాత లక్షణ శాస్త్రి పెద్ద స్వామి వారిని కాశీకి తీసుకువెళ్లారు. తాత రాజేశ్వరిశాస్త్రి పెద్ద పండితుడు. అనేక విషయాలు పరిశీలించి.. ఉత్తర, దక్షిణ భారత దేశ శాస్త్రాల సమన్వయం చేసి మంచి ముహర్తం పెట్టారు.
సంభాషణ: సీవీఎల్‌ఎన్ ప్రసాద్