scorecardresearch
Share News

ఇదొక అభినేత్రి జీవన‘రేఖ’

ABN , Publish Date - Jan 01 , 2024 | 04:34 AM

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మేరు నగధీర రేఖ. సాధారణత్వం నుంచి గ్లామర్‌ శిఖరాగ్రం వరకు ఆమె ప్రయాణం అసాధారణం. రేఖ జీవిత చరిత్రను ‘రేఖ- ది- అన్‌టోల్డ్‌ స్టోరీ’ పేరుతో...

ఇదొక అభినేత్రి జీవన‘రేఖ’

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మేరు నగధీర రేఖ. సాధారణత్వం నుంచి గ్లామర్‌ శిఖరాగ్రం వరకు ఆమె ప్రయాణం అసాధారణం. రేఖ జీవిత చరిత్రను ‘రేఖ- ది- అన్‌టోల్డ్‌ స్టోరీ’ పేరుతో నవలీకరించాడు యాసిర్‌ ఉస్మాన్‌. దీన్ని ‘స్వయంసిద్ధ- ఒక అభినేత్రి జీవనరేఖ’ గా తెలుగులో అనుసృజన చేశారు శ్రీదేవీ మురళీధర్‌. ఆ పుస్తకంలోని కొన్ని విశేషాల సమాహారమే ఇది.!

తన తొలి చిత్రాలు విజయఢంకా మోగిస్తుంటే 1972లో రేఖ బొంబాయి జుహూ ప్రాంతంలో తన సొంత ఫ్లాట్‌ కొనుక్కుంది. పద్దెనిమిదేళ్ల రేఖ హోటల్‌ అజంతా నుండి జుహు బీచ్‌ అపార్ట్‌మెంట్‌కు మారింది. అదే అపార్ట్‌మెంటులో నటి జయ భాదురి కూడా నివసించేది. రేఖ, జయ తమ సినిమా కెరీర్‌ను దాదాపు ఒకేసారి ప్రారంభించారు. అయితే నటులుగా వారిద్దరి ఎదుగుదల పూర్తి భిన్న పథాలలో నడిచింది. రేఖ నటిగా తనను తాను ఎన్నడూ సీరియ్‌సగా తీసుకోలేదు. పరిశ్రమ కూడా ఆమెను సమర్థురాలైన నటిగా పరిగణించలేదు. ఆమె నటన గురించి కాకుండా ఆమె చుట్టూ గాలివార్తలు ఆమె వ్యక్తిగత జీవితం గురించి, ప్రచారం అవసరం లేని అనేకమైన విషయాల గురించి వెలుగులోకి వచ్చేవి. అది సునీల్‌దత్‌ వంటి సీనియర్‌ నటుడైనా, అప్పటి సూపర్‌ స్టార్‌ రాజేష్‌ ఖన్నా అయినా, రేఖ తన కోసం ప్రతి ఒక్కరినీ సెట్స్‌ మీద వేచి ఉండేటట్లు చేసేది, మరి అది సాహసమో, వెర్రి ధైర్యమో! ఒకప్పుడు హృషీకేశ్‌ ముఖర్జీ వంటి గౌరవనీయుడైన దర్శకుడు కూడా ‘నమక్‌ హరామ్‌’ (1973) సెట్‌లో షూటింగ్‌ నిలిపివేయవలసి వచ్చింది. సగం రోజు పాటు అందరూ ఎదురు చూసినా రేఖ మాత్రం రాలేదు. ఆమె అప్పటికింకా యుక్త వయస్సు. స్వేచ్ఛా ప్రవృత్తి, భావోద్వేగం, త్వరగా చలించిపోయే సున్నితమైన మనసు కల స్టార్‌గా పేరు తెచ్చుకుంది.

అమితాబ్‌తో పరిచయం

బీచ్‌ అపార్ట్‌మెంట్స్‌లో, రేఖ, జయ తరచుగా కలుసుకునేవారు. రేఖ జయను ఆప్యాయంగా ‘దీదీభాయ్‌’ అని పిలుస్తూ, ఆమెతో గడపడానికి జయ ఫ్లాట్‌కి వెళ్తూ ఉండేది. జయ రేఖకు జీవితం, వృత్తి గురించి సలహాలు ఇస్తూ ఉండేది. అక్కడే రేఖ జయ సన్నిహితుడు, స్నేహితుడైన అమితాబ్‌ బచ్చన్‌ను మొదటిసారి కలుసుకుంది.

జయ మీద కినుక...

నటుడు మెహమూద్‌ అధికారిక జీవిత చరిత్ర రచయిత హనీష్‌ ఝావేరి ఇలా అంటాడు. ‘అమితాబ్‌, అన్వర్‌(మొహమూద్‌ సోదరుడు) సన్నిహితులు. అమితాబ్‌, జయలను తరచూ లాంగ్‌ డ్రైవ్‌లకు తీసుకెళ్లేవాడినని అన్వర్‌ నాతో చెప్పాడు. ఇద్దరూ అతనితో పాటు కారు, ముందు సీటులో కూర్చొని మాట్లాడుకునేవారు. వెనుక సీటులో రేఖ కూర్చునేది.’ జయ, రేఖ ఒక రకంగా సినీ పరిశ్రమలో పోటీదారులు అయినప్పటికీ, జయ ఎంతో ప్రతిభావంతురాలిగా మంచి గౌరవం పొందింది. ఒక ఇంటర్వ్యూలో రేఖపై వ్యాఖ్యానించమని జయను అడిగితే.. రేఖ తనను తాను నటిగా సీరియ్‌సగా తీసుకోలేదని జయ చెప్పింది. ఆ ఇంటర్య్యూలో జయ మాటలు రేఖకు ఏమాత్రం నచ్చలేదని చెబుతారు.

అమితాబ్‌-జయ నటించిన ‘జంజీర్‌’ విజయం సాధించిన తర్వాత అమితాబ్‌, జయ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1973, జూన్‌ 3వ తేదీన, వారి వివాహం ఘనంగా జరిగింది. అయితే రేఖకు ఆహ్వానం అందకపోవటం ఆమెకు బాధ కలిగించింది. ఒక ఇంటర్‌వ్యూలో రేఖ మాట్లాడుతూ, ‘ఒకప్పుడు నేను జయను సోదరిగా భావించాను. ఆమె ఆపేక్ష నిజమనుకున్నాను. ఎందుకంటే ఆమె చాలా గంభీరంగా, ప్రేమపూర్వకంగా నాకు సలహాలు ఇచ్చేది. కానీ నాకొక్కదానికే కాదు, ఆమె అందరికీ సలహాలిస్తుందని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఆమెకు కావలసింది మనుషుల మీద ఆధిపత్యం చలాయించటం మాత్రమే. అది కూడా తనకు అవసరమైనంత వరకే!’ రేఖ అంతటితో ఆగలేదు. ‘ఆమె పైపైన ఎంత ఆప్యాయత, స్నేహం చూపించినా, నేను తానుండే బిల్డింగ్‌లోనే ఉంటున్నా. తన పెళ్లికి మాత్రం నన్ను ఆహ్వానించలేదు’ అంటూ జయ మీద కినుక వ్యక్తం చేసింది.

బచ్చన్‌ ప్రభావం

అందరిలాగే, రేఖ కూడా అమితాబ్‌ వ్యక్తిత్వాన్ని చూసి అప్రతిభురాలైంది. 2004లో సిమి గరేవాల్‌తో ఒక ప్రముఖ ఇంటర్‌వ్యూలో, ‘మిస్టర్‌ అమితాబ్‌ బచ్చన్‌ ముందు నిలబడటం తేలికైన విషయం కాదు’ అని, ‘దో అంజానే’లో అమితాబ్‌ నాయకుడన్న విషయం తెలియగానే ఆమెకు మతిభ్రమించినంత పనైందని చెప్పింది. షూటింగ్‌ సమయంలో తనకెంతో భయంభయంగా ఉండేదని రేఖ గుర్తు చేసుకుంది. భయాందోళనలతో తాను చెప్పవలసిన డైలాగులు మరచిపోతుంటే అమితాబ్‌ బచ్చన్‌ ఒక రోజు తన మంద్రస్వరంలో గంభీరంగా ఆమెను మందలించాడని నవ్వుతూ చెప్పింది రేఖ.

ఇంకా ఆమె ఇలా చెప్పింది. ‘అమితాబ్‌ లాంటి వాళ్లను నేను మునుపెన్నడూ చూసి ఉండలేదు. ఇన్ని మంచి లక్షణాలు ఒకే మనిషిలో ఎలా ఉండగలవు? నేను మూర్ఖురాలిని కాను, తెలివైనదానిననే అనుకుంటున్నాను. ఉత్తమత్వాన్ని చూసినప్పుడు గుర్తించగలను’. అమితాబ్‌ అంకితభావం, చిత్తశుద్ధి, వృత్తిపట్ల శ్రద్ధ రేఖ మనసును చూరగొని, మంత్రముగ్ధురాలిని చేశాయి. అతడు ఆమెపై చూపుతున్న ప్రభావం అందరికీ స్పష్టంగా కనిపించింది.

దీన్ని ‘బచ్చన్‌ ఎఫెక్ట్‌’ (బచ్చన్‌ ప్రభావం) అని పిలవచ్చేమో గాని రేఖ తన జీవితంలో ఎప్పుడూ చేయని పని ఇప్పుడు చేయటం ప్రారంభించింది. ఆమె ‘దో అంజానే’ సెట్స్‌కి ఉదయం 6 గంటలకు, అంటే సరైన సమయానికి చేరుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచేది. ఆమెలో మార్పు అక్కడితో ఆగలేదు. తన పాత్ర గురించి లోతుగా ఆలోచించడం మొదలు పెట్టి, అమితాబ్‌లాగానే పాత్ర చిత్రణలో చక్కటి అంశాలను చర్చించసాగింది. దశాబ్దాల పాటు సినీ పరిశ్రమను ఉర్రూతలూగించే ప్రణయగాఽథకు అలా రంగం సిద్ధమైంది! ‘దో అంజానే’ కారణంగా అందరి దృష్టికి వచ్చిన విషయం ఒకటి లేకపోలేదు. రేఖ తొలిసారి ఒక చక్కటి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఒక్క చిత్రం రేఖకు కొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఔను, ఆమె తహతహలాడిన గౌరవం. దీనికి సంబంధించిన గొప్పతనమంతా అమితాబ్‌కే చెందుతుందన్నది రేఖ. ఒక వ్యక్తిలో ఆమె కోరుకున్న ప్రతి సుగుణానికి అతడు చిహ్నమైనాడు. రేఖ నెమ్మది నెమ్మదిగా అమితాబ్‌ను ప్రేమించసాగింది.

విడిపోవాలని నిర్ణయించుకుంది.

‘చిన్నతనంలో నా మీద మా అమ్మ ప్రభావం ఉన్నట్లే, యౌవనంలో ఆ ప్రభావం నా జీవితంపై ప్రగాఢమైన ముద్ర వేసింది. సమయపాలన, మౌనం, క్రమశిక్షణ, అంకితభావం, ఏకాగ్రత వంటి వృత్తి నైపుణ్యాలు నేను అతడి నుండి నేర్చుకున్నాను. అతడు నా ప్రవర్తనను, జీవనశైలిని ప్రభావితం చేశాడు. నేను శాకాహారిగా మారి, ప్రమాదకరంగా జీవించడం మానేశాను. మార్పు మాత్రమే కాదు, ఆ మార్పు జరిగిన ప్రక్రియ కూడా ఎంతో అందమైనది’ అని ఆమె భావనా సోమయాతో చెప్పింది. ‘ముఖద్ధర్‌ కా సికందర్‌’ విడుదల తర్వాత అమితాబ్‌ రేఖతో కలసి పనిచేయడంపై అతడి భార్య జయ నిషేధం విధించినట్లు విశ్వసనీయ సమాచారం సినీపరిశ్రమలో వేగంగా వ్యాపించింది. ఈ విషయం గురించి రేఖ మాట్లాడుతూ, ‘ఒకవారం తర్వాత (ముఖద్ధర్‌ కా సికందర్‌ ట్రయల్‌ షో తర్వాత) సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ నాతో, ‘అతు’, నాతో పనిచేయనని తన నిర్మాతలకు స్పష్టం చేశాడని చెప్పటం మొదలెట్టారు. కానీ అతడు నాతో ఈ విషయమై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను అతడిని దాని గురించి ప్రశ్నించడానికి ప్రయత్నించినప్పుడు, అతడు ‘ఆ విషయం నన్ను అడగవద్దు, దాని గురించి నేను ఒక్క మాట కూడా మాట్లాడను’ అని తేల్చి చెప్పాడు’ అని చెప్పింది.

అదే ఇంటర్‌వ్యూలో, తాను ఎప్పుడూ ధరించే రెండు ఉంగరాలను అమితాబ్‌ తనకు బహుమతి చేశాడని ఆమె పేర్కొంది. తనతో కలసి పనిచేయడానికి అమితాబ్‌ నిరాకరించటంతో, ఆమె ఆ రెండు ఉంగరాలను తిరిగి ఇచ్చి అతడితో విడిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె మాటల్లోనే, ‘సహజంగానే నేనెంతో కలతపడ్డాను, మేము ఆ తర్వాత విడిపోయాము. ఆ సమయంలో నేను ‘ఖూబ్‌సూరత్‌’లో పని చేస్తున్నాను. నా పాత్రలో త్రికరణశుద్ధిగా లీనమైనాను. సినిమా చివరిభాగంలో నేను నా రెండు ఉంగరాలు ధరించకపోవటం మీరు గమనించవచ్చు. అవి ‘అతడిచ్చిన’ ఉంగరాలు, నేను వాటిని నిద్రపోయేప్పుడు కూడా వేళ్ల నుండి తియ్యను. కానీ విడిపోయినప్పుడు నేను వాటిని అతడికి తిప్పి పంపాను’.

అమితాబ్‌ అవలంభించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని రేఖ పేర్కొంది. ఆమెతో పని చేయకూడదన్న అతడి నిర్ణయానికి జయను బాధ్యురాలిగా నిందించింది. జయ వేదనకంటే తాను అనుభవించే బాధ ఎంతో ఎక్కువ అని రేఖ నాటకీయకంగా నొక్కి చెప్పింది. ‘కొంతకాలం క్రితం ఓ అవార్డు ఫంక్షన్‌లో నేను కొన్ని కవిత్వ పంక్తులు గానం చేశాను. అందరూ ఆ పంక్తులు ‘అతడి’కోసం ఉద్దేశించానని పొరబడ్డారు. నిజానికి ఆ మాటలు జయను ఉద్దేశించి అన్నాను’, అని రేఖ చెప్పింది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Jan 01 , 2024 | 04:34 AM