ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాట కోసమే ప్రయాణం

ABN, Publish Date - Jul 10 , 2024 | 12:52 AM

ఆమె పాటల ప్రవాహం. పేరు వరలక్ష్మి నారాయణమ్‌. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కీర్తనలు, భక్తిగీతాలు ఆలపించే గాయని. ఇందిరా గాంధీ, ఎన్టీయార్‌.. లాంటి ప్రముఖుల సమక్షంలో పాటలు పాడారు. ఒక్కమాటలో చెప్పాలంటే..

ఆమె పాటల ప్రవాహం. పేరు వరలక్ష్మి నారాయణమ్‌. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కీర్తనలు, భక్తిగీతాలు ఆలపించే గాయని. ఇందిరా గాంధీ, ఎన్టీయార్‌.. లాంటి ప్రముఖుల సమక్షంలో పాటలు పాడారు. ఒక్కమాటలో చెప్పాలంటే... అరవై ఏళ్లుగా అలుపెరగని స్వరం ఆమెది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని 108 గుళ్లలో భక్తిగీతాలు పాడటానికి నడుం కట్టిన వరలక్ష్మి నారాయణమ్‌ను ‘నవ్య’ పలకరిస్తే.. తన ప్రయాణాన్ని చెప్పుకొచ్చారిలా..

మేం ఇప్పుడు ముంబైలో ఉంటున్నాం. ఇక్కడ ప్రముఖ దేవాలయాల్లో భక్తిగీతాలు పాడుతున్నా. ముఖ్యంగా మహారాష్ట్రలోని గుళ్లలో హిందీ ఎక్కువగా అర్థం అవుతుంది కాబట్టి హిందీలోనే పాడుతున్నా. ఇక్కడి తెలుగువారిని ఓ బృందంగా చేసి.. వారికి పాటలు నేర్పించి.. కార్యక్రమాలు చేస్తున్నా. ఇలా చేయటమే నాకు పరమానందం!


పసి వయసులోనే పాటల ప్రేమలో..

మాది మంగళగిరి. మా నాన్నగారి పేరు శ్రీభాష్యం నరసింహమూర్తి. గుంటూరు- విజయవాడ మధ్యలో నంబూరు అనే ఊరి దగ్గర ‘హేమలత టెక్స్‌టైల్స్‌’లో మా నాన్నగారు ఉద్యోగం చేసేవారు. అలా ఆ సంస్థ వార్షికోత్సవ సందర్భాన.. ‘లవకుశ’ చిత్రంలోని రెండు పాటల్ని పాడాను. నా తాళజ్ఞానం చూసి సభికులు అందరూ ఆశ్చర్చపడ్డారు. ఎంతో ప్రశంసించారు. ఎందుకంటే.. అప్పుడు నా వయసు కేవలం ఐదేళ్లు. వాస్తవానికి నేనక్కడా పాటలు నేర్చుకోలేదు. గురువే లేరు. మా ఇంట్లోని ‘ఆకాశవాణి.. విజయవాడ కేంద్రం’ అని పలికే మా రేడియోనే నా తొలి గురువని చెప్పొచ్చు. ఎందుకో తెలీదు.. పాటంటే మహా పిచ్చి. ఒకసారి వింటూనే బాణీతో సహా నేర్చుకునేదాన్ని. పుస్తకంలో రాసుకుని మరీ పలుమార్లు సాధన చేసేదాన్ని. పాడమని నన్నడగవలెనా.., నాదీ ఆడజన్మేనా.., నీ లీల పాడెద దేవా.. లాంటి ఎంతో మంచి పాటలు పాడేదాన్ని. ప్రతి పాటల పోటీలో.. దాదాపు మొదటి బహుమతి అందుకునేదాన్ని. ఇందుకోసం తెలివిగా చాలా కష్టమైన పాటలనే ఎంచుకునేదాన్ని.


అలా రేడియోతో అనుబంధం..

అందరిలా కాకుండా.. కాస్త విభిన్నంగా ఇంటర్‌లో ‘మ్యూజిక్‌ గ్రూప్‌’ తీసుకున్నా. అయితే.. కమర్షియల్‌ సినిమా పాటల జోలికి నేనేనాడూ పోలేదు. లలిత గీతాలు, ప్రార్థనా గీతాలు, లైట్‌ మ్యూజిక్‌ పాటలు పాడేందుకు కృషి చేశా. వందల్లో బహుమతులు గెలుచుకున్నా. ఇంట్లో వారి ప్రోత్సాహంతో పాటు ప్రశంసలూ.. పాట మీద మరింత మక్కువను పెంచాయి. 1970 లో అనుకుంటా.. విజయవాడ రేడియో స్టేషన్‌కు ఆడిషన్‌కు వెళ్లా. అక్కడ నుంచి కొన్నేళ్లపాటు విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌ రేడియో స్టేషన్లలో లైట్‌ మ్యూజిక్‌ పాటలతో పాటు ఈ మాసపు పాట.. పాడేదాన్ని. అప్పట్లో ఈ మాసపు పాట.. పాడటమంటేనే గొప్ప విషయం. అరుదైన అవకాశమది. మూన్నెళ్లకోసారి ఈ అవకాశం వచ్చేది. ఆ తర్వాత టేప్‌ రికార్డర్‌ను బాగా ఉపయోగించుకున్నా. నేను పాడిన పాటలు, మ్యూజిక్‌ చేసిన పాటల్ని క్యాసెట్స్‌లో రికార్డు చేశా. తిరుపతిలో.. అక్కడి వేదపాఠశాలలో గోవిందనామాలతో మొదలెట్టి తిరుప్పావై పాశురాలు పాడిన క్షణాలు గొప్పవి!


ఆయనే నా బలం..

బి.ఈడీ చేసినా.. టీచరు ఉద్యోగానికి పోలేదు. ఎందుకంటే గొంతు పోతుందని! మా మేనత్త కొడుకుతోనే పెళ్లయింది. ఆయన పేరు ఎన్‌.ఎ.ఐ.ఎన్‌. మూర్తి. కెమిస్ర్టీ లెక్చరర్‌గా ఉద్యోగం చేసేవారు మా. పెళ్లయ్యాక.. ఇంట్లో బంధువుల పిల్లలు ఉండేవారు. వారు చదువుకునేవారు. ‘మనమే కాదు మన పిల్లలూ బాగుపడితేనే.. మనం బాగుపడినట్లు’ అనేవారాయన. ఇకపోతే.. ఫంక్షన్లకు పాటలు పాడటానికి వెళ్లేదాన్ని. పిల్లలు పుట్టాక కూడా.. ఈ పాటలెందుకూ? అని ఏనాడూ అనలేదు. పైగా ‘పాటంటే నీకు ఇష్టం. హాయిగా పాడుకో’ అనేవారు. తన ఖాళీ సమయంలో నాతో పాటు వచ్చి.. కొన్ని కార్యక్రమాలకు స్వయంగా ఆయనే వ్యాఖ్యానం చేసేవారు. ఆ తర్వాత నేను ఆలపించేదాన్ని. కొన్నాళ్ల తర్వాత.. నేనే వ్యాఖ్యానం చేయటం అలవాటు చేసుకున్నా. ఒకసారి కొందరు మహిళలంతా కలసి ‘ఘంటసాల జయంతి చేద్దా’మని అడిగారు. వాళ్లంతా కూనిరాగం తీసేవాళ్లే. కొన్ని రోజుల పాటు వారితో సాధన చేయించా. దాదాపు వంద మందికి పైగా వేదికను ఎక్కించి ఘంటసాల (జానపద, ప్రేమ, హుషారు, భక్తి గీతాలు) పాడించాను. ఆ రోజు.. వారి ఆనందానికి హద్దుల్లేవు. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే బ్రెయిన్‌ స్ర్టోక్‌తో చనిపోయింది. ఆ విషాదాన్ని తట్టుకోలేకపోయా. గంటల పాటు ఏడ్చేదాన్ని. ఇలా అయితే ఇబ్బందని గ్రహించి.. మా ఆయన తోడుగా నిలిచారు. కావాలనే నిర్వాహకులతో మాట్లాడి.. పాటల కార్యక్రమాలకు నన్ను తీసుకెళ్లారు. అలా విషాదాన్ని మెల్లమెల్లగా మర్చిపోయా. ఆ సమయంలో చాలామంది బతకను అనుకున్నారు. అయితే నాకు పాటే ఊపిరి అయ్యింది.. పాటే బతుకయ్యింది.


నేనేనా అనిపిస్తుంది..

మా వారి ఉద్యోగ బదిలీ.. నా కొడుకు చదువుల నిమిత్తం కోసమై మచిలీపట్నం, విజయవాడ, తిరుపతికి మకాం మార్చాం. కొన్ని పదుల ఏళ్ల నుంచీ.. తిరుపతే మా ఇల్లుగా మారిపోయింది. ఆ రోజుల్లో.. ఆర్కెస్ట్రా తీసుకుని వెళ్లి.. తిరుపతిలోని గుళ్లన్నీ తిరిగి పాటలు పాడటం ఇబ్బందితో కూడుకున్నదే. పాటమీద గౌరవం, భక్తి కాబట్టే కష్టాన్నయినా ఇష్టంగా భరించా. వేల కిలోమీటర్లు తిరిగా. అన్నమాచార్య కీర్తనలు, వేంకటేశ్వర స్వామివారి పాటలు, మంగళహారతులు, ప్రార్థనా గీతాలను ఎక్కువగా పాడేదాన్ని. దేశంలోని 150 పుణ్యక్షేత్రాల్లో భక్తి గీతాలు పాడే గొప్ప అవకాశం నాకే లభించింది. 35 మంది పీఠాధిపతుల సమక్షంలో ఆలపించాను. భక్తిగీతాలు పాడటానికి సింగపూర్‌, మస్కట్‌, నేపాల్‌, దుబాయ్‌ దేశాలకూ వెళ్లాను. తరిగొండ వెంగమాంబ పాటల్ని సప్తగిరి టీవీ ఛానల్‌లో తొలిసారి పాడింది నేనే. రేడియో, టీవీల్లో పదుల సంవత్సరాలనుంచీ పాడుతున్నా విసుగేరాదా? అని కొందరు అడుగుతుంటారు. ‘కొన ఊపిరి వరకూ పాడుతా’ అంటుంటా వారితో. అప్పట్లో సినిమా ఫంక్షన్లలో.. కార్యక్రమానికి ముందు భక్తిగీతం నేను పాడితే అదో సెంటిమెంట్‌గా భావించేవారు. ఎన్టీయార్‌, ఏఎన్నార్‌, రాజబాబు, జమున, జయప్రద, దాసరి..లాంటి వారి ముందు నా గానం ఆలపించాను. ఇందిరా గాంధీ, సంజయ్‌ గాంధీ.. దగ్గర నుంచి రోశయ్యగారి దగ్గరి వరకూ ఎంతో మంది రాజకీయ నాయకుల కార్యక్రమాల్లో పాడాను. దాదాపు అందరూ నా గొంతును మెచ్చుకున్నవారే. అరవయ్యేళ్లు వెనక్కి తిరిగి చూస్తే నేనేనా ఈ పాటలు పాడింది అనిపిస్తుంది.

రాళ్లపల్లి రాజావలి


అదే నా లక్ష్యం!

ప్రస్తుతం మా కొడుకుతో కలసి ముంబైలో ఉంటున్నాం. ఇక్కడ కూడా వివిధ రంగాల్లో పని చేసే మహిళలను.. ఒక్క తాటిపైకి తీసుకొచ్చి.. శిక్షణ ఇచ్చి.. తీర్చిదిద్ది.. దేవాలయాల దగ్గర భక్తి పాటలు పాడిస్తున్నా. ఇలా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ పని చేయటం..నాకెంతో సంతృప్తినిస్తుంది. గుళ్ల దగ్గర భరతనాట్యం చేయాలని ఆసక్తి చూపే వారితో ప్రోగ్రామ్స్‌ చేయిస్తా. ఇలా మహిళల ప్రతిభను ప్రోత్సహిస్తుంటా. వేంకటేశ్వర స్వామి, రాఘవేంద్రస్వామి, షిరిడీ సాయి మీద సొంతంగా పాటలు చేశా. అన్నట్లు అరవై ఐదేళ్ల వయసులో ఇంత వేగంగా పని చేస్తున్నానంటే.. ఇప్పుడు ఆర్కెస్ర్టా సహకారం అవసరం లేదు. ఎందుకంటే.. నేను పాడే పాటలన్నింటికీ ట్రాక్‌ చేయించుకున్నా. ఒక్క స్మార్ట్‌ఫోన్‌, స్పీకర్లతోనే కార్యక్రమాలను సులువుగా చేస్తున్నా. ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గెలిస్తే 108 దేవాలయాల్లో పాటల కార్యక్రమాలు చేస్తానని మొక్కుకున్నా. తొలి అడుగు అన్నవరం దేవాలయం నుంచి ప్రారంభించా. ఇప్పటికే 15 దేవాలయాల్లో పాడాను. మొత్తం 108 దేవాలయాల్లో పాడాలన్నదే.. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం. ఇప్పటికైతే గొంతు బావుంది. బతికి ఉన్ననాళ్లూ పాటతోనే సావాసం చేస్తా. పాటకోసమే ప్రయాణం చేస్తా. పాటే ప్రాణం. పాటే జీవితం’.

Updated Date - Jul 10 , 2024 | 12:52 AM

Advertising
Advertising
<