ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రక్కులో.. దేశం చుట్టేస్తున్నారు

ABN, Publish Date - Nov 13 , 2024 | 06:28 AM

మన దేశంలో 22 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలను, కొన్ని విదేశాలను సైతం ట్రక్కులో చుట్టేశారు జలజా రతీశ్‌. తోటికోడలికి, కుమార్తెలకే కాదు... ఎంతోమందికి ట్రక్‌ నడపడంలో ప్రేరణగా నిలుస్తున్నారు. మరోవైపు ట్రావెల్‌ వ్లాగ్‌ కూడా నిర్వహిస్తున్నారు. ‘ట్రక్కు డ్రైవింగ్‌ మహిళలు చేసే పని కాదనేవారికి మేమే సమాధానం’ అంటున్న 42 ఏ

మన దేశంలో 22 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలను, కొన్ని విదేశాలను సైతం ట్రక్కులో చుట్టేశారు జలజా రతీశ్‌. తోటికోడలికి, కుమార్తెలకే కాదు... ఎంతోమందికి ట్రక్‌ నడపడంలో ప్రేరణగా నిలుస్తున్నారు. మరోవైపు ట్రావెల్‌ వ్లాగ్‌ కూడా నిర్వహిస్తున్నారు. ‘ట్రక్కు డ్రైవింగ్‌ మహిళలు చేసే పని కాదనేవారికి మేమే సమాధానం’ అంటున్న 42 ఏళ్ల జలజ స్ఫూర్తి మంతమైన ప్రయాణం ఆమె మాటల్లోనే...

‘‘నేను పుట్టి పెరిగింది కేరళలోని కొరుత్తూడ్‌లో. చదువు మధ్యలో ఉండగానే పెళ్ళయింది. ఆ తరువాత ఎట్టుమనూర్‌లోని మా అత్తవారి ఇంట్లోకి అడుగుపెట్టాను. నా భర్త రితీశ్‌ ట్రక్కు డ్రైవర్‌. సొంతంగా కొన్ని ట్రక్కులు ఉండేవి. దేశంలోని వివిధ ప్రాంతాలకు సరుకులను రవాణా చేసేవారు. ఇంట్లో ఉన్నప్పుడు తను చూసిన ప్రదేశాల గురించి చెబుతూ ఉంటే... ‘నేను కూడా అవన్నీ చూస్తే బాగుంటుంద’నిపించేది. ఒకసారి ‘‘మన పెళ్ళిరోజుకు కశ్మీర్‌ తీసికెళ్తారా’’ అని అడిగాను. ‘‘అలాగే వెళ్దాం! కానీ నువ్వు ట్రక్కు నడిపితేనే తీసికెళ్తాను’’ అన్నారు. దాంతో ఆయన దగ్గరే ట్రక్కు డ్రైవింగ్‌ నేర్చుకున్నాను. ఇచ్చిన మాట ప్రకారం ఆయన కశ్మీర్‌ తీసుకువెళ్ళారు. కానీ నాకు స్టీరింగ్‌ అప్పగించలేదు. అక్కడి నుంచి వచ్చాక... డ్రైవింగ్‌ పరీక్షలకు హాజరై... హెవీ వెహికిల్‌ లెసైన్స్‌, ఆ తరువాత అప్పుడప్పుడు తక్కువ దూరాలకు ట్రక్కుల్లో సరుకులు చేరవేసేదాన్ని. దూర ప్రయాణం చేసే అవకాశం 2022 ఫిబ్రవరిలో వచ్చింది. ఆ ఏడాది మా పెళ్ళి రోజు సందర్భంగా నాకు ఒక ట్రక్కు తాళాలను మా ఆయన అప్పగించారు. కశ్మీర్‌ వరకూ నేనే ట్రక్కు నడిపాను. ఇది నాకు ఎంతో సంతోషం కలిగించింది. నాలో ఆత్మస్థైర్యాన్ని పెంచింది.


ఆరు రోజులు రోడ్డు మీదే ...

పన్నెండు టైర్లు ఉన్న వాహనంలో... గతుకులు, గుంతలు, ఇరుకైన మలుపులు ఉన్న రోడ్ల మీద సరుకులను రవాణా చెయ్యడం ఒక పెద్ద సవాలు. ఒకసారి జమ్మూ-కశ్మీర్‌ మధ్య వెళ్తున్నాను. ఒకవైపు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మార్గమధ్యంలో కొండ చరియలు పడి, వాహనాలు ఆగిపోయాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో... దాదాపు ఆరు రోజుల పాటు వాహనాలను అధికారులు ఆపేశారు. కాలకృత్యాల కోసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హొటల్‌కు నడిచి వెళ్ళాల్సి వచ్చేది. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదురైనా... నేను చేసే ప్రతి ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. సాధారణంగా మా ట్రక్కులో నేను, నా భర్త వెళ్తూ ఉంటాం. ఒకరు విశ్రాంతి తీసుకుంటే మరొకరం వాహనం నడుపుతాం. పెట్రోల్‌ బంకుల్లోని వాష్‌ రూమ్‌లను వాడుకుంటాం. రోడ్డు పక్కన ఆగి వంట చేసుకుంటాం. దానికోసం ఒక స్టవ్‌, సరుకులు, పాత్రలను మాతోనే తీసుకువెళ్తాం.

అవకాశం వచ్చినప్పుడల్లా... మా కుటుంబం మొత్తం ట్రక్కుల్లోనే పర్యటనలకు వెళ్తున్నాం. దానికోసం క్యాబిన్లలో ఏసీలు కూడా పెట్టించాం. ఎంతో సరదాగా, ఆహ్లాదంగా సాగే ఆ ప్రయాణాల కోసం అందరం ఎంతగానో ఎదురుచూస్తాం. ఇక, దూరప్రాంతాలకు సరుకులు తీసుకువెళ్ళేటప్పుడు... కనీసం ఇద్దరు కుటుంబ సభ్యులు మాతో ఉంటారు. కాబట్టి సమస్యలేదు. ఇది మహిళలు చేసే పని కాదనే వారికి మేమే సమాధానం. ‘మహిళా ట్రక్‌ డ్రైవర్‌గా ఇబ్బందులు లేవా?’ అంటే ఉన్నాయి. ప్రతిచోటా మహిళలకు అనువైన టాయిలెట్‌ సౌకర్యాలు ఉండవు. ఇంటికి రోజుల తరబడి దూరంగా ఉండాల్సి వస్తుంది. సరైన సమయంలో భోజనం చేసే వీలు ఉండదు. కానీ దేశమంతా చూడాలనే నా ఆకాంక్ష... నేను అనుకున్నదానికన్నా వేగంగానే తీరుతోంది. ఇంకా అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, త్రిపుర, మణిపూర్‌, సిక్కిం, మిజోరం ప్రాంతాలను సందర్శించాలి. అవి కూడా చూసేస్తే... దేశంలోని ప్రతి రాష్ట్రాన్నీ ట్రక్కు నడుపుతూ సందర్శించిన తొలి మహిళను బహుశా నేనే అవుతాను.


ఎక్కడికి వెళ్లినా గుర్తుపడుతున్నారు...

ఒక ట్రక్కుతో ప్రారంభమైన మా ‘పుతెట్టు ట్రాన్స్‌పోర్ట్‌’లో ఇప్పుడు దాదాపు ముప్ఫై ట్రక్కులున్నాయి. ఇవి కన్యాకుమారి నుంచి నేపాల్‌ వరకూ, గుజరాత్‌ నుంచి అసోం వరకూ తిరుగుతాయి. వీటి కార్యకలాపాల్లో నేను, సూర్య, దేవిక ప్రధానపాత్ర పోషిస్తున్నాం. మొదట్లో నా ప్రయాణ అనుభవాలను వీడియోలు, ఫొటోలు తీసి స్నేహితులకి, బంధువులకి పంపించేదాన్ని. ప్రతి ఒక్కరికీ అవి నచ్చడంతో... యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. ‘పుతెట్టు ట్రావెల్‌ వ్లాగ్‌’ పేరుతో మా కుటుంబ సభ్యుల ప్రయాణ అనుభవాల, అనుభూతుల వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తున్నాం. ప్రస్తుతం దానికి 4.25 లక్షలమంది సబ్‌స్ర్కైబర్స్‌ ఉన్నారు. స్పందన కూడా బాగుంది. నేను ఎక్కడికి వెళ్ళినా జనం గుర్తుపడుతున్నారు. నాతో మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ‘‘మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని భారీ వాహనాల లైసెన్స్‌ తీసుకున్నాం’’ అని ఎంతోమంది అమ్మాయిలు చెబుతున్నారు. ‘కొత్త ప్రాంతాలను చూడాలి. అక్కడ ప్రజల జీవన విధానాన్ని చూడాలి’ అనే ఆకాంక్ష నన్ను ట్రక్కు డ్రైవర్‌గా మార్చింది. నా ఆకాంక్ష నెరవేరడంతో పాట గుర్తింపు లభించింది. ఇంతకుమించి నేను కోరుకొనేది ఇంకేం ఉంటుంది?’’

అత్తగారి కోరిక తీర్చాం...

ఈ రెండేళ్ళలో నేను మన దేశంలోని ఇరవై రెండు రాష్ట్రాలు, లడఖ్‌తో సహా ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు, నేపాల్‌, భూటాన్‌ దేశాలను కూడా ట్రక్కులో చుట్టేసి వచ్చాను. నన్ను చూసి స్ఫూర్తి పొందిన నా తోటికోడలు సూర్య, బీకామ్‌ చదువుతున్న మా అమ్మాయి దేవిక కూడా హెవీ వెహికిల్‌ లైసెన్సులు తీసుకొని నాకు తోడయ్యారు. మా మరో అమ్మాయి గోపిక ఇప్పుడు చెన్నైలో బిబిఎ చదువుతోంది. తను కూడా లైసెన్స్‌ కోసం ఎదురుచూస్తోంది. ఈమధ్యే మా అత్తగారిని ట్రక్కులో ఋషీకేశ్‌ తీసుకువెళ్ళాం. ఋషీకేశ్‌లో గంగా హారతి చూడాలనే ఆమె కోరిక తీర్చాం. 23 రోజుల పాటు 11 రాష్ట్రాల్లో సాగిన ఈ యాత్రలో ఆమెకు ఎన్నో ప్రదేశాలు చూపించాం.

Updated Date - Nov 13 , 2024 | 06:28 AM